Mother's Day : అమ్మను అర్థం చేసుకుంటున్నామా?

by Javid Pasha |

వృద్ధాశ్రమాల్లో పెరుగుతున్న తల్లుల సంఖ్య నేటి సమాజానికి ఒక హెచ్చరిక. వారికి ఖరీదైన నగలు, బట్టలు, ఆస్తులు అవసరం లేదు. కేవలం తన బిడ్డల చెంతనే ఉండాలని అమ్మ కోరుకుంటుంది.

Mothers Day : అమ్మను అర్థం చేసుకుంటున్నామా?
X

దిశ, ఫీచర్స్ : అమ్మ.. ప్రపంచంలో ఏ భాషలో పిలిచినా ఈ పిలుపులో ఉండే మాధుర్యమే వేరు అంటారు పెద్దలు. నిజానికి ‘దేవుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడు’ అని చెబుతుంటారు. అమ్మతనంలోని గొప్పతనానికి ఇలాంటి నిదర్శనాలెన్నో ఉన్నాయి చరిత్రలో.. తన బిడ్డల్ని తీర్చి దిద్దే క్రమంలో అమ్మ పడే తపన, ఆమె చేసే పోరాటం త్యాగాలతో నిండినది. అలాంటి అమ్మ ప్రేమను మదర్స్ డే సందర్భంగా మరోసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం పదండి.

తొలి గురువు అమ్మ..

అవును జీవితం అనే పాఠశాలకు మొట్ట మొదటి గురు అమ్మే. మనం అక్షరాలు నేర్చుకోకముందే ప్రేమను పంచుతూ భావాలను నేర్పే టీచర్ అమ్మ. బిడ్డ తడబడే అడుగులకు ఆసరాగా నిలిచి, లోకాన్ని ఎలా చూడాలో, సమాజంలో ఎలా బతకాలో, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో, ఎవరితో ఎలా వ్యవహరించాలో చెప్పే మహా పండితురాలు అమ్మే. నిజానికి అమ్మ చెప్పే మాటలు, అమ్మ ఇచ్చే ధైర్యం ఏ పుస్తకాల్లోనూ దొరకదు. తన అనుభవాలను పాఠాలుగా మార్చి బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే సర్వస్వం అమ్మ. అమ్మ సృజనాత్మకత ముందు ప్రపంచమే చిన్నబోతుంది. అమ్మ కదా ఎంతైనా..

త్యాగానికి ప్రతిరూపం..

ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకు/కూతురు చిన్న పిల్లల్లాగే కనిపిస్తారు. పిల్లలు ఏ స్థాయిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అమ్మ ప్రేమ మారదు. ఒక సామాన్య గృహిణి నుంచి అత్యున్నత పదవుల్లో ఉన్న మహిళ వరకు ప్రతీ తల్లి తన సంతానం కోసం ఏదో ఒక సందర్భంలో తన సొంత ఇష్టాలను, ఆలోచలను, అవకాశాలను సైతం వదులుకుంటుంది. ఎంతో చదువుకొని, గొప్ప ఆశయాలు, లక్ష్యాలు ఉన్నప్పటికీ, తమ పిల్లల పెంపకం కోసం వాటన్నింటినీ పక్కన పెట్టేసిన తల్లులు ఎందరో ఈ ప్రపంచంలో.. తనకంటూ వ్యక్తిగత సమయాన్ని సైతం తీసుకోకుండా 24 గంటలు పిల్లలకోసం, కుటుంబం కోసం శ్రమించే నిరంతర శ్రామికురాలు కేవలం అమ్మ మాత్రమే. తన ఆరోగ్యం బాగోలేకపోయినా.. తన బిడ్డలకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేక బాధను దాచుకొని సేవలు అందించే త్యాగమయి అమ్మ.

అమ్మ ప్రేమలో మానసిక కోణం

అమ్మ ప్రేమ కేవలం ఆప్యాయతకే పరిమితం కాదు. తన పిల్లల విషయంలో అదొక గొప్ప మానసిక భరోసాను కూడా ఇస్తుంది. పిల్లలు అలసి సొలసినప్పుడు, చదువుల్లో, ప్రేమల్లో, పరీక్షల్లో, జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు, వైఫల్యాలు వెంటాడుతున్నప్పుడు ఈ లోకం మనల్ని విమర్శిస్తుంది. ఇష్టమొచ్చినట్లు విశ్లేషిస్తుంది. కానీ అమ్మ ఒక్కతే తన బిడ్డలోని లోపాలను సైతం ప్రేమిస్తుంది. వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది. తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని చూస్తుంది. మన మీద మనకే నమ్మకం పోయినప్పుడు ‘బిడ్డా నీవేం భయపడకు.. పోతే పోనీ.. నువ్వేదైనా చేయగలవు. ఏదైనా సాధించగలవు’ అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అమ్మే. ఓటమిలో ఓదార్పునిస్తుంది అమ్మ. గెలుపులో వెనుకుండి నడిపిస్తుంది అమ్మ.

ఈతరం బాధ్యత?

తన సంతానం కోసం ఎంతో త్యాగం చేసే అమ్మను ఆ సంతానమే పట్టించుకోకపోవడం ఎంత బాధాకరమైందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క మదర్స్ డే జరుపుకోవడంతోనో, శుభాకాంక్షలు చెప్పడంతోనో సరిపోదు. అమ్మ మిమ్మల్ని ఎలా చూసుకుందో అమ్మకు చేతకాని వయసులో మీరు కూడా అలా చేసుకోవాలి అంటారు పెద్దలు నిపుణులు. నిజమే కదూ.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు మనం ఇచ్చే గౌరవమే వారికి నిజమైన మదర్స్ డే కానుక. మరో విషయం గుర్తుంచుకోవాలిక్కడ. ఇటీవల వృద్ధాశ్రమాల్లో పెరుగుతున్న తల్లుల సంఖ్య నేటి సమాజానికి ఒక హెచ్చరిక. వారికి ఖరీదైన నగలు, బట్టలు అవసరం లేదు. కేవలం తన బిడ్డల చెంతనే ఉండాలని అమ్మ కోరుకుంటుంది. తనను అమ్మా అని పిలుస్తుంటే.. తన కుటుంబం తన కళ్లముందే సంతోషంగా గడుపుతుంటే చూస్తూ మురిసిపోవాలని భావిస్తుంది పిచ్చితల్లి. ఈ సృష్టికి మూలం అమ్మ.. త్యాగానికి ప్రతీక అమ్మ. అందుకే అమ్మను అర్థం చేసుకోండి! వృద్ధాశ్రమాల్లో వదిలేయకండి.

Next Story