- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mother's Day : అమ్మంటే.. పిలుపులో మమకారం.. అడుగులో ధైర్యం..
సొంత ఆలోచనలను, అభిరుచులను, ఆసక్తులను అన్నింటినీ కాదని, పిల్లలే ప్రపంచంగా బతికేస్తుంది అమ్మ

దిశ, ఫీచర్స్ : మదర్స్ డే అనగానే.. ఈ జనరేషన్‌కి ఠక్కుమని గుర్తొచ్చేది ఏమిటో తెలుసా? అమ్మకు శుభాకాంక్షలు చెప్పడం, అమ్మతో ఒక సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. ఎన్నడూ లేనంత ప్రేమను ఒలకబోస్తూ వీడియో తీసిఇన్ స్టాలో పోస్ట్ చేయడం. సోషల్ మీడియా యుగంలో ఇదొక భాగం. కానీ అమ్మ ప్రేమ ముందు ఇవన్నీ చాలా చిన్నవి. వీటన్నింటికీ అతీతమైనది తల్లి ప్రేమ. ఇంటి నాలుగ్గోడల మధ్య ఏ రోజూ సెలువు తీసుకోని అమ్మ ప్రతీ పిలుపులో మమకారం దాగుంది. అమ్మ తపనలో, అమ్మ అడుగు జాడల్లోనే ఎనలేని ధైర్యముంది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడే అవ్యక్త సైన్యం అమ్మంటే..!
అమ్మ త్యాగం, అమ్మ తపన
ప్రతిరోజూ ఉదయం మనం ఎప్పుడు లేస్తాం. ఈరోజుల్లో పిల్లలైతే నిద్రలేవడానికి బద్దకిస్తున్నారు. ఏ ఏడెనిమిది గంటలకో లేచి హడావిడిగా స్కూళ్లకు, కాలేజీలకు, డ్యూటీలకు ఆగమాగం వెళ్లేవాళ్లు ఎంతోమంది. కానీ అమ్మ అలా కాదు. పాతకాలపు అమ్మ అయినా, ఆధునిక కాలంలో అమ్మ అయినా అమ్మ పాత్ర అదే విధంగా ఉంది. ప్రతిరోజూ ఉదయం అందరికంటే ముందుగా మేల్కొని, రాత్రి అందరూ నిద్రపోయాక పడుకునే అమ్మ రోజువారీ జీవితంలో లెక్కలేనన్ని త్యాగాలు ఉంటాయి. అందుకే అమ్మంటే త్యాగాల కల్పవల్లి. తన సొంత ఆలోచనలను, ఆరోగ్యాన్ని, అభిరుచులను, ఆసక్తులను అన్నింటినీ కాదని పిల్లలే ప్రపంచంగా, ఇల్లే స్వర్గంగా భావిస్తుంది అమ్మ. తన కెరీర్‌ను పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం ఆశపడే తల్లులు కొందరైతే.. బయట ఉద్యోగం చేస్తూ, కూలి పని చేస్తూ, కూరగాయలమ్ముతూ, అంట్లు తోముతూ, పొలం పనులు చేస్తూ ఇంటి బాధ్యతలను ఏమాత్రం విస్మరించని తల్లలు మరికొందరు. ఇక్కడ విషయం కేవలం వంట చేయడం, పిల్లలను చూసుకోవడమే కాదండోయ్.. మొత్తం కుటుంబాన్ని మానసిక ఒత్తిడి నుంచి కాపాడే గొప్ప మానసిక నిపుణులు అమ్మ మాత్రమే. అందుకే అమ్మ ప్రేమకు ఏదీ సాటిరాదు అంటారు.
అంతరంగాన్ని పసిగట్టే నిపుణురాలు అమ్మ
మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ ప్రపంచంలో ఏ సైకాలజిస్టుకు తెలియనంత బాగా, ఏ దేవుడూ ఎరగనంత రహస్యం, ఏ నిపుణుల ఆలోచనకూ అందనంత లోతైన బాడీలాంగ్వేజ్ తెలిసేది కేవలం అమ్మకు మాత్రమే. నువ్వు అడగక ముందు, నీకు ఆకలి వేస్తుందని గ్రహించేస్తుంది. నువ్వు చెప్పక ముందే నిన్ను ఏదో వాధ వెంటాడుతుందని తేల్చేస్తుంది. నీ మాటలోని తడబాటును, నీ గొంతులోని చిన్న మార్పును అమ్మ ఇట్టే పసిగట్టేస్తుంది. నీకేం కావాలో నిన్ను అడగకుండానే సమకూర్చుతుంది. పిల్లలంటే ఎంత ప్రేమో కదా పిచ్చితల్లికి. ప్రపంచమంతా నీవైపు వేలెత్తి చూపిస్తున్నా అమ్మ మాత్రం నువ్వు పెద్దవాడివైనా చిన్న పిల్లాడిలా వేలుపట్టి నడిపినట్టు నడిపిస్తుంది. ‘నువ్వు ఏదైనా చేయగలవు, సాధించగలవు, బయట పడగలవు’ అంటూ భుజం తట్టి ధైర్యం చెబుతుంది. ఒక మనిషికి మరో మనిషి ఇచ్చే అత్యున్నతస్థాయి మానసిక మద్దతు కేవలం అమ్మ ద్వారానే లభిస్తుంది. అందుకే ప్రేమ ఎన్నటికీ తరగని నిధి లాంటిది అంటుంటారు పెద్దలు.
కాలం మారినా.. తరగని ప్రేమానుబంధం
మనం ఎంతోమందిని చూస్తున్నాం కదా.. మనషులు మారుతారు. మనస్తత్వాలు మారుతాయి. స్నేహాలు మారుతాయి. ప్రేమలు మారుతాయి. కాలం మారుతుంది. కాలంతోపాటు అన్నీ మారుతాయి. కానీ పిల్లలపట్ల అమ్మ ప్రేమ ఎన్నటికీ మారదు. ఎప్పుడూ అదే ప్రేమ. కోపంలో, ఆనందంలో, ఆవేశంలో, బాధలో, బాధ్యతలో ఏ విషయంలోనైనా అమ్మ కలుగజేసుకున్నదంటే.. ప్రేమతోనే తప్ప స్వార్థమనే మాటకు తావులేదు. నేటి ఆధుని కాలంలో ఉద్యోగాల రీత్యా పిల్లలు అమ్మలకు దూరంగా ఉంటున్న పరిస్థితులను చూస్తున్నాం. ఇలాంటప్పుడు ఫోన్ కాల్ లేదా వీడియో కాల్‌తోనే మమకారం ముడిపడి ఉంటున్నది. ఏడాదికోసారి అమ్మకు బహుమతులు తీసుకెళ్లేవారు కూడా కనిపిస్తుంటారు. కానీ అమ్మకు కావలసింది ఇదేనా? కానే కాదు. ఖరీదైన బహుమతలు అమ్మకు ముఖ్యం కాదు. కేవలం తన పిల్లలు క్షేమంగా ఉన్నారనే సమాచారం కావాలి అమ్మకు. ఏమాత్రం సమయం దొరికినా తన పిల్లలు తనతో గడిపే సమయం కావాలి అమ్మకు. వృద్ధాప్యంలోనూ ఏ వృద్ధాశ్రమంలోనే వేయకుండా అంతే ప్రేమతో, అంతే గౌరవంతో తనను చూసుకునే సంతానమే మహా భాగ్యం అమ్మకు. ఇదే మీరు తల్లికిచ్చే అత్యంత విలువైన బహుమతి. మదర్స్ డే అంటే ఏడాకోసారి జరుపుకునే పండుక కాదు. మన ప్రతీ అడుగులో, మన ప్రతీ ఎదుగుదలలో ఆమె కష్టం ఉందని గుర్తుంచుకోండి. అమ్మంటే కేవలం ఒక వ్యక్తి కాదు. తన పిల్లలను నడిపించే ఒక వ్యవస్థ. ఎవరికీ అంతుపట్టని గొప్ప శక్తి. అందుకే అమ్మకేం కావాలో తెలుసుకోండి. అమ్మకోసం అన్నీ చేయండి.. హ్యాపీ మదర్స్ డే.






