Viral story : ఇడ్లీ అమ్మ.. గుండె నిండా ప్రేమగల్ల పేదల అమ్మ!

by Javid Pasha |

వడివేలం పాలయం గ్రామంలో నివసించే వృద్ధురాలే ఇడ్లీ అమ్మ. ఒక్క రూపాయికే ఇడ్లీ అమ్ముతూ ఎంతోమంది పేదల ఆకలి తీరుస్తోంది

Viral story : ఇడ్లీ అమ్మ.. గుండె నిండా ప్రేమగల్ల పేదల అమ్మ!
X

దిశ, ఫీచర్స్ : మనషులెందరో తారస పడుతుంటారు. మంచి మనసున్న వారు మాత్రం కొందరే కనిపిస్తుంటారు. ఆస్తులూ అంతస్తులు లేకపోయినా గుండెల నిండా ప్రేమ, జాలి, దయ నింపుకొని ఉంటారు. ఏదో ఒక రూపంలో ఇతరులకు సహాయపడుతుంటారు. సమాజానికి తమవంతు సేవ చేస్తుంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తే ఇడ్లీ అమ్మ. ఇది రియల్ నేమ్ కాదు. ప్రజలు ప్రేమగా పిలుచునే పేరు. తాజాగా ఆమె గురించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మంచి తనానికి నిలువెత్తు నిదర్శనం అమ్మా నీవు.. అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఎవరా ఇడ్లీ అమ్మ. ఆమె చేస్తున్న మేలేమిటి? తెలుసుకుందాం పదండి!

లాభం కాదు.. సహాయం

అది తమిళనాడు రాష్ట్రం, కోయంబత్తూరు సమీపంలోని వడివేలం పాలయం గ్రామం. ఇక్కడ నివసించే 70 ఏండ్లుపైబడిన వృద్ధురాలే ఇడ్లీ అమ్మ. అసలు పేరు కమలతల్. స్థానిక ప్రజలు ప్రేమగా ‘ఇడ్లీ అమ్మ’ అని పిలుస్తారు. ఎందుకంటే ఆమె గత 30 ఏండ్లుగా కేవలం ఒక్క రూపాయికే ఇడ్లీ (ఇడ్లీ+ చట్నీ + సాంబార్) అమ్ముతున్నది. ప్రతిరోజూ ఉందయం 5 గంటలకే నిద్రలేచి వందలాది ఇడ్లీలు తయారు చేస్తుంది. ఆరు గంటలకే ఆమె నిర్వహిస్తున్న చిన్నపాటి షాప్ తెరుచుకుంటుంది. ఒక్క రూపాయే కాబట్టి రోజువారీ కూలీలు, రైతులు, పేదలు ఆమె వద్దకు ఇడ్లీ తినడం కోసం వస్తుంటారు. ఇది విన్నవారెవరికైనా వెంటనే ఆశ్చర్యం వేస్తుండవచ్చు. ఒక్క రూపాయికే అమ్మితే ఎలా గడుస్తుంది? ఏం లాభం వస్తుంది? అనే సందేహలు కలగడం సహజమే. కానీ ఇది వాస్తవం. ఎందుకంటే ఆమె లాభం కోసం అలా చేయడం లేదు. పేదల ఆకలి తీర్చాలనే తపనతో, సామాజిక సేవా దృక్పథంతో, పుణ్యం వస్తుందనే భావనతో తనవంతు సహాయంగా చేస్తున్నది.

సవాలుగా మారినా.. సేవా మార్గంలోనే..

కమలతల్ (Viral story) తయారు చేసిన ఇడ్లీలు రుచికి మాత్రమే కాదు. అవి ప్రేమతో నిండినవి కూడా అంటుంటారు అక్కడికి వచ్చే కస్టమర్లు. ఇంత చేస్తున్నా ఆమె ఏ ఒక్కరి నుంచి ఆర్థిక సహాయం ఆశించకుండా.. తన వద్ద ఉండే బియ్యం, మినపప్పు వంటివి ఉపయోగించి ఇడ్లీలు తయారు చేస్తుంది. కస్టమర్లు పెరగడంతో ఖర్చు భరించడం కాస్త సవాలుగా మారినప్పటికీ, ఆమె తన సేవా గుణాన్ని, దయా గుణాన్ని వదులుకోలేదు. ప్రధానంగా ఆమె తన షాప్ నుంచి వచ్చే మినిమల్ ఆదాయం, కుటుంబ సహాయం, తన వైరల్ కథ తర్వాత వచ్చిన బహుమతులు, డొనేషన్లతో ఒక్కరూపాయికి ఇడ్లీ అమ్మడం ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఇడ్లీ అమ్మ భర్త మరణించాడు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. అతను కూడా ఆమెతో కలిసి గ్రామంలోనే ఉంటున్నాడు. అతను కూడా అమ్మకు కొంత సహాయం చేస్తాడు. ఇడ్లీ అమ్మ కుటుంబం ఇప్పటికీ పేదరికంలోనే జీవిస్తున్నప్పటికీ సమాజం నుంచి ఆమెకు సపోర్ట్ లభిస్తున్నది.

ఆనంద్ మహీంద్ర సహాయం..

ఇడ్లీ అమ్మ( కమలతల్) గురించి 2019లో బాగా వైరల్ అయింది. అప్పట్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన ఆనంద్ మహీంద్ర ఆమె సేవా గుణానికి ఫిదా అయిపోయారు. ఆమె వీడియోను ట్వి్ట్టర్‌(ఎక్స్)లో షేర్ చేసి, ఆమెకు సహాయం చేయాలని ప్రకటించారు. ఆయన కూడా హెల్ప్ చేశారు. ఆమెకు ఒక LPG స్టవ్, కిచెన్ ఎసెన్షియల్స్ ఇచ్చారు. భారత్ పెట్రోలియం గ్యాస్ కనెక్షన్, వెట్ గ్రౌండర్ అందించింది. 2022లో మదర్స్ డే రోజున ఆనంద్ మహీంద్ర ఇడ్లీ అమ్మకు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.12 లక్షల విలువైన ఒక కొత్త ఇల్లు(హోమ్-కమ్-వర్క్‌స్పేస్)ను బహుమతిగా ఇచ్చారు. కోవిడ్ సమయంలో కూడా మలతల్ తన సేవకు బ్రేక్ ఇవ్వలేదు. ప్రస్తుతం (2026లో) కూడా ఆమె ఒక్క రూపాయికే ఇడ్లీ అమ్ముతున్నది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇడ్లీ అమ్మ.. ఎంతోమంది గరీబోల్ల ఆకలి తీరుస్తున్న మనసున్న అమ్మ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు పలువురు.

Next Story