రామ రామ రామ ఉయ్యాలో..!!

by Daayi Srishailam |

బతుకమ్మ.. ఎప్పటికీ మరచిపోని ఒక స్వచ్ఛమైన యాది

రామ రామ రామ ఉయ్యాలో..!!
X

దిశ, ఫీచర్స్: బతుకమ్మ అంటే మా పండుగ. ఆడబిడ్డ పండుగ. అసలు బతుకమ్మ పండుగ వస్తుందంటే ఎంత సంబరమైతది తెలుసా.? నేనైతే ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్లిపోతా. ఎంగిలిపూల బతుకమ్మకు చేసిన హడావిడి, సద్దుల బతుకమ్మ నాటి సందడి అంతా కళ్లముందు తిరుగుతూ ఉంటుంది. అందుకే బతుకమ్మ.. ఎప్పటికీ మరచిపోని ఒక స్వచ్ఛమైన యాది. ఆడబిడ్డకు స్వీట్ మెమొరీ.

జట్టుగా పూలవేట..

నేను పెరిగిందంతా హైదరాబాద్‌లోనే అయినా బతుకమ్మ పండగ వచ్చిందంటే ఊరికి వెళ్లేవాళ్లం. ముఖ్యంగా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లేది. ఊళ్లో పండగ అంటే చిన్న కథనా.? మస్తు హడావిడి ఉండేది. మిగతా పండగ రోజులు ఏమోగానీ బతుకమ్మ అనేసరికి పచ్చని వాతావరణం ఉంటుంది కదా అని ఎగిరి గంతేసేది. ఇక పూల సంబరం చూడాలి. కొందరు పూలకోసం పోటీలు పడేవాళ్లు. నిజంగా అదొక వేట అనుకోవాలి. పుస్తకాలలో చదివేవాళ్లం కదా ఫలానా రాజు వేటకు వెళ్లేవాడు అనీ.. అలా మేం పూల వేటకు వెళ్లేవాళ్లు అప్పట్లో. నిజంగా అప్పుడైతే బతుకమ్మ వెనక ఉన్న చరిత్ర, నేపథ్యం లాంటివి పెద్దగా తెలియదు కానీ.. బతుకమ్మ అంటే మాత్రం పులకరించిపోయేవాళ్లం.

మామయ్య తెచ్చే తంగేడు..

మా అమ్మమ్మ వాళ్లది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట. దసరా సెలవులొస్తే చాలు ఠక్కున రామన్నపేటలో వాలిపోయేవాళ్లం. బతుకమ్మ పండగ వచ్చేదాక చిన్న బతుకమ్మ పేర్చి వాడకట్టులో ఆడుకునేవాళ్లం. ఇక బతుకమ్మ పండుగ రోజైతే మా చిన్న మామయ్య ఊరవతల ఉన్న గుట్టల్లోకి వెళ్లి తంగేడు పువ్వు తీసుకొచ్చేవాడు. అంతకన్నా రెండు మూడు రోజుల ముందే గునుగు పూలు, ఉప్పు పూలు తీసుకొచ్చేది. ఇవి ముందుగా తీసుకొచ్చి ఆరబెట్టేవాళ్లు. పండగనాడు పొద్దున్నే మాత్రం తంగేడు పువ్వు, కట్ల పూలు, గుమ్మడి పూలు, అడవి చామంతి తెచ్చేవాళ్లు. పూలతో పాటు బతుకమ్మను పేర్చడంలో అవసరమయ్యే పెద్ద పెద్ద ఆముదం ఆకులు, సీతాఫలం ఆకులు తీసుకొస్తుండె.

అమ్మ, అమ్మమ్మ పేరుస్తుంటే..

మధ్యాహ్నం అన్నం తిని చాప పరిచేది అమ్మమ్మ. ఆ చాపలో పూలన్నీ పోసేది. అమ్మ, అమ్మమ్మ, చిన్న మామయ్య కలిసి బతుకమ్మను పేర్చేవాళ్లు. ఒకొక్క పువ్వును ఒకొక్క వరుసలో పేరుస్తుంటే అదొక అందమైన ఇంటిని పేర్చిన అనుభూతి కలిగేది. ఇక నేను, మా పెద్ద మామయ్య కూతురు వాళ్లకు పూలు అందిస్తుండేవాళ్లం. మేం ఇచ్చే పూలను బట్టే బతుకమ్మ ఎంత అందంగా వస్తుందనేది ఆధారపడి ఉండేది. అంటే ఎంత పడితే అంతా.. ఎలా పడితే అలా ఇస్తే కుదురదు. తంగేడు పూలు ఒకరం.. గునుగు పూలు ఒకరం ఇలా వంతులు పెట్టుకొని చిన్న చిన్న కట్టల సైజులో చేతులకు తీసుకొని అన్నీ ఒకే పరిమాణంలో ఉండేలా అందించేవాళ్లం. గునుగు పూలలో ఒకట్రెండు వరుసలకు నీలం రంగుగానీ, జాజి రంగుగానీ అద్దేవాళ్లం. అలా మా చేతులు రంగుతో మెరిసేవి.

చప్పట్ల సంగీతం..

సాయంత్రానికల్లా కొత్త బట్టలతో అందంగా ముస్తాబయ్యేవాళ్లం. ఆ వాడకట్టులోనే బతుకమ్మ ఆడేది. ఇప్పటిలా ఎవరి ఇంటిముందు వాళ్లే బతుకమ్మను పెట్టుకొని డీజీ పాటలకు డ్యాన్స్ చేయడం కాదు. ఊరొళ్లంతా ఒక గుడి దగ్గరికిగానీ, లేదా కచ్చీర్ దగ్గరికి గానీ, లేదా పంతులు వాళ్ల ఇంటి ముందుగానీ బతుకమ్మలు పెట్టి ఆడుతుండేది. అవి ఇప్పటిలా డీజే బతుకమ్మ పాటలు కాదు. "రామ రామ రామ ఉయ్యాలో", "చిత్తూ చిత్తుల బొమ్మ", "ఇద్దరక్క చెల్లెండ్లు ఉయ్యాలో ఒక్కూరికిచ్చిండ్రు ఉయ్యాలో" వంటి అచ్చమైన బతుకమ్మ పాటలు పాడుతూ చప్పట్లు కొట్టుకుంటూ బతుకమ్మల చుట్టూ తిరిగేవాళ్లు. ఒక పెద్దావిడ మధ్యలో నిలబడి పాట చెప్తుంటే మిగతావాళ్లు అందుకునేది. అందరూ ఒకేసారి చప్పట్లు, గాజుల చప్పుళ్లు చేస్తుంటే ఆ సౌండ్ సంగీతంలా వినిపించేది.

ఎంత గోల చేసినా..

పెద్దవాళ్లు పాడుతున్న పాటలకు కోరస్ ఇస్తూ బతుకమ్మ ఆడేవాళ్లం. కొంచెం అలిసిపోయి హమ్మయ్యా అని పక్కకు జరిగిత చాలు అక్కడున్న తాతలు ఆటపట్టించేవాళ్లు. "చిన్నపోరలు.. రెండు అడుగులెయ్యంగనే నడుములు గుంజుతున్నయా.. పోర్రీ మంచిగ ఒంగి ఆడున్రీ" అని మళ్లీ పంపించేది. ఆటలు అయిపోగానే మామయ్యలు, అన్నలు వాటిని చెరువు దగ్గరకు తీసుకెళ్లేవాళ్లు. మేమూ వస్తామని ఎంత గోల చేసినా వద్దంటే వద్దని రానిచ్చేవాళ్లు కాదు. ఎందుకంటే అప్పుడు ఊర్లలో చెరువుల నిండా నీళ్లుండేవి. నీళ్లతో జాగ్రత్తగా ఉండాలని రానియ్యకపోయేవాళ్లు. ఇక మేం ముఖాలు మాడ్చుకుని ఇంట్లోకి వచ్చేవాళ్లం. అవన్నీ గుర్తుకొస్తే మళ్లీ చిన్నప్పటిలా బతుకమ్మ ఆడాలని ఉంది. కానీ డీజీ మోతలతో డ్యాన్సుల తప్ప చప్పట్ల చప్పుడు వినిపిస్తుందా.?

- నిఖిత నెల్లుట్ల, ఉప్పల్

Next Story