థైరాయిడ్ సమస్యకు కొత్త పరిష్కారం.. లో- లెవల్ లేజర్ థెరపీ!

by Javid Pasha |

క్రానిక్ ఆటో ఇమ్యూన్ థైరాయిడిటిస్ బాధితులపై పరిశోధకులు లో-లెవల్ లేజర్ థెరపీ ప్రభావాన్ని పరిశీలించారు.

థైరాయిడ్ సమస్యకు కొత్త పరిష్కారం.. లో- లెవల్ లేజర్ థెరపీ!
X

దిశ, ఫీచర్స్ : థైరాయిడ్.. ప్రస్తుతం అనేకమందిని వేధిస్తున్న సమస్య ఇది. మెడభాగంలో గొంతుకింద బటర్‌ఫ్లై ఆకారంలో ఉండే ఈ చిన్న గ్రంథి థైరాయిడ్ హార్మోన్లు (T3, T4) ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీరంలో శక్తి వినియోగం, మెటబాలిజం, హార్ట్‌ బీట్, బాడీ టెంపరేచర్, బరువు, మూడ్ వంటి వాటిని నియంత్రించడంలో సహాయపడతాయి. అంటే థైరాయిడ్ గ్రంథి మొత్తం శరీరానికి ‘గ్యాస్ పెడల్’ లాంటిదని నిపుణులు చెబుతుంటారు. అయితే థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు వాటిని సమతుల్యం చేసేందుకు వైద్య నిపుణులు చికిత్స అందిస్తుంటారు. అయితే లేజర్ ట్రీట్మెంట్ కూడా థైరాయిడ్ సమస్యను తగ్గించడంపై చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కాగా లో-లెవల్ లేజర్ థెరపీ (LLLT) థైరాయిడ్ హార్మోన్లను తగ్గించదు కానీ.. దాని పనితీరును మెరుగు పరుస్తుందని లేజర్స్ ఇన్ సర్జరీ అండ్ మెడిసిన్ జర్నల్‌లో పబ్లిషైన అధ్యయనం చెబుతున్నది. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం.

పనితీరులో మెరుగుదల

క్లినిక్ ట్రయల్స్‌లో భాగంగా క్రానిక్ ఆటో ఇమ్యూన్ థైరాయిడిటిస్ (CAT) ఉన్న రోగులపై పరిశోధకుడు డానిలో బి. హాఫ్లింగ్, అతని సహచర బృందం లో-లెవల్ లేజర్ థెరపీ(LLLT) ప్రభావాన్ని పరిశీలించింది. ఈ అధ్యయనంలో లెవోథైరాక్సిన్ (LT4) తీసుకుంటున్న 15 మంది హైపోథైరాయిడ్ రోగులు పాల్గొన్నారు. ఇమ్యూన్ థైరాయిడిటిస్ అనేది ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధులలో సాధారణమైనది. వైద్య నిపుణుల ప్రకారం ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ థెరపీ థైరాయిడ్‌ను తగ్గించదు కానీ.. దాని పనితీరును మెరుగు పర్చడంలో, సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని అధ్యయనంలో తేలింది. 47 % మంది 9 నెలలపాటు ఏ విధమైన మాత్రలు వాడకుండానే థైరాయిడ్ ఫంక్షన్ మెరుగుపడి, మాత్రలు తగ్గించారు. ఆటో యాంటీబాడీలు తగ్గాయి. థైరాయిడ్ టిష్యూ ఎకోజెనిసిటీ.. అంటే అల్ట్రాసౌండ్‌లో కనిపంచే నాణ్యత మెరుగు పడింది.

కణాల స్థాయిలో మార్పు

లో లెవల్ లేజర్ థెరపీ సమయంలో.. లేజర్ థైరాయిడ్ గ్రంథిపై పడినప్పుడు కణాల స్థాయిలో ఎనర్జీ(ATP)ని పెంచుతుంది. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. ఆటో ఇమ్యూన్ అటాక్‌ తగ్గుతుంది. అలాగే అవసరమైన థైరాయిడ్ కణాలు రీజనరేట్ అవుతాయి. దీంతో థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా పనిచేసి, హార్మోన్లు సహజంగానే సమతుల్యంగా ఉత్పత్తి అవుతాయి. దీంతో మెడిసిన్ వినియోగం అవసరం తగ్గతుందని అధ్యయనం పేర్కొన్నది. కాకపోతే ఇది కేవలం చిన్నస్థాయి క్లినికల్ ట్రయల్స్ మాత్రమే కాబట్టి, థైరాయిడ్ చికిత్సలో మెడిసిన్‌కి బదులు లో లెవల్ లేజర్ థెరపీ అనేది ప్రస్తుతం ప్రత్యామ్నాయ చికిత్సగా అందుబాటులోకి రాలేదు. మరిన్ని అధ్యయనాలు, పరిశోధనల తర్వాత భవిష్యత్తులో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story