- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Men in danger : పురుషుల్లో Y క్రోమోజోమ్ క్షీణత.. పెరుగుతున్న గుండె జబ్బులకు అదే కారణమా?
Y క్రోమోజోమ్ క్షీణత పురుషుల్లో గుండె సంబంధిత వ్యాధుల రిస్క్‌ను పెంచుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

దిశ, ఫీచర్స్ : వాకింగ్ చేస్తూ.. చేస్తూ.. ఒకరు. డ్యాన్స్ చేస్తూ మరొకరు. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ ఇంకొకరు.. ఇలా ఏదో ఒకచోట, ఎవరో ఒకరు సడెన్‌గా గుండెపోటుకు గురై, మరణిస్తున్న సంఘటనలు ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. ఒకప్పుడు నడీడు వయసు దాటిన వారిలోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపించేవి. ఇప్పుడు యువతను సైతం వేధిస్తున్నాయి. అయితే వయస్సు మీద పడేకొద్దీ పురుషులు Y క్రోమోజోమ్ కోల్పోవడం వల్ల కూడా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతోందని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
మనిషిలో ఎక్స్, వై క్రోమోజోములు ఉంటాయనే విషయం తెలిసిందే. స్త్రీలలో రెండు ఎక్స్ క్రోమోజోములు (XX) ఉంటాయి. అయితే పురుషులలో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ (XY) ఉంటాయి. ఒక జంటకు కలిగే సంతానంలో ఆడ, మగ లింగ నిర్ధారణకు ఇవే మూలం. ముఖ్యంగా పురుషుల్లోని వైక్రోమోజోమ్ మగబిడ్డ జననానికి కారణం అవుతుంది. కాబట్టి దీనిని మేల్ క్రోమోజోమ్ అంటారు. ఒకప్పటితో పోలిస్తే పురుషుల్లో Y క్రోమోజోమ్ క్రమంగా క్షీణిస్తున్నట్లు కూడా గత అధ్యయనాలు పేర్కొన్నాయి. కాగా ఇటీవలి పరిశోధనలు మాత్రం Y క్రోమోజోమ్ కోల్పోవడం వల్ల పురుషుల్లో హార్ట్ ఎటాక్ రిస్క్ పెరుగుతోందని చెబుతున్నాయి.
Y క్రోమోజోమ్ కోల్పోవడం అంటే?
వయస్సు పెరిగే కొద్దీ, కొంతమంది పురుషుల రక్త కణాలలో Y క్రోమోజోమ్ కనిపించకుండా పోతుంది. దీన్ని ‘మొజాయిక్ లాస్ ఆఫ్ వై’ (mLOY) అని పిలుస్తారు. 50 ఏండ్లు దాటిన పురుషుల్లో ఈ పరిస్థితి సాధారణంగా కనిపిస్తుంది. 80 ఏండ్ల వయస్సు వచ్చేసరికి, సుమారు 40% మంది పురుషుల రక్త కణాలలో వై క్రోమోజోమ్ లేకపోవచ్చు. ఈ పరిస్థితి గుండె జబ్బులు, క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలతో సంబంధం కలిగి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
గుండె జబ్బులతో సంబంధం ఏమిటి?
ఇటీవలి అధ్యయనాల ప్రకారం.. వై క్రోమోజోమ్ కోల్పోవడం వల్ల రక్త నాళాలు ఇరుకైపోవడం, గుండె వైఫల్యం, ట్రాన్స్‌థైరెటిన్ కార్డియాక్ అమిలాయిడోసిస్ (ATTR-CA) వంటి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. వై క్రోమోజోమ్‌లో ఉండే ‘UTY’ అనే జన్యువు రోగనిరోధక వ్యవస్థను (immune system) నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ జన్యువు లేనప్పుడు, రోగనిరోధక కణాలు సరిగ్గా పనిచేయవు. ఇది గుండెలో మచ్చ వంటి (scar tissue) కణజాలం ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది గుండె జబ్బులకు కారణమవుతుంది.
స్వీడన్‌లో 1,153 మంది వృద్ధులైన పురుషులపై జరిపిన అధ్యయనంలో (Mosaic loss of chromosome Y in peripheral blood is associated with shorter survival and higher risk of cancer - Nature Genetics) కూడా వై క్రోమోజోమ్ కోల్పోయిన వారికి గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడైంది. అంతేకాకుండా వీరి ఆయుర్దాయం (Life expectancy) సగటున 5.5 సంవత్సరాలు తక్కువగా ఉందని తేలింది. అలాగే, బోస్టన్ మెడికల్ సెంటర్ (Boston Medical Center Study - Circulation: Heart Failure)లో జరిగిన మరో అధ్యయనంలోనూ 21.6% కంటే ఎక్కువ రక్త కణాలలో వై క్రోమోజోమ్ కోల్పోయిన పురుషులు ATTR-CA వల్ల మరణించే అవకాశం 2.6 రెట్లు ఎక్కువని కనుగొన్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు జర్నల్స్ నుంచి సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






