తరాల మధ్య అంతరాలు చెరిపే అద్భుతం.. కాల్ ఏ బూమర్

by Javid Pasha |   (  Updated:2026-04-18 14:54:16  IST  )

ప్రత్యేకంగా వారి నంబర్లు సెర్చ్ చేసి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఇవతల విద్యార్థి ఫోన్ ఎత్తితే చాలు సీనియర్ లివింగ్ కాంప్లెక్స్‌లో ఉన్నవారి ఫోన్ రింగ్ అవుతుంది.

తరాల మధ్య అంతరాలు చెరిపే అద్భుతం.. కాల్ ఏ బూమర్
X

దిశ, ఫీచర్స్ : మనిషి సంఘ జీవి. ఒంటరిగా జీవించలేడు. కుటుబంతోపాటు బయట సామాజిక సంబంధాలు కూడా కోరుకుంటాడు. మనసులోని బాధలను చెప్పుకోవడానికో, ఆనందాలను పంచుకోవడానికో ఎవరో ఒకరు ఉండాలని భావిస్తాడు. అలాంటి పరిస్థితి లేకపోతేనే ఒంటరితనం (Loneliness) వేధిస్తుంది. ముఖ్యంగా వృద్ధాప్య దశలో ఇది చాలా అవసరం. లేకపోతే మానసిక ఆరోగ్యం పాడవుతుంది. మనసులో రంధితో గుండె బరువెక్కుతుంది. సరిగ్గా ఇలాంటి వారికోసమే ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అనుసరిస్తోంది యూఎస్‌లోని నెవాడా రాష్ట్రంలో గల ‘మ్యాటర్ న్యూరోసైన్స్’ అనే బయోటెక్ స్టార్టప్. వృద్ధుల్లో లోన్లీనెస్ భావనను దూరం చేస్తూ, వారు ఆనందంగా జీవించేందుకు ఒక కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టింది. ఇంతకీ ఏమిటది? ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.

సందడిగా ఉండే ప్రాంతంలో..

అది బోస్టన్ యూనివర్సిటీ క్యాంపస్ ఉన్న ప్రధాన రోడ్డు. క్లాస్ రూములు, ల్యాబ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఎప్పుడూ విద్యార్థులతో సందడిగా ఉంటుంది. అయితే ఇక్కడే 2026 మార్చి నుంచి ‘మ్యాటర్ న్యూరోసైన్స్’ అనే స్టార్టప్ ‘కాల్ ఏ బూమర్’ అనే ప్రాజెక్ట్‌‌లో భాగంగా ఒకప్పటి ‘కాయిన్ బాక్స్ ఫోన్’ లాంటి కొత్త పబ్లిక్ టెలిఫోన్ ఏర్పాటు చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఎవరైనా విద్యార్థులు అక్కడికి వెళ్లి‌.. ఆ ఫోన్ ఎత్తగానే ఆటోమాటిగ్గా 3 వేలమైళ్ల దూరంలో ఉన్న రెనోలోని సిటీలో గల వృద్ధాశ్రమం (Senior Living Complex)లో ఉంటున్న ప్రతీ ఒక్కరి ఫోన్ రింగ్ అవుతుంది. కాల్ కనెక్ట్ అవుతుంది.

ఫోన్ ఎత్తగానే అందరూ కనెక్ట్ !

ప్రత్యేకంగా నంబర్లు సెర్చ్ చేసి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఇవతల విద్యార్థి ఫోన్ ఎత్తితే చాలు సీనియర్ లివింగ్ కాంప్లెక్స్‌లో ఉన్నవారితో మాట్లాడొచ్చు. ఇలా రోజూ ఎంతోమంది విద్యార్థులు ఖాళీ సమయంలోనో, టైమ్ పాస్ కాన్పుడో అక్కడికి వెళ్లి ఫోన్ ఎత్తుతారు. వృద్ధాశ్రమంలోని వ్యక్తులతో మాట్లాడుతుంటారు. సరదాగా మాట్లాడుకోవడం, భావాలు పంచుకోవడం, నచ్చిన విషయాలపై చర్చించుకోవడం‌ చేస్తుంటారు. దీంతో వృద్ధుల్లో తాము ఒంటరిగా ఉన్నామనే భావన పోయి సంతోషంగా ఉంటున్నారట.

మానసిక సాంత్వన

కాల్ ఏ బూమర్(Call a Boomer) ఐడియాతో ఓల్డ్ జనరేషన్, న్యూజనరేషన్ మధ్య కమ్యూనికేషన్ పెరిగి ఇరువైపులా సాంత్వన చేకూరుస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. పెద్దలు చెప్పే అనేక విషయాలు, వారి అనుభవాలు, జ్ఞాపకాలు కాలేజీ విద్యార్థుల్లో అవగాహనకు తోడ్పడుతుండగా.. విద్యార్థులు మాట్లాడే మాటలతో వృద్ధుల్లో తాము ఒంటరిగా లేమనే భావన ఏర్పడుతోంది. లోన్లీనెస్ దూరమై మానసిక ఆరోగ్యం మెరుగు పడుతోంది. సోషల్ ఎక్స్‌పెరిమెంట్‌లో భాగంగా మ్యాటర్ న్యూరోసైన్స్ అమలు చేస్తున్న ఈ సరికొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తరాల మధ్య అంతరాలు దూరం చేస్తూ ఆనందాన్ని పంచే అద్భుతమైన ఐడియాగా పలువురు ప్రశంసిస్తున్నారు.

Next Story