ఇస్రోలో సైంటిస్టు ఉద్యోగం వదిలేసి ఖర్జూరం సాగు చేస్తున్నాడు.!

by Daayi Srishailam |

వ్యవసాయంలో కొత్తబాట ఎంచుకొని సక్సెస్ అయ్యాడు.

ఇస్రోలో సైంటిస్టు ఉద్యోగం వదిలేసి ఖర్జూరం సాగు చేస్తున్నాడు.!
X

"ఇస్రో" సైంటిస్ట్ కావడం కొందరి కల.

కానీ..

ఇక్కడొక "ఇస్రో సైంటిస్ట్" దాన్ని వదిలేసి..

రైతుగా మారాడు.

అంతా నవ్వారు.

హేళన చేశారు.

అవేవీ పట్టించుకోలేదు అతడు.

ఓపికగా వెళ్లాడు.

వ్యవసాయంలో కొత్తబాట ఎంచుకొని సక్సెస్ అయ్యాడు.

- దిశ, ఫీచర్స్

కర్నాటకలోని బేగూరు అనే చిన్న గ్రామం. బెంగళూరు నగర విస్తరణతో బేగూరు అస్తిత్వం కోల్పోయింది. అప్పటిదాక వ్యవసాయం మీదనే ఆధారపడిన కుటుంబాలు తలోదారి వెతుక్కున్నాయి. చాలామంది బెంగళూరుకు వెళ్లి ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు వెతుక్కున్నారు. అలాంటివారిలో దివాకర్ చెన్నప్ప ఫ్యామిలీ ఒకటి.

యూనివర్సటీ అధ్యాపకుడిగా..

దివాకర్ కుటుంబం బెంగళూరుకు షిఫ్ట్ అయ్యింది. వేరే ఊర్లో కొంత భూమిని తీసుకున్నారు. తండ్రి ఒక్కడే ఊర్లో ఉంటూ మిగతా కుటుంబ సభ్యులంతా బెంగళూర్లోనే ఉంటూ చదువుకునేవాళ్లు. దివాకర్‌కు వ్యవసాయమంటే ఇష్టం. కానీ వాళ్ల నాన్న భూమి మొఖాన చూడొద్దని పట్టుబట్టాడు. వేరే మార్గంలేక చదువుపైనే దృష్టి సారించాడు దివాకర్. సామాజిక సేవలో ఉన్నత విద్యను పూర్తిచేసి.. పలు స్వచ్చంద సంస్థలతో కలిసి పనిచేశాడు. తర్వాత తుమకూరు విశ్వవిద్యాలయంలో సందర్శక అధ్యాపకుడిగా పనిచేశాడు.

ఇస్రో నుంచి ఊరికి

తుమకూరు యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న సమయంలో ఇస్రో నుంచి ఆఫర్ వచ్చింది. అల 2008లో సామాజిక అభివృద్ధి ప్రాజెక్టుకు శాస్త్రవేత్తగా చేరాడు. అక్కడ కూడా తన ప్రతిభను చాటుకొని అనతికాలంలోనే సక్సెస్‌ఫుల్ సైంటిస్టుగా గుర్తింపు పొందాడు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో.. వాళ్ల నాన్నకు పక్షవాతం వచ్చిందని సమాచారం అందింది. నాన్నను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఊరికి వెళ్లాడు దివాకర్. తర్వాత తిరిగి ఇస్రోకు వెళ్లలేదు. "సైంటిస్టు ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడే వ్యవసాయం చేస్తా" అనడంతో అంతా ఆశ్చర్యపోయారు.

రూ.15 లక్షల ఆదాయం

"ఇస్రో"కు గుడ్ బై చెప్పి "వ్యవసాయం చేస్తా" అనగానే మొదట వాళ్ల అత్తమామ ఒప్పుకోలేదు. "సైంటిస్టువని బిడ్డెనిచ్చి పెళ్లి చేస్తే.. నువ్వేమో అది వదిలేసి వ్యవసాయం చేస్తా అంటవ్" అని నిష్టూరమాడారు. ఊర్లోవాళ్లు కూడా "హేళన" చేశారు. "వ్యవసాయం చేసి మేం పొడుగైనం.. ఇక నువ్వొచ్చినవా" అని మొఖం మీదనే అనేసరికి దివాకర్‌లో మరింత కసి పెరిగింది. వీళ్లిట్లా అన్నందుకైనా వ్యవసాయంలో రాణించాలని పట్టుబట్టాడు. సేంద్రీయ పద్ధతిలో ఖర్జూర సాగు చేస్తూ సంవత్సరానికి రూ.15 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాడు.

వ్యవసాయమంటే తెలిసింది

కర్ణాటకలో సేంద్రీయ ఖర్జూర సాగును ప్రారంభించిన తొలి రైతుగా నిలిచాడు దివాకర్. ప్రస్తుతం ఆయన ఎకరాకు రూ.6 లక్షలు సంపాదిస్తున్నాడు. మొదట్లో అందరిలెక్కనే రాగి.. తొగరి.. మొక్కజొన్న వంటి పంటలు సాగుచేశాడు. వ్యవసాయంలోకి దిగిన మొదటిసారి పంటకైతే రూ.20000 పెట్టుబడి పెట్టగా.. 33000 ఆదాయం వచ్చింది. అంటే కేవలం రూ.11000 మాత్రమే లాభం అన్నమాట. ఈ స్వల్ప ఆదాయం చూసి బాధపడ్డారు. "వ్యవసాయమొద్దురా" అని వాళ్ల నాన్న ఎందుకన్నాడో అర్థమైంది.

రూ.4.5 లక్షల పెట్టుబడి

సాంప్రదాయ పంటలతో సరిపడా ఆదాయం రాకపోవడం.. దివాకర్‌లో ప్రత్యామ్నాయ సాగు ఆలోచనలు రేకెత్తాయి. బెంగళూరులో జరిగిన "కృషి మేళా"లో తమిళనాడుకు చెందిన ఓ రైతు ఖర్జూరా సాగు గురించి చెప్తే ఆయన్ను గుర్తు చేసుకున్నాడు. ఎలాగైనా ఆ రైతును కలవాలి అనుకున్నాడు. అలా ఆర్నెళ్లు పట్టింది. అతడి దగ్గరే ఖర్జూర సాగు విధానాలను నేర్చుకున్నాడు. ఖర్జూర చెట్లకు తగినంత తేమ.. సూర్యరశ్మి.. 40-45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే చాలని తెలుసుకున్నాడు. 150 ఖర్జూర మొక్కలను కొన్నాడు. ఒక్కో మొక్కకు రూ.3000. అలా మొత్తం రూ.4.5 లక్షల పెట్టుబడి పెట్టాడు.

సవాళ్ల మధ్య విజయం

ఖర్జూర సాగుకు అధిక పెట్టుబడి పెట్టాడు దివాకర్. ఎడారి వంటి నేలల్లో సాగుచేయాలనే అపోహ జనాల్లో ఉంది. ఈ రెండు కారణాలతో అతడిని ఎంతోమంది హేళన చేశారు. వీటినే విజయానికి మెట్లుగా మార్చుకొని 2×2 గుంతలు తవ్వి నదీ ఇసుక.. వేప.. ఆముదం పిడకలు.. వర్మీ కంపోస్టు.. పంచగవ్యంతో నేలను సారవంతం చేసి మొక్కలు నాటాడు. మొదటి నాలుగున్నరేండ్లు ఎలాంటి దిగుబడి రాలేదు. "అవి ఖర్జూరం చెట్లు కావు" అన్నారంతా. సమస్యలు.. సవాళ్ల మధ్య నాలుగున్నరేళ్ల తర్వాత మొదటి పంట పూతకొచ్చింది. దివాకర్ ఆనందానికి అవధుల్లేవ్. అదే తన విజయంగా ఫీలయ్యాడు.

కల సాకారమైంది

మొదటిసారి 2.5 ఎకరాల నుంచి 800 కిలోల ఖర్జూరాలు తీశాడు. ప్రస్తుతం ఐదు టన్నుల దిగుబడి వస్తోంది. కిలో రూ. 375 చొప్పున విక్రయిస్తున్నాడు. ఆవుపేడ.. మూత్రంతో సేంద్రీ ఎరువులు.. కీటక నాశనులను తయారుచేస్తూ పంటకు వేస్తున్నాడు. దక్షిణ భారతదేశంలో సేంద్రీయ ఖర్జూర సాగుచేస్తున్న మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. యూనివర్సిటీలో బోధన.. ఇస్రో ఉద్యోగం.. నగర జీవితాన్ని వదిలేసి గ్రామంలో రైతుగా మారడం అంత ఈజీయేం కాదు. ఆర్థిక లాభం కంటే.. మనశ్శాంతి ముఖ్యం అనుకున్నాడు దివాకర్. తండ్రి ఆరోగ్యం కంటే తనకేదీ ఎక్కువ కాదనీ కలను సాకారం చేసుకున్నాడు.

Next Story