- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకప్పుడు వీధుల్లో భిక్షాటన చేసేది, ఇప్పుడు ఆటోల యజమాని, జిమ్ ట్రైనర్
"అజీబాబు" నుంచి "అని మంగళూరు"గా మారిన ట్రాన్స్‌జెండర్ మహిళ కథ

దిశ, ఫీచర్స్: "అజీబాబు" నుంచి "అని మంగళూరు"గా మారిన ఈ ట్రాన్స్‌జెండర్ మహిళ కథ.. వివక్షను, అవమానాలను, ప్రాథమిక హక్కుల నిరాకరణను ఎదుర్కొని దృఢ సంకల్పంతో జిమ్ ట్రైనర్‌గా, నటిగా, ఆటోల ఓనర్‌గా ఎదిగి స్ఫూర్తిదాయక ప్రయాణం చేస్తోంది.
అజీబాబు "అని"గా..
రాయచూరు జిల్లాలోని మస్కిలోని హిరేదిన్ని అజీబాబు సొంతూరు. చిన్నప్పటి నుంచే తనలో స్త్రీలక్షణాలను గ్రహించింది. చదువుపై ఆసక్తితో మంగళూరులో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులో మెరిట్ సీటు సాధించింది. అయితే కొత్త ప్రాంతం కదా. తన నడవడికను చూసి జనాలు ఎగతాళి చేసేవారు. బెదిరించేవారు. వాళ్లతో వేగలేక కాలేజీని వదిలివేసి ట్రాన్స్‌జెండర్ సమాజంలో చేరడంకోసం బెంగళూరుకు వెళ్లింది. 2021లో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. తన పేరును "అని మంగళూరు"గా మార్చుకుంది. అయినప్పటికీ ఎవరూ అద్దెకు ఇల్లివ్వలేదు. పని ఇవ్వలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో భిక్షాటన చేయాల్సి వచ్చింది.
నాలుగు ఆటోలు..
భిక్షాటన ముగించుకొని ఒకరోజు ఆటోలో వెళ్లడానికి ప్రయత్నిస్తే.. ఆమెనెవరూ ఎక్కించుకోలేదు. ఈ సంఘటన ఆమె జీవితాన్ని మలుపు తెచ్చింది. ఆత్మగౌరవంతో బతకాలని తన తల్లి ఆర్థిక సాయంతో ఆటోరిక్షాను కొనుగోలు చేసింది. అది బాగా నడిచింది. వెంట వెంటనే నాలుగు ఆటోలను తీసుకుంది. ఇవి డెరలకట్టె, కుట్టార్ ప్రాంతాల్లో నడుస్తాయి. గర్భిణీ స్త్రీలకు, వృద్ధ ట్రాన్స్‌జెండర్లకు తన ఆటోల్లో ఫ్రీ ప్రయాణం. ఆటో డ్రైవర్లు ఎంతయినా సంపాదించుకోనీ, వాళ్ల నుంచి రోజుకు రూ.200 మాత్రమే తీసుకుంటుంది. ఆ మొత్తాన్ని పేద కుటుంబాలకు, వీధి జంతువుల సంరక్షణకు ఉపయోగిస్తుంది.
సినిమాల్లో నటిస్తూ..
"అని మంగళూరు"కు నటనపై ఆసక్తిమ ఉంది. కన్నడ చిత్రం "శివలీల"లో విలన్ పాత్రలో నటించింది. ఇంకా లైన్ ప్రొడ్యూసర్‌గా కూడా పనిచేసింది. నటన, దర్శకత్వం, కెమెరా వంటి విభిన్న విభాగాల్లో ఆసక్తి చూపిస్తోంది. ఒకరోజు తనొక ట్రాన్స్‌జెండర్ అనే కారణంతో ఆటోలో ఎక్కించుకోవడానికి ఏ సమాజమైతే ఇష్టపడలేదో, తరిమేశారో ఆ సమాజానికే ఉపాధి కల్పిస్తోంది. ఇంటిని అద్దెకు ఇవ్వడానికి ఒప్పుకోని మహిళా సమాజానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఇవన్నీ చేస్తూనే మరోవైపు జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తోంది అని. శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని నేర్పిస్తోంది.
సమాజ సేవకై..
బతకడానికే అవకాశం లేకుండా అణచివేసిన సమాజాన్ని మేల్కొలుపుతూ స్వయంకృషితో ఎదిగిన అని మంగళూరు తన సేవా పరిధిని మరింత విస్తరింపజేసేందుకు కృషి చేస్తోంది. దాంట్లో భాగంగా ఆటోల సంఖ్యను పెంచాలని, వృద్ధ ట్రాన్స్‌జెండర్ల ఒక ఆశ్రమాన్ని నిర్మించాలని అనుకుంటోంది. తన రోజువారీ ఆదాయంలో కొంత భాగాన్ని పేదలకు ఆహారం అందించడానికి, వీధి జంతువుల సంరక్షణకు వినియోగిస్తోంది. "నాకు అవసరమైన సమయంలో ఎవరూ నా వెనుక నిలబడలేదు. నేను ఇతరులకు అలాంటి సహాయం అందించాలనుకుంటున్నాను" అని అంటోంది అని మంగళూరు.






