ఆదిలాబాద్ జిల్లాలో శ్రీలంక.!

by Daayi Srishailam |   (  Updated:2025-07-20 14:14:03  IST  )

ఇది మన శ్రీలంక

ఆదిలాబాద్ జిల్లాలో  శ్రీలంక.!
X

ప్రపంచంలోనే శ్రీలంక దేశానికి ఒక ప్రత్యేకత ఉంది.

ఆ దేశం చుట్టూ సముద్రం ఉంటుంది.

అచ్చు అలానే మన రాష్ట్రంలోనూ ఓ శ్రీలంక ఉంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం..

పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీలోని ఒక కాలనీకి ‘శ్రీలంక కాలనీ’ అనే పేరు వచ్చింది.

- దిశ, జన్నారం

1986వ సంవత్సరంలో మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న పంట పొలాల్లో మన్సుర్ షా ఖాన్ అనే అతను ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగించేవాడు. ఆ ఇంటికి పడమరన ఒడ్డెపల్లి చెరువు, ఉత్తరాన చెరువు అలుగు, తూర్పున చెరువు అలుగు, దక్షిణాన పంటపొలాలకు వెళ్లే కాలువ ఉండేది. ఆ ఇంటికి వెళ్లాలంటే ప్రధాన రహదారి నుంచి కట్టె వంతెన దాటి ఆ ఇంటికి పోవాల్సి వచ్చేది. ఆ ఇంటి చుట్టూ నీరు ప్రవహిస్తూ ఉండడం.. కాలక్రమేన అక్కడ ఆ కుటుంబంతో పాటు మరికొన్ని ఇండ్లు వచ్చి చేరాయి. అలా అక్కడ ఒక కాలనీ ఏర్పడిందని.. 1991వ సంవత్సరంలో ఈ కాలనీకి కర్ర స్తంభాలతో కరెంట్ సరఫరా చేశారని కాలనీవాసులు చెప్పారు. కాలనీకి చుట్టూ నీరు ఉండడం వల్లే ఆ కాలనీకి శ్రీలంక కాలనీ అని పేరు వచ్చిందని మన్సర్ షా ఖాన్ కుమారుడు మోసిన్ షా ఖాన్ తెలిపారు. ప్రస్తుతం ఆ కాలనికి రెండు వైపులా రోడ్లు వచ్చాయి. శ్రీలంక కాలనీలో అన్ని కులాలకు చెందిన సుమారు 200 కుటుంబాలు ఉంటున్నాయి. జన్నారం మండలంలోనే శ్రీలంక కాలనీలో నివాస స్థలాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ కాలనీలో ఎక్కువ శాతం ప్రభుత్వ ఉద్యోగులే నివసిస్తుండడం విశేషం.

మా ఇంటి చుట్టూ నీళ్లే: మోసిన్ షా ఖాన్

కాలనీలో మాది ఒకే ఇల్లు ఉండేది. ఆ ఇంటి చుట్టు నీరు ప్రవహించేది. తర్వాత కొంత మంది ఇండ్లు నిర్మించుకుని ఒక కాలనీగా ఏర్పడింది. నీరు ఉండడం వల్లే కాలనీకి శ్రీలంక కాలనీ అని నామకరణం చేశారు.

తాటి మొద్దులతో దాటేవాళ్లం: దాముక సుధాకర్, రేండ్లగూడ

మేము జన్నారం బడికి పోవాలంటే రేండ్లగూడ నుంచి జన్నారం ఖాళీ బాటలో తాటి మొద్దులు దాటుకుంటూ వెళ్లేవాళ్లం. అప్పుడు ఆ కాలనీకి ఎలాంటి పేరు లేకుండే. కాలనీ చుట్టూ నీరు ఉండడం వలన ఆ కాలనీని అందరూ శ్రీలంక అని పిలిచారు. అదే ఇప్పుడు శ్రీలంక కాలనీగా మారిపోయింది.

Next Story