- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Memories : ఈత కొట్టి.. ఈత పండ్లు తింటూ.. ఆ రోజులే వేరబ్బా!
సమ్మర్ వచ్చిందంటే ఈత నేర్చుకోవాలని, చెట్లపోంటి, గట్లపోంటి, అడవిపోంటి తిరగాలని ఉత్సాహంగా ఉండేది. ఆ రోజులు మళ్లీ రావేమో ఇక!

దిశ, ఫీచర్స్ : అది పిల్లలు, పెద్దలతో సందడిగా కనిపించే హైదరాబాద్‌లోని సాధారణ గల్లీ. అక్కడే ఓ స్కూల్ కూడా ఉంది. బయటకు వెళ్లి ఇంటికి వస్తున్న నేను ఎండ ఎక్కువగా ఉందనిపించి, పక్కనే ఉన్న ఓ చెట్టుకింద నీడకు ఆగాను. అక్కడే కొందరు స్కూల్ పిల్లలు గుమిగూడి మాట్లాడుకుంటున్నారు. ఇంకో వన్‌వీక్ అయితే ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ కూడా దొరుకుతాయని వారు తెగ సంతోష పడుతున్నారు.
జమీన్ ఆస్మాన్ ఫరక్
‘సెలవుల్లో నేనైతే రోజూ గ్రౌండుకెళ్లి క్రికెట్ ఆడుతానని ఒకరు, డైలీ స్విమ్మింగ్ పూల్‌కి వెళ్తానని మరొకరు, సమ్మర్ క్యాంపులో డ్యాన్స్ నేర్చుకుంటానని ఇంకొకరు మాట్లాడుకుంటుంటే విని ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మా చిన్నప్పుడు మాట్లాడుకునే మాటలకు, ఇప్పటి పిల్లలు మాట్లాడుకునే మాటలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ అనిపిస్తున్నది. అప్పట్లో మాకు సమ్మర్ క్యాంప్ అంటే తెల్వదు, స్విమ్మింగ్ పూల్ అంటే తెల్వదు. చదివింది అచ్చమైన తెలుగు మీడియం కాబట్టి ఇంగ్లీష్ ముక్క రాకపోయేది. నాకే కాదు 1990ల తర్వాత పల్లెల్లో చదువుకున్న చాలామంది పరిస్థితి అంతే. అయినా అప్పుడు సమ్మర్ క్యాంపులు, స్విమ్మింగ్ పూల్ వంటివి గ్రామాల్లో ఎక్కడివి?
చెట్లపోంటి, గట్లపోంటి తిరగాలని..
బడిపిల్లల హాలిడేస్ ప్లాన్ వింటున్నప్పుడు ఒక్కసారిగా నా మనసులో చిన్నప్పటి జ్ఞాపకాలు కళ్లముందు తిరినట్లయింది. ఇప్పటి పిల్లల చిన్ననాటి సరదాలు, సంతోషాలు, కోరికలకు.. మా చిన్నప్పటి సరదాలు, సంతోషాలు, కోరికలు చాలా భిన్నంగా ఉండేవి. ఇప్పటోళ్లు సమ్మర్ క్యాంపులు అంటున్నరుగానీ.. మా చిన్నప్పుడు అంటే 1995 తర్వాతి కాలంలో గసోంటి క్యాంపులేవీ మాకు తెల్వదు. సమ్మర్ వచ్చిందంటే ఈత నేర్చుకోవాలని, చెట్లపోంటి, గట్లపోంటి, అడవిపోంటి తిరగాలని ఉత్సాహంగా ఉండేది. నా చిన్నప్పుడు మా ఊరిలో కనీసం పదీ పన్నెండు పొడవాటి, వెడల్పైన బావులు ఉండేవి. అలాంటి వాటిలో నైలబావి ఒకటి. ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉండి, ఎప్పుడూ నీళ్లతో నిండుగా ఉండేది. వేసవిలో నేను ఈత నేర్చుకున్నది కూడా ఇక్కడే. అట్లనే మా వ్యవసాయ పొలంవద్ద కూడా బావి ఉండేది. ఒంటిపూట బడులప్పుడు ఊరికి దగ్గరగా ఉన్న నైలబావిలో, పూర్తిగా సెలవులు దొరికినప్పుడు మా పొంలంలోని బావిలో ఈతకొట్టేవాన్ని, నేనే కాదు, మా చుట్టు పక్కల పోరగాల్లు, మా ఇంటికి వచ్చిన బంధువుల పిల్లలు అందరం సమ్మర్‌లో సరదా సరదాగా ఈతకొడుతూ ఎంజాయ్ చేసేవాళ్లం.
ఈతపళ్లంటే ఎంతో ఇష్టం
నా చిన్నప్పుడు మా ఊరి నైలబావిలో ఈతకొట్టి ఇంటికి వస్తుంటే మధ్యలో ఈతచెట్లు ఉండేవి. ముఖ్యంగా ఏప్రిల్‌లో ఈతకాయలు, ఈతపండ్లు మస్తు దొరికేవి. కాయలుగా ఉన్నప్పుడు ఆకు పచ్చగా, కసరుగా ఉంటాయి. ఇవి మాగినాక అంటే పండ్లుగా ఉన్నప్పుడు ఆరెంజ్, ఎరుపు రంగుల్లో ఉండి ఉండి తియ్యగా, రుచిగా ఉంటాయి. ఇగ ఈతకొట్టి వస్తున్నప్పుడు రాళ్లతో, కట్టెలతో ఈతపళ్లను రాలగొట్టి(తెంపుకొని) తినుకుంటూ వచ్చేవాళ్లం. ఇప్పటి పిల్లలకు చాలామందికి ఈతకల్లు గురించి తెలుస్తుందేమో కానీ.. ఈత పళ్లగురించి సిటీలో ఉండేటోళ్లకు చాలామందికి తెల్వదు. కానీ 90s కిడ్స్‌కి చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీములకంటే వీటిని తినడమే ఎక్కువ ఇష్టముండేది. నాక్కూడా అంతే. వేసవి సెలవుల్లో ఈతపండ్లు, తుంకిపండ్లు, మామిడిపండ్లు, మొర్రిపండ్లు వంటివి మస్తు తినేటోళ్లం. నిజంగా ఆ రోజులు గుర్తుకొస్తే మనసులో ఏవేవో ఆనందాలు, మధురమైన అనుభూతులు సుడులు తిరుగుతూ మైమరిపిస్తాయి. కానీ ఇప్పుడా ఈత సరదాల్లేవ్.. ఈత పళ్లు లేవ్.. కాలం తెచ్చిన మార్పు కదా ఏం చేస్తాం!
- తుషార్






