డుగ్గు డుగ్గు డుగ్గు.. 77 ఏళ్ల రాయ్.. సోలో బైక్ రయ్.!

by Daayi Srishailam |

బుల్లెట్ బండేసుకొని లడాఖ్‌లోని ఉమ్లింగ్ లా పాస్‌కు ఒక్కడే బైక్‌పై ప్రయాణించి చరిత్ర సృష్టించాడు

డుగ్గు డుగ్గు డుగ్గు.. 77 ఏళ్ల రాయ్.. సోలో బైక్ రయ్.!
X

దిశ, ఫీచర్స్: దేశంకోసం యవ్వన వయసు నుంచి కష్టపడతారు కాబట్టీ రిటైర్డ్ అయిన సైనికులు వయసు మీద పడ్డాక కాస్త విశ్రాంతి కోరుకుంటారు. కానీ

పూణేకు చెందిన 77 ఏళ్ల మాజీ లెఫ్టినెంట్ కల్నల్ సోహన్ రాయ్ అలా కాదు. ఇంట్లో కూర్చోవడమంత నరకం ఇంకోటి లేదనుకొని ఆ వయసులో బుల్లెట్ బండేసుకొని లడాఖ్‌లోని ఉమ్లింగ్ లా పాస్‌కు ఒక్కడే బైక్‌పై ప్రయాణించి చరిత్ర సృష్టించాడు.

అస్సలు తగ్గేదే లే..

లడాఖ్‌లోని ఉమ్లింగ్ లా పాస్‌ అంత సౌకర్యవంతమైన ప్రదేశమేం కాదు. 19000 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యున్నత మోటారబుల్ రోడ్డు. తన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500 'విజార్డ్'పై సోహన్ రాయ్ ఒంటరిగా జర్నీ చేశాడు. మామూలుగా అక్కడ సీజన్‌తో సంబంధం లేకుండా భారీ వర్షాలు కురుస్తాయి. ఒకొక్కసారి మట్టిదిబ్బలు కూలుతాయి. కమ్యూనికేషన్ లోపాలు కూడా ఉంటాయి. అక్కడికి చేరుకోవాలంటే.. జమ్మూ.. శ్రీనగర్.. డ్రాస్.. కార్గిల్.. లెహ్ వంటి కఠిన మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. అయినా కూడా సోహన్ రాయ్ ఎక్కడా తగ్గకుండా ఆత్మవిశ్వాసంతో రైడ్‌కు వెళ్లాడు.

రైడ్ పూర్తయినా ఆగకుండా..

సోహన్ వెళ్లిన మార్గంలో ఎన్నో చోట్ల ఆగకుండా వానలు పడ్డాయి. కరెంటు కూడా లేదు. మొబైల్ నెట్వర్క్ దేవుడెరుగు. యువ రైడర్లే భయపడే మార్గమది. కానీ.. అతడు మాత్రం సాహసంతో అడుగు ముందుకు వేశాడు. దానినొక అడ్వెంచర్‌గా కాకుండా.. సైన్యంలో పనిచేసిన వారి గట్స్ ఎలా ఉంటాయో చాటిచెప్పే ప్రయత్నం. తన జర్నీలో భాగంగా కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద ఆగి నేలకొరిగిన యోధులకు నివాళులు అర్పించాడు. వయసు పెరిగినా బైకింగ్ ఆపకూడదు. బైకింగ్ ఆపితే వయసు పెరుగుతుంది అనేది తన అభిప్రాయం. అందుకే రైడ్ పూర్తయినా తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాడు.

250000 కిలోమీటర్ల జర్నీ..

కల్నల్ రాయ్ రైడర్ మాత్రమే కాదు. తన 77 ఏళ్ల వయసులో ఇప్పటికీ ప్రతీరోజు ఫుట్‌బాలర్ ఆడతాడు. ఒకప్పుడు బాక్సర్ కాబట్టీ దాన్నీ ప్రాక్టీస్ చేస్తాడు. మారథాన్ రన్నర్ అనుభవమున్న తను డెయిలీ పరుగెత్తుతాడు. భారత సైన్యంలో దాదాపు 30 ఏళ్లపాటు సేవ చేసిన అతడు కీలకమైన జమ్మూ-కాశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్‌.. నార్త్‌ఈస్ట్‌ కౌంటర్-ఇన్‌సర్జెన్సీ ఆపరేషన్‌లలో పాల్గొన్నాడు. మోకాళ్ల శస్త్రచికిత్సలు.. యాంజియోప్లాస్టీ చేయించుకున్నా బైకింగ్‌ అంటే ఉత్సాహం. ఒకరకంగా దాన్నొక మిషన్‌గా మార్చుకున్నాడు. బైక్ మీద.. దేశ విదేశాల్లో మొత్తం 250000 కిలోమీటర్లు బైక్ జర్నీ చేశాడు.

ఇండియా బుక్ రికార్డుల్లో..

ఏదో కాలక్షేపం కోసం రాయ్ రైడింగ్‌ను ఎంచుకోలేదు. యుద్ధ స్మారక కార్యక్రమాలతో పాటు గ్రామీణ యువతకు చదువు.. దేశరక్షణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు దేశమంతా తిరిగాడు. ఈ సాహసాన్ని గుర్తించి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కల్పించారు. తన ఈస్ట్ వెస్ట్ సోలో రైడ్‌కు గుర్తింపుగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం లభించింది. బుద్ధ్ ఇంటర్నేషనల్ ఫార్ములా-1 సర్క్యూట్ వంటి ఫోరమ్స్ కూడా ఎన్నో అవార్డులతో గౌరవించింది. అతడు పూణే నుంచి న్యూ ఢిల్లీ వరకు జాతీయ భద్రతా ర్యాలీ నిర్వహించాడు. అలాగే మహారాష్ట్ర జిల్లాల్లో రోడ్డు భద్రతా ర్యాలీలు నిర్వహించాడు.

Next Story