కుంకుమ పూల తోటలో.. పలికే ఓ తాతా.!

by Daayi Srishailam |

నెలకు మూడున్నర లక్షల సంపాదనంటే ఈ తాతెంత గట్టోడో అర్థం చేసుకోవచ్చు.

కుంకుమ పూల తోటలో.. పలికే ఓ తాతా.!
X

తాతల అనుభవం నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఇక్కడొక తాత గురించి చెప్తున్నాం చదవండి. ఈ తాతపేరు రమేష్ గెరా. 65 ఏళ్ల వయసుంటాడు. నోయిడాలోని చిన్న గదిలో సుగుంధ ద్రవ్యమైన కుంకుమ పువ్వును పెంచుతూ నెలకు రూ.3.5 లక్షలు సంపాదిస్తున్నాడు. నెలకు మూడున్నర లక్షల సంపాదనంటే ఈ తాతెంత గట్టోడో అర్థం చేసుకోవచ్చు.

- దిశ, ఫీచర్స్

సాఫ్రాన్‌‌‌పై స్టడీ

1980లో ఎన్ఐటీ కురుక్షేత్ర నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన రమేష్ 30 ఏళ్లపాటు ఎన్నో ఎమ్మె్న్సీ కంపెనీల్లో పనిచేసి 2017లో రిటైర్ అయ్యాడు. 2002లో దక్షిణ కొరియా వ్యాపార పర్యటన సందర్భంగా హైడ్రోపోనిక్స్, మైక్రోగ్రీన్స్, ఇండోర్ కుంకుమ సాగు వంటి అధునాతన సాగు పద్ధతులను తెలుసుకున్నాడు. ఇండియాకు 70 శాతం కుంకుమ ఇరాన్ నుంచి దిగుమతి అవుతుందని, కాశ్మీర్ కేవలం 30 శాతం దేశీయ అవసరాలను తీరుస్తుందని, ఈ లోటును ఒక గొప్ప మార్కెట్ అవకాశంగా గుర్తించాడు. నోయిడాలోని సెక్టార్ 63లో 100 చదరపు అడుగుల గదిలో కుంకుమ సాగు ప్రారంభించాడు.

నెలకు రూ.2.5 లక్షలు

కుంకుమ సాగు కోసం రమేశ్ రూ. 4 లక్షలతో గ్రీన్‌హౌస్ నిర్మించాడు. దీనిలో కుంకుమ పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించారు. అదనంగా కాశ్మీర్ నుంచి రూ. 2 లక్షల విలువైన కుంకుమ విత్తనాలను తెచ్చాడు. ఇదే మాన్యువల్ పెట్టుబడి. నెలవారీ విద్యుత్ బిల్లు రూ. 4,500, సంవత్సరానికి రూ. 8,000 కూలీ ఖర్చు అంతే. కుంకుమకు హోల్‌సేల్ మార్కెట్‌లో కిలోకు రూ. 2.5 లక్షలు, రిటైల్ మార్కెట్‌లో రూ. 3.5 లక్షలు సంపాదిస్తు్న్నాడు. ఎగుమతి వ్యాపారంలో కిలోకు రూ. 6 లక్షల వరకు సంపాదిస్తూ కుంకుమ సాగులో కొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు.

సాఫ్రాన్ ఇనిస్టిట్యూట్

కుంకుమ సాగు అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలనే ఉద్దేశ్యంతో రమేశ్ నోయిడాలో 'ఆకర్షక్ సాఫ్రాన్ ఇన్‌స్టిట్యూట్'ను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా ఆయన ఇప్పటివరకు 370 మందికి పైగా వ్యక్తులకు శిక్షణ ఇచ్చాడు. రూ. 12,000 ధరతో రెండు రోజుల ఆన్‌లైన్ శిక్షణ కోర్సు, సంవత్సరం పాటు మార్గదర్శకత్వం అందిస్తుంది. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఆయన నెలకు రూ. 3.5 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. సంపాదనకు వయసుతో సంబంధం లేదు, ఎంత అనుభవం ఉంటే అంత మెరుగైన సంపాదనను సొంతం చేసుకోవచ్చని నిరూపిస్తు్న్నాడు రమేశ్.

యువతకు సందేశం

రమేశ్ గెరా తాతయ్య కథ భూమి లేకుండానే వ్యవసాయం చేయవచ్చని నిరూపిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఒక చిన్న గదిలో అధునాతన సాంకేతికతను ఉపయోగించి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాన్ని సాగుచేసి, గణనీయమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అంతేకాక, తన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా వేలాది మందికి స్ఫూర్తినిస్తూ, వారికి కొత్త ఆదాయ మార్గాన్ని చూపుతున్నాడు. భారతదేశంలో కుంకుమ డిమాండ్‌ను తీర్చడానికి ఇదొక గొప్ప అవకాశం. ఎవరైనా ఈ విధానాన్ని నేర్చుకొని విజయవంతం కావచ్చు, అనేది రమేష్ తాత చెప్పే ముచ్చట.

Next Story