హైదరాబాద్ - గోవా మధ్య 4 లేన్ హైవే.. భూసేకరణ పూర్తి..

by Sujitha Rachapalli |

హైదరాబాద్-గోవా మధ్య మరింత సులభతరం కానున్న ప్రయాణం.. భారతమాలలో భాగంగా 4లేన్ హైవే.. ఇప్పటికే పూర్తయిన భూసేకరణ.. రెండేళ్లలో పనులు పూర్తి చేయడమే లక్ష్యం

హైదరాబాద్ - గోవా మధ్య 4 లేన్ హైవే.. భూసేకరణ పూర్తి..
X

దిశ, తెలంగాణ బ్యూరో : గోవా అంటేనే పర్యాటకం. రోడ్డు మార్గంలో గోవా వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి కనీసం 15 గంటలకుపైగా సమయం పడుతోంది. దీన్ని సగానికి పైగా తగ్గించేందుకు కేంద్రం భారత్ మాల పరియోజనలో భాగంగా ఎకనామిక్ కారిడార్-10 నిర్మాణం చేపడుతుంది. ప్రస్తుతం ఉన్న పనాజీ-హుబ్లీ-కొప్పల్-రాయచూరు-మహబూబ్ నగర్-హైదరాబాద్ మార్గానికి ప్రత్యమ్నాయంగా పనాజీ-బెలగావి-రాయచూరు-హైదరాబాద్ మార్గాన్ని సిద్ధం చేస్తుంది. కాగా ఈ కారిడార్‌లో భాగంగా పనాజీ-బెలగావి-రాయచూరు భాగాన్ని గ్రీన్ ఫీల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. ఫలితంగా గోవా నుంచి కర్ణాటక, తెలంగాణకు మరింత మెరుగైన కనెక్టివిటీ సాధ్యమవుతుంది.

రూ. 12వేల కోట్లతో కొత్త ఎకానమిక్ కారిడార్...

హైదరాబాద్-పనాజీ మధ్య నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి ప్రాజెక్టు వేగం పుంజుకుంది. భారత్ మాల పరియోజనలో భాగంగా చేపట్టిన హైదరాబాద్–పనాజీ ఎకనామిక్ కారిడార్ (ఈసీ-10) కింద నాలుగు లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిని నిర్మిస్తున్నారు. మొత్తం రూ.12 వేల కోట్ల పెట్టుబడితో అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా గోవా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా, వాణిజ్యం, పర్యాటక రంగానికి కొత్త ఊపిరి అందనుంది. ప్రాజెక్టులో కీలకమైన బెలగావి-రాయచూర్ సెక్షన్‌లో ఇప్పటికే భూసేకరణ దాదాపుగా పూర్తికాగా... సివిల్ పనులు ప్రారంభమయ్యాయి. హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌) విధానంలో ఈ రహదారిని నిర్మిస్తున్నారు. పూర్తి అయిన తర్వాత పనాజీ, బెలగావి, రాయచూర్, హైదరాబాద్ నగరాలను నేరుగా అనుసంధానించే ఈ కారిడార్ ద్వారా సరుకు రవాణా సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి గోవాకు సుమారు 700 కి.మీ దూరం అయితే కొత్త హైవే వల్ల కనీసం 150 కి.మీ వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ జాతీయ రహదారి పూర్తయితే లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గడమే కాకుండా, ప్రాంతీయ వ్యాపారం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయి. అలాగే రహదారి వెంట ఉన్న గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ లభించి, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. రాబోయే రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యం. కాగా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఈ కారిడార్ దక్షిణ భారత రవాణా మౌలిక సదుపాయాలకు మైలురాయిగా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రాయచూరు కేంద్రంగా సూరత్-చెన్నై కారిడార్...

ప్రస్తుతం సూరత్ నుంచి చెన్నై వరకు నిర్మిస్తున్న కారిడార్‌‌‌‌లో భాగంగా మహారాష్ట్ర, షోలాపూర్ సమీపంలోని అకల్ కోట్ నుంచి రాయచూరు మీదుగా కర్నూలు వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే తెలంగాణ పరిధిలోని జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా భాగంగా ఉంది. కర్ణాటక-తెలంగాణ సరిహద్దు అయిన నందిన్నె, అయిజ వద్ద ఈ హైవేకు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ ఇచ్చారు. ఈ హైవే కూడా పనాజీ-హైదరాబాద్ హైవేకు అనుసంధానంగా మారనుంది. ఫలితంగా మరింత మెరుగైన కనెక్టివిటీకి అవకాశం ఏర్పడుతుంది.

Next Story