- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టమాటోలతో బయోలెదర్ బ్యాగులు.. చెప్పులు తయారుచేస్తున్నాడు.!
ఇది సంపూర్ణ పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది

దిశ, ఫీచర్స్: టమాటో వ్యర్థాలను ముడిసరుకుగా ఉపయోగించి పాలీయురేతేన్, పాలీవినైల్ క్లోరైడ్ లేని ప్రక్రియ ద్వారా బయోడిగ్రేడబుల్ లెదర్‌ను తయారు చేస్తున్నాడు 26 ఏళ్ల ప్రితేష్ మిస్త్రీ. ఈ ప్రక్రియ జంతువులకు హాని కలిగించకుండా సంపూర్ణ పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది.
ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా..
ముంబైలోని థడోమల్ షహానీ ఇంజనీరింగ్ కాలేజీలో బయోటెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ప్రితేష్ ప్రాజెక్ట్‌గా టమాటో వ్యర్థాల నుంచి బయోలెదర్ తయారీని ఎంచుకున్నాడు. ఈ ప్రయాణంలో భాగంగా కాన్పూర్‌లోని లెదర్ టానరీలను సందర్శించాడు. అక్కడ సాంప్రదాయ లెదర్ టానింగ్ పరిశ్రమ వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని నేరుగా చూశాడు. అదే సమయంలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి ఆహార వృథా భారీ పరిమాణాన్ని గమనించాడు. ఈ అనుభవాలు తనకు ఒక మెరుగైన పరిష్కారం దిశగా ఆలోచనను రేకెత్తించాయి. కాలుష్యం, వృథాను ఒకేసారి పరిష్కరించే మార్గం ఉందని తెలుసుకున్నాడు.
ది బయో కంపెనీ
ప్రితేష్ బయోలెదర్‌కు ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేశాడు. టమాటో ఉప-ఉత్పత్తులతో అనేక నెలలు ప్రయోగాలు చేయడం, విభిన్న ఫార్ములేషన్‌లను పరీక్షించడం, ఆకృతి, దృఢత్వంపై పనిచేయడం ద్వారా లెదర్‌ను పోలిన స్థిరమైన బయోడిగ్రేడబుల్ ఉత్పత్తిని సృష్టించాడు. 2019లో ది బయో కంపెనీని స్థాపించి ‘ఒరిజినల్ బయోలెదర్’ పేరుతో మొదటి ఉత్పత్తిని ప్రవేశపెట్టాడు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి టమాటో వ్యర్థాలను సేకరించి సూరత్‌లోని వారి ప్లాంట్‌లో టమాటో ఉప-ఉత్పత్తులను బయోపాలిమర్‌లు, మొక్కల ఆధారిత బైండర్‌లు, సహజ ఫైబర్‌లతో కలిపి బయోలెదర్‌ను రూపొందిస్తారు.
టమాటోనే ఎందుకు.?
ఇండియా ప్రతీ సంవత్సరం సుమారు 44 మిలియన్ టన్నుల టమాటోలను ఉత్పత్తి చేసే రెండో అతిపెద్ద ఉత్పత్తిదారు. అయితే దీనిలో 30-35% వ్యర్థంగా మారుతుంది. ఈ వ్యర్థం ప్రధానంగా టమాటో తొక్క, గింజల రూపంలో బయోలెదర్‌కు స్థిరమైన ముడిసరుకుగా ఉపయోగపడుతుందని గుర్తించాడు ప్రితేష్. టమాటోలలో సహజంగా లభించే పెక్టిన్ అనే పాలిమర్ బయోలెదర్‌కు సౌకర్యవంతమైన, బలమైన లక్షణాలను అందిస్తుంది. వీటి ఫైబరస్ నిర్మాణం లెదర్‌లాంటి ఆకృతిని సృష్టించడంలో సహాయపడతాయి. బయోడిగ్రేడబుల్ గుణాన్ని నిర్ధారిస్తాయి.
బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్
బయోలెదర్‌ను ఫ్యాషన్, యాక్సెసరీలు, ఆటోమోటివ్ రంగాల్లో వినియోగించి జాకెట్లు, బ్యాగ్‌లు, ఫుట్‌వేర్ వంటివి తయారుచేస్తున్నారు. సాంప్రదాయ లెదర్‌కు ప్రత్యామ్నాయంగా ఇంటీరియర్ డిజైన్‌లో బయోలెదర్‌ను ఉపయోగిస్తున్నారు. దీనికి సౌమ్యమైన, తటస్థమైన వాసన ఉంటుంది. ఇది సాంప్రదాయ సింథటిక్ లెదర్‌లలో సాధారణంగా ఉండే ప్లాస్టిక్ లేదా రసాయన వాసనలను నివారిస్తుంది. ప్రస్తుతం సూరత్‌లోని ప్లాంట్‌లో నెలకు సుమారు 5000 మీటర్ల బయోలెదర్‌ను ఉత్పత్తి చేస్తోంది. ‘ది బయో కంపెనీ’ 2021లో పెటా వీగన్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ టెక్స్‌టైల్’ అవార్డును గెలుచుకుంది.






