భర్త కష్టాన్ని చూసి తట్టులేక మెకానిక్ ఆది‘లక్ష్మి’గా..

115
Mechanic Adi Lakshmi

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఆ కుటుంబానికి సరైన ఉపాధి లేదు. ఇంటి పెద్దకు పంక్చర్లు వేయడం, బండ్ల టైర్లు మార్చడం, చిన్న మెకానిక్ పనులు మినహా మరే పని రాదు. చేతినిండా పని ఉన్నా, చేతికింద మనుషులు లేకపోవడంతో ఇంటి ఇల్లాలు అదే వృత్తిని ఎంచుకుంది. భర్తకు దీటుగా లారీలు, కంటెయినర్లు, జేసీబీలు సహా హెవీ వెహికిల్స్ టైర్లు మార్చడం, పంక్చర్లు వేయడం, వెల్డింగ్ చేయడం అలవోకగా చేస్తోంది. భర్తకు చేదోడువాదోడుగా ఉండడంతో పాటు నాలుగురాళ్లు వెనుకేసుకుంటుంది. ఆమె ఇప్పుడాయింటికి లక్ష్మి అంటున్నారు చూసేవారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ కు చెందిన భద్రం, ఆదిలక్ష్మి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. భద్రం మెకానిక్ షెడ్డు నడుపుతుంటాడు. లారీలు, ఇతర వాహనాలకు టైర్లు మారస్తూ, పంక్చర్లు వేస్తుంటాడు. ఇద్దరూ ఆడపిల్లలు కావడం, ఒక్కడి సంపాదన మీద బతకడం కష్టంగా ఉండడం తనూ ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా భర్తకు చేదోడువాదోడుగా ఉండాలని రూ.లక్ష అప్పు తెచ్చి మరీ మెకానిక్ షెడ్డు ఏర్పాటు చేసుకుని భర్త చేసే పనే చేస్తోంది.

Adi Lakshmi

అలవోకగా పంక్చర్లు వేస్తూ..

ఆదిలక్ష్మి భర్త పనుల కోసం నాలుగేళ్ల కిందట రాష్ట్రాలు దాటి వెళ్లేవాడు. ఆమె రెండో కాన్పు సమయంలో భర్త దగ్గర లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడడంతో అప్పుచేసి మరీ మెకానిక్ షెడ్డు ఏర్పాటు చేయించింది. భర్త ఒక్కడే కష్ట పడడాన్ని చూసి తట్టులేక మొదట్లో తనూ కాస్త సాయం చేసేది. ఇప్పుడేమో భర్తతో సమానంగా అన్ని పనులూ చేస్తోంది. లారీ, జేసీబీ, కంటెయినర్ టైర్లు మార్చడం, పంక్చర్లు వేయడం చేస్తుంది. వెల్డింగ్ చేయడం, చిన్నాచితక మెకానిక్​ పనులు కూడా చేస్తోంది. సుమారు 40 కేజీల వరకు బరువుండే టైర్లను అలవోకగా మారుస్తూ ఔరా అనిపిస్తుంది. భర్త అందుబాటులో లేని సమయంలో ఆదిలక్ష్మి కస్టమర్లు వెనుదిరగకుండా మెకానిక్ పనులు కూడా చేస్తుంది. మగాళ్లు మాత్రమే చేయగలరనుకున్న పని ఒక్కతే చేసి చూపడంతో ఆదిలక్ష్మిని పలువురు శభాష్​ అంటున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత సైతం ఆమెను పిలిపించి అభినందించారు.

ఆర్థిక పరిస్థితుల కారణంగానే : ఆదిలక్ష్మి, సుజాతనగర్

ఆర్థిక పరిస్థితుల కారణంతోనే ఈ పనిలోకి దిగాల్సి వచ్చింది. ఇద్దరు ఆడపిల్లలను సాదడం కష్టంగా ఉండడంతో అప్పు తెచ్చి మరీ భర్తతో మెకానిక్ షెడ్డు పెట్టించాను. ఇప్పుడు నేను కూడా పెద్ద వాహనాల టైర్లు మార్చడంతో పాటు, మెకానిక్ పనులు చేస్తుంటాను. ఈ పనులు చేస్తున్న క్రమంలో నాకు ఎంతో మంది ధైర్యాన్నిస్తున్నారు. భవిష్యత్ లో ఇద్దరం కష్టపడి పిల్లలను ఉన్నతంగా చదివించుకుంటాం.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..