ధరణి తెచ్చిన దందా

by  |
ధరణి తెచ్చిన దందా
X

కొత్తగా రాబోతున్న ‘తెలంగాణ భూముల హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 2020’ అనేక మార్పులను తీసుకురానుంది. ఆటోమెటిక్ మ్యూటేషన్ అందరికీ వెసులుబాటు కల్పించనుంది. యజమానులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్పుతుందేమో.. భూ హక్కులు మాత్రం వివాదాల సుడిగుండంలో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తు న్నారు. పరిష్కార మార్గాలకు రెవెన్యూ యంత్రాంగం వెసులుబాటు కల్పించకపోవడమే ఇందుకు కారణం. దీంతో సత్వర న్యాయం దొరికే అవకాశాలు దూరమయ్యాయి. ఇది సెటిల్మెంట్ల దందా కు దారి తీస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: భూ వివాదాలకు సంబంధించి ఇప్పటి వరకు తహసీల్దార్లు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్ల ద్వారా పొందే న్యాయ ప్రక్రియ రద్దయ్యింది. దాంతో కొందరు సెటిల్మెంట్ల దందాకు తెర తీస్తున్నారు. ‘తె లంగాణ భూమిపై హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 1971’లో పేర్కొన్న అపరిష్కృత అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లను కొత్త ఆర్వోఆర్ చట్టం సెక్షన్ 16 (1,2) ప్రకారం ప్రత్యేక ట్రిబ్యునళ్లకు బదిలీ చేస్తున్నారు. ఇక ఆర్డీఓలకు అప్పీలు చేయడం, జాయింట్ కలెక్టర్ల దగ్గర రివిజన్ పిటిషన్లు వేయడం కుదరదు. ఎవరికైనా అన్యాయం జరిగిందని భావిస్తే సివిల్ కోర్టును ఆశ్రయించాల్సిందే. తుది తీర్పు ఎంత కాలానికి వస్తుందో తెలియదు. వ్యయప్రయాసలు. ఫీజుల మోత యజమానిపై పెనుభారాన్ని మోపనున్నాయి. ఈ క్రమంలోనే సత్వర న్యాయం పొందేందుకు పలువురు ఠాణా మెట్లెక్కేందుకే ఆసక్తి చూపుతున్నారు. అందుకే, ఇప్పుడు రాచకొండ, సైబరాబాద్, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి ప్రాంతాల్లోని చాలా పోలీసు స్టేషన్లు భూ వివాదాల బాధితులతో కళక ళలాడుతున్నాయి. లా అండ్ ఆర్డర్ సమస్య పేరిట సెటిల్మెంట్ దందా నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా వంత పలుకుతున్నారు.

అయితే, రాసివ్వండి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయానికి ఓ రైతు వచ్చాడు. తహసీల్దార్ తనకు అన్యాయం చేశారని మొర పెట్టుకున్నాడు. న్యాయం చేయాలంటూ ఆర్డీఓకు దరఖాస్తు ఇచ్చాడు. ఇది తన పరిధిలో లేదంటూ ఆర్డీఓ సదరు రైతుకు చెప్పారు. కొత్త ఆర్వోఆర్ చట్టం ప్రకారం రెవెన్యూ కోర్టులు రద్దయ్యాయని, సివిల్ కోర్టుకే వెళ్లాలని సూచించారు. దీంతో రైతు ఆర్డీఓపై మండిపడ్డాడు. కోర్టుకు ఎందుకు వెళ్లాలని, తనకు అన్ని హక్కులు ఉన్నాయంటూ వాదించాడు. అదే విషయం లిఖితపూర్వకంగా రాసివ్వాలని పట్టుబట్టాడు. దీంతో అధికారి తలపట్టుకున్నారు. ఇప్పుడి లాంటి సంఘటనలు అక్కడక్కడా చోటు చేసుకుంటున్నాయి. సదరు రైతు ‘రెవెన్యూ చట్టం బాగుంటుందంటూ’ నిర్వహించిన ర్యాలీలో బండి కట్టినవారే కావడం గమనార్హం. కొత్త చట్టం మంచిదే నా అంటూ కొందరు ఎమ్మెల్యేలు కూడా ఆర్డీఓలను అడుగుతున్నట్టు తెలిసింది. ఏయే అంశాల్లో లోపాలు ఉన్నాయంటూ అడిగి తెలుసుకుంటున్నారని ఓ డిప్యూటీ కలెక్టర్ చెప్పారు.

వివాదాల తీరిదీ

ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలో ఒకరికి ఏడు గుంటల భూమి ఉంది. అన్ని పత్రాలు యజమాని దగ్గర ఉన్నాయి. మరొకరు జబర్దస్తీగా పొషిషన్లో ఉన్నారు. ఇద్దరినీ కూర్చోబెట్టి సెటిల్ చేశారు. లేదంటే సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేది. ప్రముఖులు ఉండే కాలనీలో ఒకరికి 1000 గజాల జాగ ఉంది. దానికి పట్టాదారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలతో గొడవలు తలెత్తాయి. సెటిల్మెంట్ పూర్తయ్యింది. నగర శివార్లలో గజం రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు పలికే ప్రాంతంలో 2000 గజాల స్థలానికి వారసులు ఉన్నారు. వారికి న్యాయపరంగా అన్ని హక్కులు ఉన్నాయి. మరొకరు సీన్ లోకి ప్రవేశించారు. అది కూడా పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. సైబరాబాద్ ప్రాంతంలో ఓ రియల్టర్ పై పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. కొంత కాలం క్రితమే అతడిపై పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. నేటికీ పెండింగులోనే ఉంచారు. భూములు అమ్మారు.. సేల్ డీడ్స్ వచ్చాయి. కొనుగోలుదారులు మ్యూటేషన్లు చేయించుకోకపోవడంతో రెవెన్యూ రికార్డుల్లో అమ్మినవారి పేర్లే వచ్చాయి. మేం అమ్మలేదు.. మాకు ఇంకా డబ్బులు రావాలంటూ పేచీలు పెడుతున్నారు.

కోర్టుకు వెళితే ఆర్థిక భారం

భూ వివాదాల పరిష్కారానికి సివిల్ కోర్టులను ఆశ్రయించాలంటే ఆర్ధిక భారం తప్పదు. రెవెన్యూ కోర్టులు ఉంటే పైసా ఖర్చు లేకుండా న్యాయం పొందే అవకాశం ఉంది. ఇప్పుడా వెసులుబాటు రద్దయ్యింది. ఈ విషయం చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తలెత్తే వివాదాల సంఖ్య ద్వారా బహుళ ప్రాచుర్యంలోకి వస్తుందని ఓ సీనియర్ అధికారి అన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య అంటూ స్టేషన్ మెట్లెక్కితే ఇరువర్గాలు ఓ అవగాహనకు రావచ్చునన్న అభిప్రాయం నెలకొంది. సివిల్ అంశాల్లో తలదూర్చొద్దని పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఏసీబీకి చిక్కిన పోలీసుల కేసుల్లో చాలా వరకు భూ సంబంధ అంశాలే అత్యధికం కావడం విశేషం.

సొంత లాభం కోసమేనా?(బాక్స్)

అది హైటెక్ సిటీకి కాస్త దూరంలో రాష్ట్రంలోనే అత్యధిక ధరలకు భూములు అమ్ముడుపోయిన గ్రామం. అక్కడే చెరువు పక్కన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ విల్లాలు నిర్మిస్తోంది. ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని గ్రామస్థుల ఆరోపణ. రెవెన్యూ, నీటి పారుదల యంత్రాంగాలేవీ అటువైపు కన్నెత్తి చూడలేదు. ఆ సంస్థకు పెద్దలతో బలమైన బంధం ఉందని ముందుగానే ప్రచారం చేసుకుంది. కనీసం మీడియా కూడా అటువైపు దృష్టి సారించలేదు. కొద్ది రోజుల క్రితం ఓ ఎమ్మెల్సీ, ఓ నామినేటెడ్ పోస్టులో ఉన్న నేత అక్కడికి వెళ్లారు. వారు ఎఫ్టీఎల్లో నిర్మించిన విల్లాలను పరిశీలిస్తారని అనుకున్నారు. సదరు సంస్థ వారిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గన్ మన్లతో వచ్చి మూడు విల్లాలు కావాలంటూ భయాందోళనకు గురి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

Next Story

Most Viewed