తెలంగాణలో సరిహద్దు సమస్యలు.. పరిష్కారం కష్టమే..!

by  |
తెలంగాణలో సరిహద్దు సమస్యలు.. పరిష్కారం కష్టమే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో లెక్కకు మించిన సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న తరుణంలో నేల మీద గీతలతో హద్దులను పక్కా చేయడం అసాధ్యమని భూ చట్టాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పటంలోని హద్దులను నేల మీద యథాతథంగా ఉన్నాయనుకోవడం పొరపాటే అంటున్నారు. గ్రామం యూనిట్‌గా ప్రతి కమతాన్నీ సమగ్ర భూ సర్వే చేసి సెటిల్మెంట్ చేయడానికి మూడు నుంచి ఐదేండ్లు పట్టే అవకాశం ఉంది. రెండు, మూడు నెలల్లోనే పూర్తి చేసే కో ఆర్డినేట్ల విధానంతో సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం తక్కువే. కొత్త సమస్యలూ ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు. సరిహద్దు వివాదాలను సర్దుబాట్లతోనే పరిష్కరించుకుంటున్న రైతు కుటుంబాల సంఖ్యే అత్యధికం. వారి పట్టాదారు పుస్తకాలకు, అనుభవిస్తున్న భూములకు మధ్య భారీ తేడాయే ఉంది. హక్కులు ఓ సర్వే నంబరులో ఉంటే, భూమి మరో సర్వే నంబరులో ఉంది. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి పరిస్థితి 30 శాతం వరకు ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఇలా ఉండగానే కో ఆర్డినేట్లను గుర్తించడంతో కలిగే ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆ హామీ ఇదేనా?

భూ చట్టాలను పక్కాగా అమలు చేయాలంటే భూ సమగ్ర సర్వేను పూర్తి చేయాలి. హక్కుదారుడికి, హద్దులకు భద్రత కల్పించాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ కోసం ధరణి పోర్టల్ ద్వారా కార్యక్రమాలను నిర్వర్తిస్తోంది. ‘రెవెన్యూ చట్టం తీసుకొచ్చేటపుడు రైతు కోణంలోనే కాకుండా ప్రజల కోణంలోనూ ఆలోచించాలి’ అని నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం. సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కూడా రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేస్తామని ప్రకటించారు. 2014-15, 2015-16 బడ్జెట్ లో రూ.1000 కోట్లు కేటాయించారు. ఎంత ఖర్చు చేశారో ప్రభుత్వానికే తెలియాలి. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.83 కోట్లు మంజూరు చేసింది. సమగ్ర సర్వేకు రూ.567 కోట్లు మంజూరు చేయాలంటూ కేంద్రాన్ని కోరింది. మొదట కేటాయించిన నిధులు దేని కోసం వెచ్చించారో తెలియదు. ఏమైందోగానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ మాటే మరిచింది. కేంద్ర ప్రభుత్వం కూడా తరువాత నిధులను విడుదల చేయలేదు. ఇప్పుడేమో భూ సమగ్ర సర్వే అంశాన్ని దాటవేస్తున్నారని రెవెన్యూ విశ్రాంత ఉద్యోగులు విమర్శిస్తున్నారు.

అంతే లేని తేడా

చాలా రాష్ట్రాలు టైటిల్ గ్యారంటీ విధానం అమలుకు యత్నిస్తున్నాయి. కర్నాటక, పశ్చిమబెంగాల్, కేరళ, నాగాలాండ్, త్రిపుర, జార్ఖండ్, గుజరాత్ సమగ్ర భూ సర్వే ప్రక్రియను పూర్తి చేశాయి. సీఎం కేసీఆర్ ప్రకటించిన కో ఆర్డినేట్స్ ఏర్పాటుకు, సమగ్ర భూ సర్వేకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని నిపుణులు చెబుతున్నారు. కో ఆర్డినేట్లతో వివాదాలు పూర్తి స్థాయిలో పరిష్కారం కావంటున్నారు. తొలుత సర్వే నంబర్లు, వాటి విభాగాల లెక్క తేలాలి. అప్పుడే ఖాస్రా పహాణికి, ఆర్ ఎస్ ఆర్ విస్తీర్ణానికి, పట్టాదారు పుస్తకాల విస్తీర్ణాలకు మధ్య వ్యత్యాసానికి పరిష్కారం లభిస్తుంది.

సర్వే చేయాలంటే..

– సర్వే నంబర్లలో భూములు సమానంగా లేవు. ఒక్కో సర్వే నంబరులో ఒక గుంట నుంచి ఆరు వేల ఎకరాల వరకు ఉన్నాయి. కొత్తగా పటాలు తయారు చేసుకోవాలి. సర్వే చేసేందుకు కొత్త చట్టం కావాలి.
– తెలంగాణ సర్వే బౌండరీస్ యాక్టు 1923 ప్రకారం ఎవరైనా సర్వే చేసేందుకు అవకాశం లేదని భూ చట్టాల నిపుణులు ప్రొఫెసర్ ఎం సునీల్ కుమార్ అంటున్నారు.
– సర్వే పాత పటాలతోనే చేయాలనుకుంటే మొదట సబ్ డివిజన్లు చేసుకోవాలి.
– టిప్పన్ ను బట్టి యథాతథంగా సబ్ డివిజన్లతో సహా రూపొందించాలి.
– వివాదాలు ఎప్పటికప్పుడు పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
– కో ఆర్డినేట్లను ఫిక్స్ చేసినా తలెత్తే సమస్యలను పరిష్కరించలేకపోతే పార్టు- సి కింద లక్షలాది ఖాతాలు చేరుతాయి.
– నిజామాబాద్ లో పైలెట్ ప్రాజెక్టు ఫెయిల్ కావడానికి కారణం సర్వే చేసి, సెటిల్మెంట్ చేయకపోవడమే.

ఆరు అంశాలు అనివార్యం
– భూముల సమగ్ర సర్వే జరగాలి. డిజిటల్ కో ఆర్డినేట్లతో మేలు కొంతే. సర్వే సెటిల్మెంట్ జరగాలి.
– వివాదాలేవీ లేవని అధికారులు చెబుతున్నారు. అదే నిజమైతే పట్టాదారు పుస్తకానికి గ్యారంటీ ఇవ్వాలి.
– భూమికి పటం ఇస్తారు. వివాదం ఏర్పడితే సివిల్ కోర్టుకు వెళ్లమనడం కరెక్టు కాదు. ప్రజలకు దగ్గరగా పరిష్కార వేదికలను ఏర్పాటు చేయాలి.
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్ధికంగా వెనుకబడిన వారికి వ్యవస్థను దగ్గరికి చేయాలి. న్యాయ సలహా కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
– ల్యాండ్ అంటే రెవెన్యూ కాదు. మేనేజ్మెంట్ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. యూఎస్, యూకేల్లోనూ ల్యాండ్ మేనేజ్మెంట్స్ అథారిటీలు ఉన్నాయి. తెలంగాణలో లేకపోతే అన్యాయం జరుగుతుంది.
– తెలంగాణలో ఆర్వోఆర్ చట్టానికి మాత్రమే కొన్ని మార్పులు తీసుకొచ్చారు. దాన్ని కొత్త రెవెన్యూ చట్టంగా చెప్పడం విడ్డూరంగా ఉంది. మిగతా అన్ని చట్టాలను కలిపి ఏకీకృతం చేయాలి.


Next Story

Most Viewed