మనసున్న సాహితీమూర్తి రంగనాథాచార్యులు

by  |
KK Ranganathacharya
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహోపాధ్యాయుడు, మనసున్న సాహితీమూర్తి రంగనాథచార్యులు అని సాహితీవేత్తలు కొనియాడారు. శుక్రవారం తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరం శంకరం అధ్యక్షతన ఇటీవల మృతి చెందిన సుప్రసిద్ధ కవి, రచయిత, విమర్శకుడు కేకే రంగనాథచార్యులు సంస్మరణ సభను వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు.

కవి నిఖిలేశ్వర్ మాట్లాడుతూ కేకే రంగనాథాచార్యులు ఆధునికత, హేతుబద్ధత కలిగిన వ్యక్తి, నిబద్ధుడైన ఉపాధ్యాయుడు, సాహిత్యానికి అంకితమైన వ్యక్తి అని కొనియాడారు. డాక్టర్ నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ శాసన భాషపై ‘తెలుగు భాష చరిత్ర’లు ఆయన రాసిన వ్యాసం భాషా చరిత్రపై ఆయనకున్న సాధికారతకు ఎదురులేని నిదర్శనమని, రంగనాథాచార్యులు గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి అని అన్నారు.

డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గురజాడపై రంగనాథాచార్యులు వందల ఉపన్యాసాలు ఇచ్చారని, ఆయన ఉపన్యాసాలు ఏ విషయం చర్విత చరణం కాలేదని ప్రతిసారీ కొత్త విషయం, కొత్త కోణంలో చెప్పేవారన్నారు. తెలుగు సాహితీ రంగం గొప్ప వ్యక్తిని కోల్పోయిందని అన్నారు. డాక్టర్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయన శిష్యులను ప్రశంసించే సందర్భంలో కళ్లతో, పెదాలపై నవ్వుతో తన వాత్సల్యాన్ని ప్రదర్శించే వాడని, తన వద్ద చదువుకున్న శిష్యుల ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసిన మహోపాధ్యాయుడు రంగనాథాచార్యులు అని కీర్తించారు.

వేల్చూరి నారాయణరావు మాట్లాడుతూ స్నేహితులను గౌరవించడంలో స్నేహాన్ని పంచడంలో రంగనాథాచార్యులు ఎంత గొప్పవాడో సాహిత్యానికి సేవ చేయడంలో నిష్కామ మార్గంలో నడిచిన వ్యక్తి అని కొనియాడారు. ఈ సభలో సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి.శంకర్, ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్, సాహితీవేత్త ఆచార్య పిల్లలమర్రి రాములు, సుధామ, నందగిరి మృదుల, కృష్ణాబాయి, కందుకూరి శ్రీరాములు, రాపోలు సుదర్శన్, చీదెళ్ల సీతాలక్ష్మి, కృష్ణమాచారి, ఇంద్రవెల్లి రమేష్, గిరిజా కృష్ణ, కొండపల్లి నీహరిణి, దాస్యం సేనాధిపతి పాల్గొన్నారు.


Next Story

Most Viewed