పెను దుమారం రేపిన కేసీఆర్ టూర్.. నేతలందరూ ఎగ్జిట్

by  |
పెను దుమారం రేపిన కేసీఆర్ టూర్.. నేతలందరూ ఎగ్జిట్
X

దిశ, సిరిసిల్ల: సిరిసిల్లలోని సీఎం కేసీఆర్ టూర్ ఓ వైపున మోదం.. మరోవైపున ఖేదం నింపింది. ముఖ్యమంత్రి పర్యటనతో ఇంటి పోరు మొదలు కావడంతో.. ముఖ్య నాయకులను బుజ్జగించే పనిలో పడ్డారు. సిరిసిల్లలో కేసీఆర్ ఆదివారం పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి హాజరయ్యే వివిధ కార్యక్రమాల్లో తమకు కూడ పాసులు ఇవ్వాలని కొంతమంది నాయకులు అడిగితే చాలా తక్కువ మందికే పర్మిషన్ ఉందని, ఇందులో ముఖ్య నాయకులే ఉంటారని చెప్పడంతో కొంతమంది నాయకులు నిమ్మకుండి పోయారు. అయితే ఆదివారం నాటి సీఎం టూర్ సీన్‌ను పరిశీలించిన సదరు నాయకులు తమపై వివక్ష చూపుతారా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఛోటా మోటా నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి పార్టీలో ఓ స్థాయిలో ఉన్న తమకు మాత్రం పాసులు ఇవ్వకపోవడం ఏంటని మనోవేదనకు గురయ్యారు. అసంతృప్త నేతలంతా ఓ వైపున సీఎం టూర్ సాగుతుండగానే.. మరో వైపున ఓ చోట చేరి చర్చించుకున్నారు. పాసులు ఇవ్వాలని తాము ముందే అడిగితే ప్రోటోకాల్ ఇబ్బంది అవుతుందన్న సాకు చూపి తమకు ఇవ్వకుండా ఎవరికి పడితే వారికి ఎలా అనుమతించారోనన్న విషయంపై తర్జనభర్జన పడ్డ నాయకులు.. చివరకు తమ నిరసనను పార్టీ పెద్దలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నారు.

సోమవారం ఉదయం నుండి పార్టీకి చెందిన వివిధ వాట్సప్ గ్రూపుల నుండి ఒక్కో నాయకుడు ఎగ్జిట్ అవుతూ వచ్చారు. దీంతో అసలేం జరిగిందో అర్థం కాక సిరిసిల్లకు చెందిన ముఖ్యనాయకులు ఆరా తీశారు. చివరకు అలక వహించిన నాయకులను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది నాయకులు ఈ ఒక్క విషయంలోనే కాదని, చాలా విధాలుగా తాము అన్యాయానికి గురవుతున్నామని ఆవేదన వెలిబుచ్చినట్టు సమాచారం. విలీన గ్రామాలకు నిధులు కేటాయించే విషయంలోనూ అన్యాయం చేస్తున్నారంటూ కొంతమంది నాయకులు తమ గోడు వెల్లబోసుకున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సక్సెస్ అయిన సంబరాల్లో మునిగిపోవాల్సిన ముఖ్య నాయకులు సరికొత్త తలనొప్పిని ఎదుర్కుంటున్నారని అంటున్నారు స్థానికులు.

Next Story

Most Viewed