బడ్జెట్‌పై కేసీఆర్ కసరత్తు షురూ…

by  |
బడ్జెట్‌పై కేసీఆర్ కసరత్తు షురూ…
X

దిశ, న్యూస్‌బ్యూరో: వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-2021) బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి కసరత్తు మొదలు పెట్టింది. ఇందుకు సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీసు ప్రగతిభవన్ వేదికైంది. గురువారం గంటల తరబడి సీఎం నెక్స్ట్ బడ్జెట్ విషయమై సమీక్షించారు. ఈ బడ్జెట్ కసరత్తులో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, పలువురు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో మాంద్యం వల్ల పన్ను రాబడులు తగ్గిన నేపథ్యంలో రాబోయే ఏడాదిలో దాని ఎఫెక్ట్‌పై అధికారులతో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ఈ కొత్త బడ్జెట్ నుంచే అమలులోకి వస్తుండడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా(డివల్యూషన్)లో ఎంత తగ్గుతుంది. ఇతర కేంద్ర పథకాల్లో కేంద్రం నుంచి ఎంత వస్తుందనే అంచనాలపైనా సీఎం అధికారులను ఆరా తీశారు. కేంద్ర పన్నుల వాటా తగ్గనున్న నేపథ్యంలో రాష్ట్ర సొంత పన్నుల రాబడి(ఎస్‌వోఆర్) మీదే ఆధారపడాల్సి ఉండడంతో వాటి రాబడి వచ్చే ఏడాదిలో ఎలా ఉంటున్నదానిపైనా చర్చించారు. ఇప్పటికే మద్యంపై ఎక్సైజ్ సుంకం పెంచడం వల్ల పెరిగిన ఆదాయం, త్వరలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచడం వల్ల ఎంత మేర ఎస్‌వోఆర్ పెరుగుతుందన్నదానిపైనా చర్చించారు. మాంద్యం ఎఫెక్ట్, కేంద్రం నుంచి వచ్చే నిధులు తగ్గనున్న నేపథ్యంలో గత సంవత్సరం ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్ లక్షా 46 వేల కోట్లకు 10 శాతం అంటే పెంపుతో లక్షా 60 వేల కోట్లకు ఈ బడ్జెట్ ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్నదానిపై సమాలోచనలు జరిపారు. ఇక ఈసారి బడ్జెట్‌లో ఏ‌యే శాఖలకు, ప్రభుత్వ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించాలన్న దానిపై ఇప్పటికే అన్ని శాఖల నుంచి తెప్పించుకున్న ప్రతిపాదనలపైనా సుదీర్ఘంగా చర్చించారు. ఎప్పటిలాగే ఇరిగేషన్, పవర్, అగ్రికల్చర్, సంక్షేమ శాఖలకు అధికభాగం నిధులు కేటాయించాలని సీఎం అధికారులకు సూచించినట్లు సమాచారం. మార్చి రెండో వారంలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.

2018 ఎన్నికల హామీల ఈసారైన మోక్షం కలిగేనా..

బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ కసరత్తు మొదలుపెట్టగానే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై చర్చ స్టార్టైంది. లక్షరూపాయల వరకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలు ఇప్పటికి స్టార్టే కాలేదు. ఈసారైనా వీటికి మోక్షం కలుగుతుందా మాంద్యం పేరిట మొండి చేయి చూపిస్తారా అన్నదానిపై అధికార వర్గాల నుంచి కచ్చితమైన సమాధానం రావడం లేదు.

Next Story

Most Viewed