ఎంపీ రంజిత్‌కు రూ.1500 కోట్ల భూమిని కట్టబెట్టిన కేసీఆర్

by  |
Dasoju
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ ఆరోపించారు. ఫిల్మ్ నగర్ భూముల్లోని17 ఎకరాలను ఎంపీ రంజిత్ రెడ్డికి, అతని సన్నిహితుడు ఇందు శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ప్రభుత్వం అడ్డగోలుగా ఇచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆయన బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కంచె చేను మేసినట్టుగా అధికార పార్టీ నాయకులు విలువైన భూములను అడ్డగోలుగా తీసుకుంటున్నారని మండిపడ్డారు.

ఆంధ్ర ప్రాంతానికి చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భూములను కాపాడితే, ప్రస్తుత సీఎం కేసీఆర్ మాత్రం దోపిడీదార్లకు అప్పగించారని శ్రావణ్ ఆరోపించారు. ఇందులో కేసీఆర్‌కు వాటా ఎంత? అని ఆయన ప్రశ్నించారు. అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాలన్ని కూడా తొలగించి భూములను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన నియోజక వర్గంలో ఉన్న ఈ భూముల గురించి మాట్లాడతారా? అని శ్రావణ్ ప్రశ్నించారు. గతంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే‌గా పనిచేసిన చింతల రామచంద్రారెడ్డికి కూడా ఈ విషయం తెలుసని, కానీ ఆంజనేయ గుడిని కాపాడేందుకు బీజేపీ ఎందుకు పోరాటం చేయలేదని నిలదీశారు.

ఇప్పటికే ఈ అంశంపై ముఖ్యమంత్రితో పాటు సంబంధిత అధికారులకు, హోసింగ్ బోర్డుకు లేఖలు రాసినట్టు దాసోజు శ్రావణ్ తెలిపారు. తెలంగాణ భూములను అక్రమార్కుల నుంచి కాపాడేందుకు ఎంత దూరం అయిన వెళ్తామని చెప్పుకొచ్చారు. దీంతో పాటు ఆ భూముల్లో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా కాపాడుతామన్నారు.


Next Story

Most Viewed