సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిని ఫిక్స్ చేసిన కేసీఆర్

by  |
nagarjuna sagar trs mla candidate
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎవరిని అభ్యర్థిగా నిలపనున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఈ ఉత్కంఠకు తెర దించుతూ నోముల భగత్‌ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ఫిక్స్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహయ్య ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. కుమారుడికే టికెట్ ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ అప్పట్లోనే కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. పార్టీ సీనియర్ నాయకులు తేరా చిన్నపరెడ్డి, కోటిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి పలువురి పేర్లను పార్టీ నేతలు పరిశీలించినా చివరకు భగత్‌ నే అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేశారు. ఆయనను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని చర్చించిన కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో నోముల భగత్ కు కేసీఆర్ బి ఫామ్ ఇవ్వనున్నారు.

నోముల నర్సింహయ్య ఎమ్మెల్యేగా గెలవకముందు నుంచే కుమారుడు భగత్ టీఆర్ఎస్ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఆర్గనైజర్‌గా ఉన్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, లా కోర్సులో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భగత్ రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతో నోముల కుటుంబం తరఫున ఎన్ఎల్ ఫౌండేషన్‌ను ఏర్పాటుచేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యాపరంగా తగిన సహాయ సహకారాలు చేస్తూ ఉండేవారు. కొన్ని గ్రామాల్లో ఉచితంగా మెడికల్ క్యాంపులను నిర్వహించారు. ఉపాధి కల్పన కోసం తగిన శిక్షణ లభించేలా ప్రత్యేక కోచింగ్ క్లాసుల నిర్వహణకు కృషి చేశారు. కొంతకాలం సత్యం టెక్నాలజీస్‌లో ఇంజనీర్‌గా పనిచేసిన భగత్, ఆ తర్వాత విస్తా ఫార్మా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశారు. ఇప్పుడు నాగార్జున సాగర్ అసెంబ్లీ నుంచి ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.



Next Story

Most Viewed