మధ్యలో వచ్చే ఉప ఎన్నికలతో ఏం కాదు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

64

దిశ ప్రతినిధి, నిజామాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో మళ్ళీ టీఆర్‌ఎస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు. అక్కడ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఈటల రాజేంద్రన్న ప్రజలకు చెప్పలేకపోతున్నారన్నారు. రెఫరెండం అని ఎవరు పడితే వాళ్లు అనుకుంటే కాదు, ప్రజలు అనుకోవాలని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు రెఫరెండం అవుతాయి కానీ, మధ్యలో వచ్చే ఉప ఎన్నికలు కాదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ-టీఆర్ఎస్‌ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని తాము అనుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిన వారు బాగుపడినట్టు చరిత్రలోనే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు దశాబ్దాల టీఆర్ఎస్ ప్రస్థానంలో.. ఎన్నో ఉద్యమాలను చరిత్రలో లిఖించి.. స్వరాష్ట్రాన్ని సాధించుకున్నట్టు గుర్తు చేశారు. తెలంగాణకి కేసీఆర్ ఒక వజ్రాయుధమని.. టీఆర్ఎస్‌ పార్టీని దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు ఆదర్శంగా తీసుకున్నాయంటూ కొనియాడారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..