క్వారంటైన్ తర్వాత… గంట గంటకో ‘సెల్ఫీ’

by  |
క్వారంటైన్  తర్వాత…  గంట గంటకో ‘సెల్ఫీ’
X

దిశ వెబ్ డెస్క్ :
కరోనా అనుమానితులను హోం క్వారంటైన్లో ఉండాలని ప్రభుత్వాలు పదే పదే కోరుతున్నాయి. అంతేకాదు విదేశాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఆ తర్వాత ఇల్లలోనే 14 రోజులు ఉండేందుకు అనుమతిచ్చారు. ఒకవేళ బయట తిరిగినా.. తేలికగా గుర్తించేందుకు వీలుగా చేతిపై హోం క్వారంటైన్ స్టాంప్ కూడా వేశారు.
అయితే చాలా మంది .. అవేవీ పట్టించుకోకుండా.. యథేచ్ఛగా ఇళ్ల నుంచి బయటకొస్తున్నారు. మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. అయితే దీనికి చెక్ చెబుతూ.. కర్ణాటక ప్రభుత్వం ఓ వినూత్న ఐడియాతో ముందుకు వచ్చింది. హో క్వారంటైన్ వ్యక్తులు గంటకో సెల్ఫీ దిగి తమకు పంపాలని ఆదేశించింది.

దేశమంతా లాక్ డౌన్ విధించినా.. ప్రజలను ఇల్లకే పరిమితం చేసినా.. కరోనా తీవ్రత తగ్గడం లేదు. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశాలకు వెళ్లొచ్చిన వారిని రెండు వారాలపాటు క్వారంటైన్లో ఉండాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. ఇంటికే పరిమితం కావాలని, ఎవర్నీ కలవొద్దని సూచించాయి. కరోనా అనుమానితులు, కరోనా రోగులు కలిసిన వారికి కూడా ఇదే తరహా ఆదేశాలను జారీ చేశారు. కానీ చాలా మంది హోం క్వారంటైన్లో ఉండకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. చాలా మంది చేతుల మీద సిరా ముద్ర వేసినప్పటికీ వారు రోడ్ల మీద తిరుగుతూ పట్టుబడ్డారు. వీరిని కట్టడి చేయడం ప్రభుత్వానికి కష్టతరంగా మారింది. అందుకే కర్ణాటక ప్రభుత్వం ఓ వినూత్న విధానాన్ని ప్రారంభించింది.

న్యూ యాప్ :

హోం క్వారంటైన్లో ఉన్నవారు ఇళ్లు వదిలి వెళ్లకుండా చూడటం కోసం కర్ణాటక రెవెన్యూ విభాగం ఓ మొబైల్ యాప్ రూపొందించింది. ఇక కరోనా పేషెంట్లు, అనుమానితులు తమ ఫోన్లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని ప్రతి గంటకు ఓ సెల్ఫీ దిగి పంపాల్సి ఉంటుంది. లేదంటే వెంటనే అధికారులు అలెర్ట్ అయిపోతారు. వారిని తీసుకెళ్లి క్వారంటైన్ సెంటర్లలో పడేస్తారు.హోం క్వారంటైన్లో ఉన్నవారు మొబైల్ యాప్‌లో తమ వివరాలను నమోదు చేసి గంటకు ఒకటి చొప్పున సెల్ఫీ దిగి పంపాలని కర్ణాటక వైద్య విద్య మంత్రి సుధాకర్ కరోనా అనుమానితులకు సూచించారు. ఈ ఫొటో ఆధారంగా, జీపీఎస్ సాయంతో సదరు వ్యక్తి ఇంట్లోనే ఉన్నాడా లేదా బయటకు వెళ్లాడా అనేది నిర్ధారిస్తారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య మినహాయింపు ఇచ్చారు. మిగతా వేళల్లో సెల్ఫీ దిగి పంపకపోయినా, అతి తెలివితో ఏదో ఒక ఫొటో పంపినా.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తారు. హోం క్యారంటైన్ వ్యక్తులకు ఈ ఐడియాతో దిమ్మతిరిగిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Tags: coronavirus, selfie, home quarantine, lockdown, karnataka govt, police


Next Story

Most Viewed