- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌లో పదవుల పోరు.. మార్కెట్ కమిటీ చుట్టూ ముదిరిన వివాదం!
కుర్చీలాట.. గ్రూపుల లొల్లి!కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల పంపకం తీవ్ర గ్రూపు రాజకీయాలకు దారితీసింది. పాత, కొత్త నాయకుల మధ్య సయోద్య కుదరకపోవడంతో అంతర్గత విభేదాలు రోడ్డుకెక్కాయి.

కుర్చీలాట.. గ్రూపుల లొల్లి!కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల పంపకం తీవ్ర గ్రూపు రాజకీయాలకు దారితీసింది. పాత, కొత్త నాయకుల మధ్య సయోద్య కుదరకపోవడంతో అంతర్గత విభేదాలు రోడ్డుకెక్కాయి. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవిపై అసంతృప్తితో సుదగోని లక్ష్మినారాయణ పార్టీ పదవికి రాజీనామా చేశారు. చైర్మన్ నియామకం వెనుక మంత్రి పొన్నం, ఎమ్మెల్యే కవ్వంపల్లి, వెలిచాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కష్టకాలంలో జెండా మోసిన కార్యకర్తలను విస్మరించి, కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై సీనియర్లు మండిపడుతున్నారు. ఈ అంతర్గత వైరానికి త్వరగా చెక్ పెట్టకపోతే రాబోయే ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.
- దిశ, కరీంనగర్ బ్యూరో
దిశ, కరీంనగర్ బ్యూరో : అధికార పార్టీ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల భర్తీ గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోస్తోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు పదవుల పంపకంతో ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. ప్రస్తుతం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ, సుడా పదవుల చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. నేతలు పైకి ఐక్యంగా కనిపిస్తున్నప్పటికీ, లోపల మాత్రం రగిలిపోతున్నారు. ఈ అంతర్గత పోరుతో పార్టీ పరువు బజారున పడే పరిస్థితి ఏర్పడిందని చర్చ జరుగుతోంది.
తారస్థాయికి చేరిన విభేదాలు...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఇద్దరు ప్రభుత్వ విప్‌లు, నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉన్నప్పటికీ, పదవుల విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. కరుడుగట్టిన పార్టీ కార్యకర్తలకు, సీనియర్లకు పదవులు దక్కడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాత, కొత్త నాయకులను సంతృప్తి పరచలేక జిల్లా నేతలు చేతులెత్తేస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.
మార్కెట్ కమిటీ నియామకమే లొల్లికి కారణం..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీని భర్తీ చేసింది. ఈ నియామకమే ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కరీంనగర్‌కు చెందిన ఆకుల నర్సయ్యను, వైస్ చైర్మన్‌గా తిమ్మాపూర్ మండలానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుదగోని లక్ష్మీనారాయణగౌడ్‌ను నియమించారు. అయితే, చైర్మన్ పదవి ఆశించిన సుదగోని.. తనకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పదవిని తిరస్కరించడమే కాకుండా, బ్లాక్ కాంగ్రెస్ పదవికి సైతం రాజీనామా చేశారు. సీనియర్లకు గుర్తింపు లేదంటూ గాంధీభవన్‌కు వెళ్లి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆయనతోపాటు తిమ్మాపూర్ మండలానికి చెందిన మరో నేత మాచర్ల అంజయ్యగౌడ్ సైతం నిరసన గళం విప్పి, హైదరాబాద్‌కు పాదయాత్రకు సిద్ధమయ్యారు.
స్క్రీన్‌ప్లే వెనుక ఉన్న నేతలు ఎవరు?
మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఆకుల నర్సయ్య వివాదరహితుడే అయినప్పటికీ, నేతల మధ్య ఉన్న వైరమే దీనిని వివాదాస్పదం చేసిందని తెలుస్తోంది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు పట్టుబట్టి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయరమణారావు సహకారంతో నర్సయ్యకు ఈ పదవి ఇప్పించారనే ప్రచారం ఉంది. అయితే, వెలిచాల రాజేందర్ రావుకు, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మున్సిపల్ ఎన్నికల సమయం నుంచి పడడం లేదు. దీనికి తోడు వెలిచాల వర్సెస్ మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ సమీకరణాలను వాడుకుంటూ జిల్లాలో చక్రం తిప్పుతున్న మరో కార్పొరేషన్ చైర్మన్ ఈ వివాదం వెనుక సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు పార్టీలోనే బహిరంగ చర్చ సాగుతోంది. వెలిచాలను టార్గెట్ చేసే క్రమంలోనే ఎమ్మెల్యే కవ్వంపల్లి అనుచరులైన తిమ్మాపూర్ నేతలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని కేడర్ భావిస్తోంది.
పాత వర్సెస్ కొత్త..
నిజానికి చైర్మన్ ఆకుల నర్సయ్య గతంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అనుచరుడిగా టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరి, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి వచ్చారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన వారిని కాదని, నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి పెద్దపీట వేయడంపై సీనియర్లు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్లు పార్టీలో పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్‌లకు ఫిర్యాదు చేయడంతోపాటు, అవసరమైతే జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలుస్తామని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.
అధిష్ఠానం వైఖరిపై సందిగ్ధత...
నాయకుల గ్రూపు తగాదాల వల్లే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కరీంనగర్ కార్పొరేషన్‌ను కోల్పోవాల్సి వచ్చిందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. తాజాగా సుడా చైర్మన్ పదవి ఒక్కటే ఇచ్చి, డైరెక్టర్లను నియమించకుండా ఉన్న కొద్దిపాటి బోర్డు పదవీకాలాన్ని రెండోసారి పొడిగించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధిష్ఠానం కరీంనగర్‌పై అసలు దృష్టి పెడుతుందా? లేదా? అనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికే సీనియర్ నేత జీవన్ రెడ్డి వంటి వారి విషయంలో జరిగిన పరిణామాలను గుణపాఠంగా తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి భారీ నష్టం తప్పదని కేడర్ హెచ్చరిస్తోంది.






