క‌రీంన‌గ‌ర్‌లో ఆ ముఠా గుట్టు రట్టు

by  |
క‌రీంన‌గ‌ర్‌లో ఆ ముఠా గుట్టు రట్టు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: గ్రానైట్ పాలిషింగ్ పౌడర్ పేరిట గన్ పౌడర్ (మందుగుండు) అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వేసిన స్కెచ్‌తో పేలుడు పదార్థాల స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సాయినగర్, సిద్దిపేటకు చెందిన ఇద్దరు వ్యక్తుల పేరిట గన్ పౌడర్ ప్రైవేటు ట్రాన్స్ పోర్టుల ద్వారా దర్జాగా స్మగ్లింగ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి భారీగా గన్ పౌడర్ ప్యాక్ చేసిన బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌లోని సాయినగర్ లో ఓ ఇంట్లో దాడులు చేయగా సుమారు 2 వేల వరకు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. వీరికి హైదరాబాద్‌లోని జాంబాగ్ ప్రాంతానికి చెందిన షబ్బీర్ అనే వ్యక్తి కరీంనగర్‌కు సరఫరా చేస్తున్నారని గుర్తించారు. గ్రానైట్ పాలిషింగ్ ఫౌడర్ పేరిట గన్ ఫౌడర్‌ను సప్లై చేస్తున్న వ్యవహారాన్ని బహిర్గతం చేశారు.

గ్రానైట్ క్వారీలకేనా?

గ్రానైట్ క్వారీల్లో ఉపయోగించేందుకు అక్రమంగా గన్ పౌడర్ సరఫరా చేస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్ సమీపంలోని గ్రానైట్ క్వారీల్లో రోప్ కటింగ్ సిస్టం ద్వారా కట్టర్ బ్లాక్, గ్యాంగ్‌సా పేరిట రా మెటీరియల్ సేకరిస్తారు. రా మెటీరియల్ భారీ సైజులో ఉండే వీటిని గుట్ట నుంచి కట్ చేసేందుకు ప్రభుత్వం పేలుడు పదార్థాలను ఉపయోగించేందుకు అనుమతి ఇస్తుంది. అయినా వీరు అక్రమంగా తీసుకు రావడం వెనక ఆంతర్యం ఏంటో అంతు చిక్కడం లేదు. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ఈ గన్ పౌడర్ కేవలం గ్రానైట్ క్వారీలకే వాడుతున్నారా లేక మావోయిస్టులకు చేరవేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్‌లో ఈ రాకెట్‌పై దృష్టి సారించిన పోలీసులు మొదట ఇదే అనుమానంతో అలెర్ట్ అయ్యారు. కానీ ఈ పేలుడు పదార్థాలు గ్రానైట్ కటింగ్ కోసమే వినియోగిస్తున్నారని ప్రాథమికంగా గుర్తించారు.

ఇల్లీగల్ బ్లాస్టింగ్ మెటీరియల్..

లీగల్ గా జరిగే గ్రానైట్ వ్యాపారానికి ఇల్లీగల్ బ్లాస్టింగ్ మెటీరియల్ తెప్పించుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నదే అంతుచిక్కకుండా తయారైంది. పేలుడు పదార్థాల వినియోగం కోసం గ్రానైట్ క్వారీల యజమానులు సంబంధిత శాఖల అనుమతి కూడా తీసుకుని కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు పోలీసుల దాడుల్లో వెలుగులోకి వచ్చిన అంశం సరికొత్త అనుమానానికి తెరలేపింది. ఆయా గ్రానైట్ క్వారీల్లో మందుగుండు వినియోగించేందుకు దొంగచాటుగా బ్లాస్టింగ్‌కు ఉపయోగించే గన్ పౌడర్, డిటోనేటర్లు ఎందుకు కొనుగోలు చేస్తున్నారో అంతు చిక్కకుండా తయారైంది.

గ్రానైట్ కోసమేనా?

కేవలం గ్రానైట్ క్వారీల్లో వినియోగించేందుకే తెస్తున్నారా లేక అసాంఘీక శక్తులకు కూడా ఇదే మాటు సరఫరా చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా అండర్ టన్నెల్ ల నిర్మాణం కోసం, కొన్ని ప్రాంతాల్లో గుట్టలను తొలిచేందుకు కూడా మందుగుండు సామాగ్రి వాడుతున్నారని గమనించిన మావోయిస్టులు మారు పేర్లపై కూలీలుగా వచ్చిన సంగతి తెలిసిందే. హుస్నాబాద్ ప్రాంతంలో చత్తీస్ ఘడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతానికి చెందిన మసాకి ఎడ్మాతో పాటు మరో ఇద్దరు కూలీలుగా చేరారు. వారిలో ఇద్దరు మిస్ కాగా ఒకరిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. వీరు కేవలం మందుగుండు సామగ్రి సేకరణ కోసమే వచ్చారు అన్న సమాచారం కూడా అప్పుడు పోలీసులు సేకరించారు. అయితే ఇప్పుడు కూడా ఇదే విధానంతో గ్రానైట్ క్వారీలకు వస్తున్న మందుగుండు సామగ్రి మావోయిస్టుల చేతికి వెళ్తుందా లేదా అన్న విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

క్వారీలపై చర్యలు ఉంటాయా?

అనుమతి లేకుండా గ్రానైట్ క్వారీలకు గన్ పౌడర్, డిటోనేటర్లు తెప్పించుకుంటున్న రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. అయితే ఇప్పటి వరకు ఎంత మేర ఈ మందుగుండు సామాగ్రి ఇక్కడకు చేరింది, ఏఏ క్వారీలు ఇలా ఉపయోగిస్తున్నాయి అన్న విషయంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.


Next Story