కరోనా రోగుల పట్ల మానవత్వం చూపాలి

by  |
కరోనా రోగుల పట్ల మానవత్వం చూపాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా రోగులకు సహనం, మానవత్వంతో చికిత్స చేయాలి.. ఐతే చాలా ఆస్పత్రుల్లో అలాంటి వాతావరణం లేదని మంత్రి హరీష్‌రావు అభిప్రాయపడ్డారు. సోమవారం బేగంపేటలో జితో హైదరాబాద్ చాప్టర్ హోటల్ మానస సరోవర్‌ను కొవిడ్ కేర్ సెంటర్‌గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులను ఆర్థికంగా పీల్చేస్తున్నాయన్నారు. ఇక్కడ ఏడు రోజుల ప్యాకేజీని కేవలం రూ.28వేల నుంచి రూ.35వేలకే అందిస్తుండడం అభినందనీయమన్నారు. పైగా అందులోనే భోజనం, మెడిటేషన్, బేసిక్ కిట్లు, చికిత్స, వసతి సదుపాయాలను కల్పించడం విశేషమన్నారు. హోటల్ నుంచి కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చడం పట్ల ప్రశంసించారు.

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు పొందినట్లు గుర్తు చేశారు. మహవీర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ మోతీలాల్ భల్గత్ మాట్లాడుతూ.. తమకు ఫ్రీ హోల్డ్ ఇచ్చారని, త్వరలోనే కొత్త భవనాన్ని నిర్మించుకోవడానికి సీఎం కేసీఆర్ తో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కుమార్, జితో సలహాదారులు నరేంద్ర సురానా, అశోక్ కోఠారి, సురేందర్ బాంతుస్, మోతీలాల్ భక్ఘత్, గౌతం బన్సీలాల్, బసంత్ బఫ్నా, గౌతం సెహ్లాట్, బీఎల్ భండార, అర్వింద్ శ్రీమల్, మనోజ్ పర్మర్ పాల్గొన్నారు.


Next Story