Worst CM అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే KCR పేరే వస్తుంది : జితేందర్ రెడ్డి

by  |
Worst CM అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే KCR పేరే వస్తుంది : జితేందర్ రెడ్డి
X

దిశ ప్రతినిధి. మహబూబ్ నగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ సాధించిన విజయాన్ని పక్కదోవ పట్టించేందుకు సీఎం కేసీఆర్ రకరకాల కుట్రలు చేస్తున్నారని బీజేపీ జాతీయ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరించడం వల్లే పోరుగడ్డ బిడ్డలైన హుజురాబాద్ ప్రజలు అసెంబ్లీ ఉప ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పారన్నారు.

ఈటల రాజేందర్ సాధించిన అద్భుత విజయాన్ని ప్రజలు చర్చించుకొనే అవకాశం ఇవ్వకుండా ప్రెస్‌మీట్‌లు పెట్టి బీజేపీ నాయకులపైన, కేంద్ర ప్రభుత్వంపైన విమర్శలు చేయడం మొదలుపెట్టారని అన్నారు. వరి కొనుగోలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు రూటు మార్చి రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేమని, ఈ అంశంలో కేంద్రాన్ని తప్పుబడుతూ ఆరోపణలు చేస్తూ ధర్నాలకు పిలుపునిచ్చారని జితేందర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ రాబడి.. వడ్డీలు, అప్పులు చెల్లించడానికి సరిపోతోందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మరోవైపు ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దళితులకు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తామని, దళిత బంధు అమలు చేస్తామని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి హామీలను అన్నింటినీ మరిచారని అన్నారు. తన కుటుంబానికి అవసరమైన పదవులను కల్పించుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇకనుండి ఎటువంటి ఉప ఎన్నికలు వచ్చినా బీజేపీ ఛాలెంజ్‌గా తీసుకొని విజయం సాధిస్తుందని అన్నారు. అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.

ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ ఇప్పటికీ చెల్లించలేదని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని జితేందర్ రెడ్డి చెప్పారు. అటువంటి ముఖ్యమంత్రి ప్రపంచమే మెచ్చుకుంటున్న ప్రధానమంత్రిపై విమర్శలు చేస్తారా..? ఒక్కసారి గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి వరస్ట్ సీఎం అంటే ఎవరో..? బెస్ట్ పీఎం ఇన్ ద వరల్డ్ అంటే ఎవరి పేరు వస్తుందో మీకే తెలుస్తుందని జితేందర్ రెడ్డి తెలిపారు.

ఇందులో భాగంగానే ఈనెల 16న హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్‌పై మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ మిలియన్ మార్చ్‌కు పెద్ద ఎత్తున నిరుద్యోగులు, జనం తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం మిలియన్ మార్చ్‌కు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, రాష్ట్ర నేతలు పద్మజా రెడ్డి, పడాకుల బాలరాజు, అంజయ్య, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed