తెలుగు రాష్ట్రాల్లో ‘జియో మార్ట్’ సేవలు

by  |
తెలుగు రాష్ట్రాల్లో ‘జియో మార్ట్’ సేవలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పెద్ద నగరాలు, చిన్న పట్టణాల్లో నివసించే ప్రజలకు నిత్యావసర కిరాణా వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే సౌలభ్యాన్నిఅందించేందుకు రిలయన్స్ రిటైల్ ఆన్ లైన్ ఇ-కామర్స్ వేదిక ‘జియో మార్ట్’ ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ‘ఎక్స్టెండెడ్ బీటా వెర్షన్’ కింద రెండు రాష్ట్రాల్లోని 30 పట్టణాల్లో జియోమార్ట్ సేవలను శనివారం అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్/ సికింద్రాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, బోధన్, ఖమ్మం, పాల్వంచ, మిర్యాలగూడ, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి‌లలో జియో మార్ట్ సేవలు లభ్యమవుతాయి. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, చిత్తూరు, కాకినాడ, గుంటూరు, తిరుపతి, తాడేపల్లిగూడెం, తణుకు, కర్నూలు, వినుకొండ, ఉయ్యురు, అనంతపురం, నర్సరావుపేట, భీమవరం, విజయనగరం‌లలో నివసించే వారు కిరాణ వంటి నిత్యావసర వస్తువులను జియో మార్ట్ నుంచి పొందవచ్చు. www.jiomart.com వెబ్సైట్ ద్వారా వినియోగదారులు తమ ప్రాంతంలో జియో మార్ట్ సేవల లభ్యతను తెలుసుకునేందుకు వీలుంది. జియో మార్ట్ ఏర్పాటు చేసిన ఈ కార్నర్ స్టోర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు తమకు అవసరమైన ఆహార, ఆహారేతర వస్తువులను పొందవచ్చు. పండ్లు, కూరగాయలు, నూనెలు, పప్పులు లాంటి బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, పానీయాలు, అంట్లు శుభ్రం చేసుకునేవి లాంటి మరింకెన్నో విభాగాలకు చెందిన వాటిని వినియోగదారులు పొందవచ్చు. ఎంఆర్పీ కన్నా కనీసం 5 శాతం తక్కువ ధరకు లభ్యమయ్యే వాగ్దానంతో జియో మార్ట్ వినియోగదారులకు మెరుగైన విలువను అందిస్తుంది. రెండు రోజుల్లో డెలివరీకి జియో వాగ్దానం చేసినప్పటికీ, ఎన్నో ఆర్డర్లు వాగ్దానం చేసిన సమయం కన్నా తక్కువ సమయంలోనే డెలివరీ చేయబడుతున్నాయి. దేశవ్యాప్తంగా 200 నగరాలు, పట్టణాల్లో జియోమార్ట్ సేవలు ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉన్నాయి.



Next Story

Most Viewed