గాంధీలో శవాలపై ఆభరణాలు మాయం.. ఇంతకూ దొంగలు ఎవరు..?

by  |
Dead bodie
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ నియంత్రణలో వైద్యులు, నర్సులు, వార్డు బాయ్స్ ల సేవలు అనిర్వచనీయం. ప్రధానంగా గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ సోకిన వారికి అందించే సేవలపై సర్వత్రా అభినందనల వెల్లువ ఎత్తుతోంది. కానీ కొందరి నిర్వాకం చెడ్డ పేరునూ తీసుకొస్తున్నది.

ఓ వైపు ప్రాణాలను అడ్డు పెట్టి వైద్య సేవలందిస్తుంటే మరికొందరు మాత్రం దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబ పెద్దలు, సభ్యులు, బంధు మిత్రులు చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న వారికి వీరి చేష్టలు చేదును మిగిలిస్తోంది. శవాల అప్పగింత, రవాణా దగ్గర చోటు చేసుకుంటోన్న పరిణామాలు మరింతగా ఏడిపిస్తోంది. ఒంటిపై ఉన్న బంగారం, ఇతర ఆభరణాలను మాయం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్చురీలో పెట్టేటప్పుడు కుటుంబ సభ్యులకు పంపిన ఫోటోల్లో బంగారు ఆభరణాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అంబులెన్స్ లో ఎక్కించి శ్మశానవాటిక దగ్గరికి వచ్చేసరికి మాయమవుతున్నాయి. ఇప్పటికే కొందరు సోషల్ మీడియాలోనూ ఈ విషయాన్ని బహిర్గతం చేశారు.

నిస్వార్ధంగా కరోనా రోగులకు సేవలు అందిస్తోన్న వైద్య సిబ్బంది పని చేసే ప్రాంతంలోనే కొందరి స్వార్ధపూరిత పనులు అసహ్యానికి గురి చేస్తున్నాయి. నిజానికి తమ తల్లి, సోదరి ఒంటిపై బంగారం పోయిందని ఫిర్యాదు చేయడానికి కూడా మాటలు రావడం లేదు. ఎలాగూ ప్రాణాలే పోయాయి. ఇక ఆ కాస్త బంగారం కోసం వైద్య సిబ్బంది, ఇతరులపై ఆరోపణలు చేసి అబాసుపాలు కావడం ఇష్టం లేదని కొందరు బాధితులు చెబుతున్నారు.

చనిపోయిన తర్వాత కనీసం 16 గంటలు గడిస్తే తప్ప శవాన్ని అప్పగించడం లేదు. అంత సమయం గాంధీ ఆసుపత్రి దగ్గర బంధుమిత్రులు పడిగాపులు కాస్తున్నారు. అంబులెన్సులో శవాన్ని శ్మశానవాటిక వరకు తీసుకెళ్లేంత వరకు ఉచితమేనని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఒక్కో అంబులెన్సులో నాలుగైదు శవాలను ఒకేసారి వేసుకొని రవాణా చేస్తున్నారు. ఆలస్యానికి తోడు ఒక్కో శవాన్ని రవాణా చేసినందుకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు పుచ్చుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఎవరికి చెప్పుకోవాలి..?

ఓ ప్రైవేటు ఉద్యోగి తన అత్తమ్మ(భార్య తల్లి)కి కరోనా పాజిటివ్ తో పాటు మల్టిపుల్ సమస్యలకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. వార్డులో చేర్చిన నాటి నుంచి డాక్టర్లు, నర్సులు, వార్డు బాయ్స్, ఇతర సిబ్బంది సేవలను చూసి ఆశ్చర్యపోయాడు. వారికి చేతులెత్తి మొక్కాలని అభిప్రాయపడ్డారు. కానీ మంగళవారం ఆమె చనిపోయారు. శవాన్ని మార్చురీలో పెట్టేటప్పుడు ఫోటో పంపారు. అప్పుడు బంగారు ఆభరణాలు కనిపించాయి. కానీ అంబులెన్సులో శ్మశానవాటికకు తీసుకొచ్చిన తర్వాత చూస్తే అవి కనిపించలేదు. ఎక్కడ మాయం చేశారో అంతుచిక్కడం లేదు. ఫిర్యాదు చేయాలా? వద్దా? చేస్తే ఎవరేం అనుకుంటారోనన్న భయం పట్టుకుంది. మనిషి పోయిన తర్వాత ఆమెపై ఉన్న బంగారు ఆభరణాల కోసం ఫిర్యాదు చేస్తున్నారన్న ప్రచారం జరిగితే తట్టుకోవడం కష్టమని అతను వాపోయాడు.

ఇదే అనుభవం మరో జర్నలిస్టుకు కూడా ఎదురైంది. గాంధీ ఆస్పత్రి లో కొందరు శవాల మీద గోల్డ్ మాయం చేస్తున్న మాట నిజమేనని, సిబ్బంది ప్రతి దానికీ డబ్బులు వసూలు చేస్తున్నారన్నారని, డాక్టర్, స్టాఫ్ నర్స్ మినహా అందరికీ డబ్బులు ముట్ట చెప్పాల్సిందేనన్నారు. ఫోన్ లో ఆసుపత్రిలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మార్చురీ దగ్గర తీసిన ఫోటోలకు, శ్మశాన వాటిక దగ్గరికి వచ్చే సరికి తీరు మారిపోతుందని ఆరోపించారు. ఇదే విషయాన్ని సీఎం కార్యాలయానికి కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. కనిపించే దేవుళ్లుగా కీర్తించబడుతోన్న వైద్యులు, సిబ్బంది పని చేసే చోట చేతి వాటాన్ని ప్రదర్శిస్తోన్న వారూ ఉండడం చర్చనీయాంశంగా మారుతోంది.


Next Story

Most Viewed