వారిని ఖాళీ చేయిస్తే చూస్తూ ఊరుకోం.. జగన్‌కు పవన్ వార్నింగ్

by  |
pawan-kalyan
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల పేరుతో.. సీఎం భద్రత దృష్ట్యా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం పరిసర ప్రాంతాల్లోని 320 కుటుంబాలను ఇళ్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారన్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో జరిగిన పీఏసీ సమావేశంలో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంగళగిరి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలు త‌మ క‌ష్టాల గురించి చెప్పుకున్నారు. అభివృద్ధి ప‌నులు, సీఎం భ‌ద్రత దృష్ట్యా త‌మ‌ ఇళ్లు ఖాళీ చేయాల‌ని ప్రభుత్వం, వైసీపీ నేత‌లు బెదిరిస్తూ, డిమాండ్ చేస్తున్నార‌ని బాధితులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చెప్పారు. ఆ భూముల‌ను త‌మ‌కు అప్పజెప్పాల‌ని త‌మ‌పై దారుణాల‌కు పాల్పడుతున్నార‌ని, బెదిరింపుల‌కు దిగుతున్నార‌ని తెలిపారు.

ఇళ్లు ఖాళీ చేయ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చరిస్తున్నారని.. పున‌రావాసం కూడా ఏర్పాటు చేయ‌కుండా ఇళ్లను ఎలా లాక్కుంటారని క్యాంపు కార్యాలయం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజల ఆవేదనపై పవన్ స్పందించారు. 320 ఇళ్లను ఖాళీ చేయాల‌ని అనడం చాలా దారుణమన్నారు. సీఎం భద్రత దృష్ట్యా ఖాళీ చేయాలని అనడం సరికాదన్నారు. మహిళలని కూడా చూడ‌కుండా ప‌చ్చి బూతులు తిడుతుంటే బ‌య‌ట మాన‌భంగాలు జ‌ర‌గ‌కుండా ఇంకేమి జ‌రుగుతుంటాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని 320 ఇళ్లు కూల్చాలి అనుకుంటే వారికి ముందుగా పున‌రావాసం ఏర్పాటు చేసి, ప‌క్కా ఇళ్లు క‌ట్టించాలి. అంతేగానీ, అవేమీ చేయ‌కుండా భ‌య‌పెట్టి వారిని ఖాళీ చేయిస్తే సహించేది లేదన్నారు. ఆ 320 కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. మరోవైపు వైద్య సిబ్బంది, నిరుద్యోగులు, ప‌లువురు మ‌హిళ‌లు కూడా త‌మ క‌ష్టాల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చెప్పుకున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed