మళ్లీ అదే డ్రెస్సు… ఇవాంకా కొత్త ట్రెండు

by  |
మళ్లీ అదే డ్రెస్సు… ఇవాంకా కొత్త ట్రెండు
X

దిశ, వెబ్‌డెస్క్:

చూడగానే దృష్టి పడేలా ఉన్న ఎరుపు రంగు పూల దుస్తులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. ప్రొయెంజా షౌలర్ బ్రాండ్ వారు తయారు చేసిన ఆ డ్రెస్ విలువ రూ. 1.7 లక్షలు. కానీ ఆ డ్రెస్ చూడగానే ఆమెను ఫాలో అయ్యేవారు ఒకటి కనిపెట్టారు. అదేంటంటే… ఇవాంకా ఈ డ్రెస్ వేసుకోవడం రెండో సారి.

సాధారణంగా ప్రజాదరణ ఉన్న రాజకీయ నాయకులు గానీ, సినీ, క్రికెట్ ప్రముఖులు గానీ ఒకసారి వేసిన డ్రెస్‌ని మరోసారి ధరించరు. అంతెందుకు… మన ప్రధాని మోదీ విషయానికి వస్తే.. ఆయన ధరించేది ఒకే శైలిలో ఉన్న దుస్తులు అయినప్పటికీ..వేసిన డ్రెస్ మళ్లీ వేయరని ప్రతీతి. అలాంటిది ఇవాంకా ట్రంప్ డ్రెస్ రిపీట్ చేయడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇండియా పర్యటన అంటే పెద్దగా మక్కువ లేదా ఏంటి అని చెవులు కొరుక్కుంటున్నారు.

ఇంతకీ ఈ డ్రెస్ ఇవాంకా గతంలో ఎప్పుడు ధరించారో తెలుసా? 2019 సెప్టెంబర్‌లో అర్జెంటీనా వెళ్లినపుడు ధరించారు. అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే.. అప్పుడు చెప్పులు మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు కాలేదు. కానీ ఇవాంకా డ్రెస్ రిపీట్ చేయడంలో ఒక నిగూఢ అర్థం లేకపోలేదు.

అవును..ఇప్పుడు ఒకసారి వేసుకున్న డ్రెస్ మళ్లీ రిపీట్ చేయడమే కొత్త ట్రెండ్.. మొన్నటికి మొన్న అవార్డుల సీజన్‌లో ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలుచుకున్న జోక్విన్ ఫీనిక్స్ కూడా అన్ని అవార్డు వేడుకలకు ఒకటే సూట్ వేసుకెళ్లిన సంగతి తెలిసిందే. సస్టైనబుల్ ఫ్యాషన్‌ పేరుతో హాలీవుడ్ సెలెబ్రిటీలు ఇలా డ్రెస్సులు రిపీట్ చేస్తున్నారు. అదే ట్రెండును ఇవాంకా కూడా ఫాలో అయ్యారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed