ఇకపై ప్రపంచ నలుమూలలా సిరిసిల్ల ‘నైపుణ్యం’..

by  |
ktr-sircilla
X

దిశ, సిరిసిల్ల : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో సిరిసిల్లకు మంచి రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. పెద్దూరులోని అపెరల్ పార్క్ ద్వారా మేడిన్‌ సిరిసిల్ల నైపుణ్యం ప్రపంచానికి తెలియనుందన్నారు. శుక్రవారం సిరిసిల్లలో పర్యటించిన మంత్రి అపెరల్ పార్క్‌లో నిర్మించనున్న గోకుల్‌ దాస్ ఇమేజెస్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్లలో కార్మికులను ఆ సాములుగా తీర్చిదిద్దే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

సిరిసిల్లలో ఉత్పత్తి అయ్యే వస్త్రాలు విదేశాలకు ఎగుమతి చేసే గొప్ప సంస్థ ఇక్కడ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సిరిసిల్లలో భర్త మగ్గం నేస్తే భార్య బీడీలు చుట్టి ఉపాధి పొందే పరిస్థితి ఉండేదని.. ఒకప్పుడు సిరిసిల్ల ‘ఉరి’సిల్లగా మారిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయన్నారు. సిరిసిల్ల అపెరల్ పార్క్‌లో ఫ్యాక్టరీలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటాయన్నారు. ఈ అపెరల్ పార్క్‌ ద్వారా దాదాపు 10వేల మందికి ఉపాధి లభిస్తుందని.. అందులోనూ 80% మహిళలకు ఉపాధి దొరికేందుకు ఆస్కారముందన్నారు.

ఇది ఆరంభమే..

సిరిసిల్లలో కొత్తగా ప్రారంభమైన అపెరల్ పార్క్‌ ఒక ఆరంభం మాత్రమేనని, దీనితో పాటు అనేక పరిశ్రమలు ఇక్కడికి వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మేడిన్‌ సిరిసిల్ల నైపుణ్యం ప్రపంచానికి తెలియనుందని వివరించారు. ఔత్సాహికులైన మహిళలు ముందుకు రావాలని కోరారు. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉందన్న మంత్రి.. దేశంలోనే అత్యంత నాణ్యమైందని వివరించారు.

త్వరలో చేనేత బీమా..

నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎన్నో కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. రైతు బీమా మాదిరే చేనేత బీమాను త్వరలో ప్రారంభించి.. ఏ కారణం చేతనైనా నేత కార్మికులు మృతి చెందితే రూ.5 లక్షల బీమాను కల్పించనున్నట్లు ప్రకటించారు.

మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతోనే..

కార్యక్రమంలో పాల్గొన్న గోకుల్‌దాస్‌ ఇమేజెస్ ఎండీ సుమీర్ హిందూజా మాట్లాడుతూ.. తాము గత 4 నాలుగు దశాబ్దాలుగా బెంగుళూరులో తప్ప ఎక్కడ పరిశ్రమ పెట్టలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. తాము ఉత్పత్తి చేసే వస్త్రాలు చైనాతో పోటీ పడతాయని పేర్కొన్నారు. కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారికి తాము శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పిస్తామని వివరించారు.


Next Story

Most Viewed