వర్క్‌ ఫ్రం హోం ఇక చాలు.. తొందర పడొద్దంటున్న కంపెనీలు!

174

బడి, గుడి, సినిమా థియేటర్లు, హోటళ్లు, మాల్స్.. ఒక్కటేమిటి అన్నీ తెరుచుకున్నాయి. కరోనా థర్డ్ వేవ్​ రాదని వైద్య ఆరోగ్యశాఖ భరోసా ఇచ్చింది. కానీ ఐటీ కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రం హోమే చేయండి అంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి భరోసా కల్పించినా వర్క్ ఫ్రం హోంకే కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. హైదరాబాద్​లో 1,283 కంపెనీలున్నాయి. అందులో 300 వరకు ఎంఎన్​సీలు. ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఆధారంగా పనిచేస్తుండటం ఒక కారణమైతే.. వర్క్ ఫ్రం హోం ద్వారా కంపెనీలకు భారీగా ఖర్చులు తగ్గడం మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

దిశ, ప్రత్యేక ప్రతినిధి : కరోనా లేదు.. ఇక థర్డ్​వేవ్​ రాదు.. ఐటీ కంపెనీలను తెరవండని తెలంగాణ సర్కార్ ​ఎంత చెప్పినా ఫలితం కనిపించడం లేదు. ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్​ పూర్తయింది.. అందరిలో కరోనా ప్రతి రక్షకాలు ఏర్పడ్డాయి.. ఇక ఢోకాలేదని అధికారులు నెత్తినోరు బాదుకున్నా ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని చెప్పేందు​కు వెనుకాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సమావేశాలు ఏర్పాటు చేసి ఐటీ కంపెనీల యాజమాన్యాలకు ధైర్యం నూరిపోస్తున్నా సానుకూల స్పందన కరువైంది. చాలా కంపెనీలు డిసెంబర్​ నెలాఖరు వరకు వేచిచూస్తామని తేల్చిచెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్నా మరో వైపు అధిక శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు ఇప్పటికే డిసెంబర్​ నెలాఖరు వరకు ఇంటి నుంచే సేవలందించాలని ఆదేశించాయి. ఇటీవల ఐటీశాఖ సంబంధిత కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కార్యాలయాల్లో పూర్తి స్థాయి సేవలు ప్రారంభించాలని చెప్పినప్పటికీ తమ సంస్థల ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. బడా కంపెనీలు సర్కార్​ సూచనను ఖాతరు చేయడం లేదు. వర్క్​ఫ్రమ్ హోమ్​ ద్వారా భారీగా తగ్గిన ఖర్చులతో తమకు లాభాలున్నందున ఆ కంపెనీలు కొవిడ్​ నెపంతో ముందుకు రావడం లేదు. ఇన్ఫోసిస్​, మైక్రోసాఫ్ట్​, యాపిల్​, అమెజాన్, డెల్​ వంటి కంపెనీలెన్నో ఇప్పుడిప్పుడే తాము రిస్క్​ తీసుకోబోమని స్పష్టం చేస్తున్నాయి.

డబ్ల్యుహెచ్​వో ఆదేశాలే ప్రామాణికంగా..

హైదరాబాద్‌లోని చాలా కంపెనీలు మల్టీ నేషనల్ ​సర్వీస్ కంపెనీలే. కొన్ని మాత్రం ఐటీ ప్రొడక్టివిటీ సంస్థలు. ఇక్కడ విశాలమైన కార్యాలయాలున్నా అధిక శాతం సంస్థల కేంద్ర కార్యాలయాలు మాత్రం విదేశాలలో ఉన్నాయి. అక్కడి కంపెనీలు మన దేశం, రాష్ట్రం ఇచ్చే సమాచారం కన్నా వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్​(డబ్ల్యుహెచ్​వో) రిపోర్ట్​ను ప్రధాన ఆధారంగా తీసుకుంటాయి. లేదా ఇంటర్నల్​ అసెస్​మెంట్​ చేసుకుంటాయి. ఇంతవరకు ఇండియాలో థర్డ్​వేవ్ వచ్చే అవకాశం లేదని కానీ, తీవ్రత తక్కువ అని కానీ డబ్ల్యుహెచ్​వో చెప్పలేదు. కరోనా నీలినీడలు అసలు తొలగిపోలేదని, వివిధ రూపాలలో ముంచుకు వస్తుందని ఎప్పటికప్పుడు హెచ్చరికలను జారీ చేస్తున్నది. నిజానికి ప్రపంచాన్ని వణికిస్తున్న డెల్టా వేరియంట్​ పుట్టిన భారత్​లో ముప్పు ఇంకా తొలగిపోలేదని స్పష్టం చేస్తున్నది. కేరళను డెల్టా వేరియంట్​సెకండ్​వేవ్​ ఇంకా వణికిస్తున్నది. ఇక తెలంగాణలో మాత్రం కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. వందలో పాజిటివిటీ శాతం కేవలం 0.4% ఉంది. కానీ ఒక్కొక్కటిగా విద్యాసంస్థలు, సినిమా థియేటర్​లతో పాటు హోటల్స్​, రెస్టారెంట్లు, మాల్స్ అన్నీ తెరుచుకుంటున్న క్రమంలో కరోనా మళ్లీ విజృంభిస్తుందా? అన్న సందేహాలను ఐటీ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి.

ఐటీ కంపెనీలపై సర్కార్ ఒత్తిడి..

వాస్తవానికి హైదరాబాద్​ ఐటీ హబ్​గా విలసిల్లుతున్నది. ఐటీ కంపెనీలలో దేశంలో బెంగుళూరు తర్వాత స్థానం భాగ్యనగరానిదే. ఇక్కడే దాదాపు 1,283 కంపెనీలున్నాయి. అందులో 300 పేరొందినవి. మైక్రోసాఫ్ట్​, డెల్, టీసీఎస్, అమెజాన్​, కాగ్నిజెంట్, కామ్​వాల్ట్​, సీజీఐ, బైటెరిడ్జ్​, ఒరాకిల్​, వాల్యూ ల్యాబ్​, కెల్టన్​టెక్​, కోనీ, సీఏ టెక్నాలజీస్, డిలైట్, అసెన్చర్, నోవర్టిస్, యాపిల్, గూగుల్ వంటి సంస్థలు ప్రముఖమైనవి. హైదరాబాద్​ నగరంలో 51వరకు మల్టీనేషనల్​ కంపెనీలున్నాయి. ఒక్క హైటెక్​సిటీ మైండ్​స్పేస్​లో 21 టాప్ ​మల్టీ నేషనల్​ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అజైల్​ సీఆర్ఎం, ట్యాలెంట్ స్పిరిట్స్​, డాక్టర్​‌‌‌‌‌–సీ వంటి స్టార్టప్ కంపెనీలు, పలు సర్వీస్ ​బేస్డ్,​ ప్రొడక్ట్​ బేస్ట్​ కంపెనీలున్నాయి. రహేజా మైండ్ ​స్పేస్​, సైబర్ ​ఐటీ పియర్ల్, డీఎల్​ఎఫ్​ ఐటీ సెజ్​, సైబర్​ టవర్స్​, లాక్మీ సైబర్​ సిటీ, ఎవాన్స్​ బిజినెస్​ హబ్​, కోహినూర్​ ఐటీ పార్క్, దివ్య శ్రీ ఎన్ఎస్ఎల్ ఓరియన్​పార్క్​, వేవ్​రాక్ ​సెజ్​, ఎల్అండ్‌టీ ఇన్​ఫో సిటీ, ఎన్​ఎస్ఎల్​, ఆర్ఎంజడ్​ ఫ్యూచరల్​ ఐటీ పార్క్​, హార్డ్​వేర్​ పార్క్​లలో పలు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

ఈ కంపెనీలలో సుమారు 6.30 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సర్వీస్​ పన్ను రూపంలో భారీ ఆదాయం సమకూరుతున్నది. రాష్ర్టం మొత్తంలో అన్ని రంగాల నుంచి సమకూరే సంపద( జీఎస్​డీపీ) దాదాపు 10 లక్షల కోట్ల వరకు ఉండగా అందులో ఒక్క ఐటీ రంగం నుంచి వచ్చేది 1.25 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఐటీ కంపెనీలు తెరుచుకుంటే అనుబంధంగా పదిలక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఆర్థిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి. కానీ బడా కంపెనీలు మాత్రం ఇంకా వర్క్​ఫ్రమ్ ​హోమ్ ​విధానానికే మొగ్గు చూపుతున్నాయని హైదరాబాద్​ సాఫ్ట్​వేర్​ ఎంటర్​ప్రైజెస్ ​ అసోసియేషన్​ సర్వేలో వెల్లడైంది. ఫ్యూచర్​ వర్క్​ మోడల్స్​ పేరిట నిర్వహించిన సర్వేలో ‘మీడియం, లార్జ్​, వెరీలార్జ్​ (మధ్య, పెద్ధ, అతిపెద్ద) కంపెనీలు గ్లోబల్​ట్రెండ్​ల ప్రకారం 20 నుంచి 30% ఉద్యోగులతో మాత్రమే కార్యాలయం నుంచి పనికి అనుమతినిస్తున్నాయని తేల్చింది.

వర్క్​ఫ్రమ్​ ఆఫీస్​ అందరికీ మంచిది..

ఐటీ కంపెనీలు వర్క్​ఫ్రమ్​ ఆఫీస్​ విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తే అందరికి మంచిది. ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​‌లో ఒత్తిడి తగ్గి క్రియేటివిటీ పెరుగుతుంది. ఇండ్లలో రొటీన్​ సమస్యలు దూరమవుతాయి. కంపెనీలు పూర్తి స్థాయిలో తెరుచుకోవడం వల్ల ఐటీ ఉద్యోగులకు అనుబంధంగా పనిచేసే లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు పుంజుకుని చిన్న, చితక వ్యాపారులకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టినందున వర్క్​ఫ్రమ్​ ఆఫీస్ ​శ్రేయస్కరం.

                                                                                           -సందీప్​ మక్తాలా, టీటా

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..