కీసర ఎమ్మార్వో కేసులో రేవంత్‌‌రెడ్డికి సంబంధముందా?

by Shyam |   (  Updated:2020-08-17 23:13:24  IST  )

<p>దిశ, న్యూస్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో అణగదొక్కే వ్యవహారం మళ్లీ ముందుకొచ్చింది. టీడీపీ నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకున్న రేవంత్ రెడ్డిని ఒంటరి చేసేందుకు సీనియర్లంతా తాత్కాలికంగా ఒక్కటవుతున్నారు. టీపీసీసీ చీఫ్‌ మార్పు త్వరలోనే ఉంటుందనే ప్రచారాల నేపథ్యంలో ముందు వరుసలో ఉన్నరేవంత్‌రెడ్డికి పదవి దక్కకుండా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే వీహెచ్, భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ వంటి సీనియర్​ నేతలంతా రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగానే పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీకి పట్టుబడిన కీసర తహసీల్దార్ నాగరాజు [&hellip;]</p>

కీసర ఎమ్మార్వో కేసులో రేవంత్‌‌రెడ్డికి సంబంధముందా?
X

దిశ, న్యూస్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో అణగదొక్కే వ్యవహారం మళ్లీ ముందుకొచ్చింది. టీడీపీ నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకున్న రేవంత్ రెడ్డిని ఒంటరి చేసేందుకు సీనియర్లంతా తాత్కాలికంగా ఒక్కటవుతున్నారు. టీపీసీసీ చీఫ్‌ మార్పు త్వరలోనే ఉంటుందనే ప్రచారాల నేపథ్యంలో ముందు వరుసలో ఉన్నరేవంత్‌రెడ్డికి పదవి దక్కకుండా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే వీహెచ్, భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ వంటి సీనియర్​ నేతలంతా రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగానే పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీకి పట్టుబడిన కీసర తహసీల్దార్ నాగరాజు వ్యవహారం వారికి మరిన్ని అవకాశాలు కల్పిస్తోందంటూ పార్టీ నేతల్లో ప్రచారం మొదలైంది.

కీసర తహసీల్దార్ అంశంలో రేవంత్‌ను ఇరికించేందుకు సొంత పార్టీ నేతలే పన్నాగాలు మొదలుపెట్టారు. వీహెచ్ వంటి నేతలు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. తహసీల్దార్ నాగరాజు పట్టుబడిన నేపథ్యంలో మధ్యవర్తి అంజిరెడ్డి కారులో దొరికిన ఎంపీ లెటర్ హెడ్‌లను బహిరంగ పర్చాలంటూ అధికార పార్టీకి ఉప్పందిస్తున్నారు. దీనిలో ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉందని, సీఎం కేసీఆర్ పరోక్షంగా రేవంత్ వ్యతిరేకవర్గానికి అండగా ఉంటున్నాడనే ప్రచారం కూడా జోరందుకుంది. దీన్ని అదునుగా తీసుకుని రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ దరిదాపుల్లోకి రాకుండా చేసేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు.

ప్రభుత్వ టార్గెట్ తప్పిందా..?

కీసర భూముల వ్యవహారంలో ప్రభుత్వమే రేవంత్ రెడ్డిని ఇరికించే ప్రయత్నాలు చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ భూములపై కన్నేసిన వెంచర్స్ అధినేతకు, ఎంపీ రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయనేది స్పష్టమైంది. కీసర భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఏ మేరకు కల్పించుకున్నాడనేది సందేహంగా మారింది. ఒకవేళ దీనిపై అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినా.. ఆ తర్వాత పరిణామాల్లో ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టిందని, అయినప్పటికీ దీనిలో రేవంత్‌ను ఇరికించాలని పకడ్బందీ ప్లాన్ వేసినట్లు చెప్పుకుంటున్నారు. అందుకే ఏసీబీకి దీనిపై ఫిర్యాదులు వెళ్లకున్నా.. బాధితులతో కలిసి ప్లాన్ చేయకుండా ఏసీబీ నేరుగా రంగంలోకి దిగి మధ్యవర్తితో పాటు తహసీల్దార్‌ను పట్టుకున్నారు. దీనిలో ముందుగానే తనను ఇరికించాలనే ప్లాన్ వేస్తున్నట్లు ఎంపీ రేవంత్ రెడ్డి గుర్తించాడని, తనకు సంబంధంలేని విషయం కావడంతో పట్టించుకోలేదని స్పష్టమవుతోంది. దీంతో ప్రభుత్వ వ్యూహం బెడిసికొట్టింది. ఎంపీ రేవంత్‌ను ఇరికించాలనే లక్ష్యం నెరవేరకపోవడంతో ఇప్పుడు అంజిరెడ్డి కారులో లభించిన లెటర్ హెడ్‌ల ఆధారంగా బద్నాం చేయడం, పీసీసీ పీఠం రాకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ తరపున కూడా కాంగ్రెస్ సీనియర్లకు సహకారం అందిస్తున్నారని గుసగుసలు విన్పిస్తున్నాయి. దీనికి మరింత బలం చేకూర్చుతూ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై కంటే సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. రెండు పార్టీలు ఇప్పుడు ఆపరేషన్ రేవంత్ టార్గెట్‌గా వ్యూహాలు పన్నుతున్నాయి.

సీనియర్ల రహస్య మంతనాలు

కీసర తహసీల్దార్ వ్యవహారంలో ఎంపీ రేవంత్ రెడ్డి లెటర్ హెడ్‌లు దొరికాయనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అలర్ట్ అయ్యారు. దీన్నిమంచి అవకాశంగా మల్చుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఈ అంశంలో పార్టీ సీనియర్ నేత వీహెచ్‌ను ఉసిగొల్పుతున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ లేఖలు బయటపెట్టాలని వీహెచ్ బహిరంగ విమర్శలు చేయడమే కాకుండా రేపు ( ఈ నెల 19న) కీసరకు వెళ్తానని ప్రకటించారు. అక్కడ బాధితులు, భూముల వ్యవహారాలు, ఈ కేసులో లింకులున్న వారిని కలుసుకునేందుకు జాబితా సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ఇటీవల జగ్గారెడ్డి కూడా రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవుతూ మాట్లాడారు. టీపీసీసీ పీఠం తనకే వస్తుందని ప్రకటించారు. దీనిపై అధిష్ఠానానికి లేఖ రాశారు. తాజాగా కీసర వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని మొత్తం పక్కకుపెట్టి కేవలం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బరిలోకి దిగినట్లు స్పష్టమవుతోంది. దీనిపై టీపీసీసీ చీఫ్ ఆశించే నేతలతో పాటు రేవంత్ రెడ్డి వ్యతిరేకవర్గం మొత్తం ఒక్కటవుతోంది. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, జానారెడ్డి, వీహెచ్ నేతలంతా దీనిపై రహస్య మంతనాలు చేశారని పార్టీ నేతలు వెల్లడించారు. రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు రాకుండా చేసేందుకు సీనియర్ నేతలంతా తాత్కాలికంగా గ్రూపులు కాదని ఒక్కటిగా నిలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ ప్రకటన తర్వాత ఎవరి గ్రూపు రాజకీయాలు వారే చేసుకున్నా ఇప్పుడు మాత్రం రేవంత్‌ను అడ్డుకునేందుకు కలిసి ఉండాలనుకుంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఏడాదిన్నర కాలంగా టీపీసీసీ చీఫ్ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. నేతలు కూడా ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సోనియాను కలిసి తనకే పగ్గాలివ్వాలని కోరారు. రేవంత్‌రెడ్డి పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీహెచ్, భట్టి, జగ్గారెడ్డి, జానారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ వంటి నేతలు ఎవరికి వారే టీపీసీసీ పీఠం కోసం ఎత్తుగడలు వేసుకున్నారు. అయితే ఇదే సమయంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ప్రధానంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పార్టీలో పెద్దపీట వేయరాదని, రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించరాదంటూ అధిష్ఠానానికి లేఖలు రాశారు. పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా ముందే పలుమార్లు బాహాబాహీకి దిగారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ పీఠం ఇవాళ.. రేపు అంటూ సాగుతూనే ఉంది.

అయితే ఇటీవల కాలంలో ఎంపీ రేవంత్ రెడ్డి దూకుడు పెంచాడని పార్టీ నేతలు భావిస్తున్నారు. టీపీసీసీ చీఫ్‌ను ప్రకటిస్తారనే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల సీఎం కేసీఆర్ కుటుంబాన్నిటార్గెట్‌గా చేసుకోవడం, సచివాలయం అంశంలో గుప్త నిధుల వ్యవహారం, జలదీక్ష వంటి కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి తన వర్గాన్నిసమీకరించుకుని ఆందోళనలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో కీసర తహసీల్దార్ వ్యవహారం పార్టీ నేతలకు అవకాశంగా చిక్కింది. అంజిరెడ్డి కారులో దొరికిన లేఖలు ఎంపీ రేవంత్ రెడ్డివేనని కాంగ్రెస్ పార్టీ నేతలు బయటకు తీసి విస్తృత ప్రచారం కల్పించారు. దీంతో రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టాలని సీనియర్లంతా పనికట్టుకుని ప్రచారానికి దిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీంతో రేవంత్ రెడ్డికి సంబంధం లేదని, భూ విషయంలో తలదూర్చలేదని రేవంత్ వర్గం కొట్టిపారేస్తోంది.

తాజా పరిణామాలతో పార్టీ సీనియర్లంతా రహస్య మంతనాలు మొదలుపెట్టినట్లు సోమవారం ఉదయం నుంచి గుప్పుమంటోంది. దీనిపై వీహెచ్, భట్టి, కోమటిరెడ్డి బ్రదర్స్ సహా సీనియర్లంతా మాట్లాడుకుంటున్నారని, టీపీసీసీ చీఫ్ మారుస్తారనే ఊహాగానాల నేపథ్యంలో రేవంత్‌ను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా బద్నాం చేసే కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం రేవంత్ రెడ్డి వంటి నేతలేకావాలని, కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక నేత ముందుకు పోతుంటే వెనక్కి లాగే నేతలే ఎక్కువగా ఉంటారని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని సోషల్ మీడియాతో ప్రచారానికి దిగుతున్నారు. ఇప్పుడు కీసర తహసీల్దార్ నాగరాజు కంటే కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి అంశమే ప్రధానంగా హాట్ టాపిక్‌గా మారింది.

Next Story