IPL 2025 : ఆఖర్లో శార్దూల్, అవేశ్ మాయ.. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముంబైపై లక్నో విజయం

by Harish |

గత మ్యాచ్‌లో ఓడిన లక్నో సూపర్ జెయింట్స్ గాడిన పడింది.

IPL 2025 : ఆఖర్లో శార్దూల్, అవేశ్ మాయ.. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముంబైపై లక్నో విజయం
X

దిశ, స్పోర్ట్స్ : గత మ్యాచ్‌లో ఓడిన లక్నో సూపర్ జెయింట్స్ గాడిన పడింది. ముంబై ఇండియన్స్‌పై అద్భుతమైన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం లక్నోనే వరించింది. ముంబై తీవ్రంగా పోరాడినప్పటికీ నిరాశ తప్పలేదు. లక్నో వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 రన్స్ చేసింది. ఓపెనర్లు మార్ష్(60), మార్‌క్రమ్(53) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆయుశ్ బదోని(30), మిల్లర్(27) విలువైన రన్స్ జోడించడంతో లక్నోకు భారీ స్కోరు దక్కింది. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా(5/36) సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో ముంబై పోరాటం వృథా అయ్యింది. సూర్యకుమార్(67) రాణించగా.. నమన్ ధిర్(46), పాండ్యా(28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. చివరి వరకూ పోరాడిన ఆ జట్టు 191/5 స్కోరుకే పరిమితమైంది.

ఆఖరి రెండు ఓవర్లు

ఓపెనర్లు విల్ జాక్స్(5), రికెల్టన్(10) నిరాశపర్చడంతో ముంబైకి ఛేదనలో పేలవ ఆరంభమే దక్కింది. ఆ తర్వాత సూర్యకుమార్, నమన్ ధిర్ జట్టును గాడిలో పెట్టారు. ఇద్దరూ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. సూర్యతో పోలిస్తే నమన్ ధిర్ ఇంకాస్త దూకుడుగా ఆడాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 69 రన్స్ జోడించింది. ప్రమాదకరంగా మారిన ఈ జంటను దిగ్వేశ్ విడదీశాడు. నమన్ ధిర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దిగ్వేశ్ తన స్పిన్ మాయతో పరుగుల కట్టడి చేస్తూ ముంబై బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ క్రీజులో సౌకర్యంగా కనిపించాడు. అయితే, మరో ఎండ్‌లో సూర్య మాత్రం రెచ్చిపోయాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతోపాటు ముంబైని విజయం దిశగా నడిపించాడు. ముంబైకి 24 బంతుల్లో 52 రన్స్ కావాల్సి రావడంతో మ్యాచ్ లక్నోకు దూరమయ్యేలా కనిపించింది. కానీ, సూర్య‌ను అవేశ్ ఖాన్ అవుట్ చేసి లక్నోకు ఊరటనిచ్చాడు. అయితే, హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడి ముంబైని తిరిగి పోటీలోకి తెచ్చాడు. 12 బంతుల్లో 29 రన్స్ చేయాల్సి రావడంతో ముంబైనే గెలిచేలా కనిపించింది. అయితే, చివరి రెండు ఓవర్లలో శార్దూల్ ఠాకూర్, అవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోకు విజయాన్ని కట్టబెట్టారు.

మార్ష్ మెరుపు ఆరంభం.. పాండ్యా‌కు 5 వికెట్లు

లక్నో ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ రెచ్చిపోయాడు. ఓపెనర్‌గా వచ్చిన అతను పవర్ ప్లేలో ముంబై బౌలర్లపై విరుచుకపడ్డాడు. 31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 రన్స్ చేశాడు. మార్ష్ విధ్వంసంతో తొలి ఓవర్లలో 69 రన్స్ రావడంతో లక్నోకు అదిరిపోయే ఆరంభం దక్కింది. అయితే, 7వ ఓవర్‌లో మార్ష్‌ దూకుడుకు ముంబై యువ బౌలర్ విఘ్నేశ్ చెక్ పెట్టాడు. ఇక మరో ఓపెనర్ మార్‌క్రమ్ కూడా రాణించాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. మార్ష్ క్రీజులో ఉన్నంత సేపు నిదానంగా ఆడిన అతను ఆ తర్వాత సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. మార్‌క్రమ్ తర్వాత ఆయుశ్ బదోని(30), డేవిడ్ మిల్లర్(27) కాసేపే క్రీజులో ఉన్న ధాటిగా ఆడి విలువైన రన్స్ జోడించారు. దీంతో లక్నో 200 పరుగుల మార్క్‌ను దాటింది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్(2) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. పూరన్(12) కూడా ఆరు బంతులే ఎదుర్కొని వికెట్ పారేసుకున్నాడు. వీరిద్దరూ పాండ్యా బౌలింగ్‌లో అవుటయ్యారు. ఈ మ్యాచ్‌లో పాండ్యా 5 వికెట్లతో చెలరేగాడు. పంత్, పూరన్‌లతోపాటు మిల్లర్, మార్‌క్రమ్, ఆకాశ్ దీప్ వికెట్లు తీశాడు.

Next Story