బీసీసీఐపై కేకేఆర్ గుస్సా..ఎక్స్‌ట్రా టైం ఇవ్వడంపై ఐపీఎల్‌కు లేఖ!

by Phanindra |   (  Updated:2025-05-21 19:30:29  IST  )

ఐపీఎల్ మధ్యలో కొత్త రూల్స్ తీసుకురావడంపై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మండిపడ్డారు. ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్‌కు కూడా ఈ రూల్ ఇవ్వాల్సిందని లేఖ రాశారు.

బీసీసీఐపై కేకేఆర్ గుస్సా..ఎక్స్‌ట్రా టైం ఇవ్వడంపై ఐపీఎల్‌కు లేఖ!
X

దిశ, స్పోర్ట్స్: బీసీసీఐపై కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) యాజమాన్యం అసహనం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా మే 20 నుంచి జరిగే మ్యాచుల ప్రారంభానికి 60 నిమిషాల అదనపు సమయం కేటాయిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయమే కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్‌కు కోపం తెప్పించింది. భారత్, పాక్ ఉద్రిక్తతల తర్వాత మే 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కేకేఆర్ మధ్య మ్యాచ్‌తోనే ఐపీఎల్ పునఃప్రారంభం అవ్వాల్సింది. కానీ ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.

అప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా ఉన్న కేకేఆర్.. ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచి, మిగతా జట్ల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే ప్లేఆఫ్స్ చేరేది. కానీ ఆర్సీబీతో మ్యాచ్ రద్దవడంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయింది. బెంగళూరులో మే 17న భారీ వర్షం పడుతుందని అందరికీ తెలుసునని, ఇప్పుడు అందిస్తున్న ఎక్స్‌ట్రా గంట సమయం అప్పుడు ఇచ్చి ఉంటే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరిగేదని వెంకీ మైసూర్ వాదిస్తున్నారు. ఇంత పెద్ద లీగ్‌లో కీలకమైన నిర్ణయాలను ఇష్టమొచ్చినట్లు సడెన్‌గా తీసుకోవడం కరెక్ట్ కాదని, ఇది మిగతా జట్లకు అన్యాయం చేసినట్లేనని ఆయన చెప్తున్నారు. ఇదే విషయాలను వివరిస్తూ ఐపీఎల్ సీవోవో హేమంగ్ ఆమిన్‌కు వెంకీ మైసూర్ లేఖ రాశారు.

బీసీసీఐ కొత్త నిబంధనలు..

ఐపీఎల్ మ్యాచులు సాధారణంగా 7.30 కల్లా మొదలవుతాయి. ఒకవేళ వర్షం, మరేదైనా కారణం వల్ల ఆలస్యమైనా రాత్రి 8.30 కల్లా మ్యాచ్ మొదలవ్వాలి. లేదంటే అప్పటి నుంచి ఓవర్లు తగ్గించాల్సి ఉంటుంది. కనీసం చెరో ఐదు ఓవర్ల మ్యాచ్ జరగాలన్నా 10.56 కల్లా ఆట మొదలవ్వాలి. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఈ సమయం మరో గంట పెరిగింది. అంటే రాత్రి 9.30 వరకు మ్యాచ్ ప్రారంభం అవకున్నా ఓవర్లు తగ్గించరు. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ జరిగేందుకు కటాఫ్ టైం రాత్రి 11.56 వరకు పెంచారు.

Next Story