- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నస్వామి ఈవెంట్ గురించి అసలు తెలీదు.. ఐపీఎల్ చైర్మన్ షాకింగ్ కామెంట్స్..!
చిన్నస్వామి ఈవెంట్ గురించి బీసీసీఐకి ఎలాంటి సమాచారం లేదని, దీన్ని ఎవరు నిర్వహించారని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అన్నారు.

దిశ, స్పోర్ట్స్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తొలి ఐపీఎల్ విజయం సెలబ్రేషన్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్నస్వామి స్టేడియం బయట భారీగా ఫ్యాన్స్ చేరడంతో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. దీంతో నిర్వాహకులు, ప్రభుత్వం, ఫ్రాంచైజీపై విమర్శలు వెల్లువెత్తాయి. వీటిపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ‘తొక్కిసలాట జరుగుతుందనే భయంతోనే రోడ్ షోను ప్రభుత్వం ఆపేసింది. అయితే స్టేడియం బయట ఇంత ఘోరం జరుగుతుందని వాళ్లు ఊహించలేదు. ఈ విషయంలో అధికార పార్టీని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. అసలు ఈ విషయాన్ని రాజకీయం చేయకూడదు. క్రౌడ్ చాలా భారీగా రావడంతోనే ఇలా జరిగింది. నేను ఫ్రాంచైజీతో కూడా మాట్లాడాను. వాళ్లు కూడా ఇంత భారీగా ఫ్యాన్స్ వస్తారని, ఇలా సడెన్‌గా తొక్కిసలాట జరుగుతుందని ఊహించలేదు. మృతుల కుటుంబాలకు సాధ్యమైనంత సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన అన్నారు.
జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సింది: సైకియా
అదే సమయంలో బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ ఘనంగా ముగిసిన తర్వాత ఇంత దారుణం జరగడం చాలా బాధాకరం. గతంలో చాలాసార్లు ఇలాంటి సెలబ్రేషన్స్ జరిగాయి. గతేడాది కోల్‌కతాలో కేకేఆర్ ర్యాలీ, టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ముంబైలో నిర్వహించిన భారీ ర్యాలీ సజావుగానే సాగాయి. పోలీసులు, స్థానిక అధికారులు కలిసి పనిచేసి ఈ కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూశారు. ఐపీఎల్ పైనల్‌లో కూడా లక్షా 20 వేల మంది వచ్చారు. కానీ బీసీసీఐ టీం ఈ పరిస్థితిని కూడా చక్కగా హ్యాండిల్ చేసింది. నిర్వాహకులు కార్యక్రమాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సింది. మరణించిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఈ స్థాయిలో విక్టరీ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసినప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడో లోపం జరగడం వల్లనే ఈ దారుణం జరిగింది’ అని సైకియా చెప్పారు. అయితే స్టేడియం బయట తొక్కిసలాటలో ఫ్యాన్స్ చనిపోయినా.. సెలబ్రేషన్స్ కార్యక్రమం కొనసాగించినందుకు ఆర్సీబీపై కూడా కొందరు విమర్శలు చేస్తున్నారు.
మాకు అసలు తెలియదు: ఐపీఎల్ చైర్మన్
అసలు బెంగళూరు కార్యక్రమం ఎవరు నిర్వహించారని తెలుసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అన్నారు. బీసీసీఐ, ఐపీఎల్ యాజమాన్యానికి ఈ కార్యక్రమంతో జరుగుతున్న విషయం కూడా తెలియదని, తమ వరకు సెలబ్రేషన్స్ జూన్ 3వ తేదీనే ముగిశాయని ఆయన స్పష్టం చేశారు. విషయం తెలియగానే స్టేడియంలో ఉన్న అధికారులతో తాను మాట్లాడానని, అయితే బయట జరిగిన ఘోరం గురించి వారికి తెలియదని ధుమాల్ తెలిపారు. ‘లోపల ఉన్న అధికారులను విషయం తెలియలేదు. నేను చెప్పగానే కార్యక్రమం వెంటనే ముగించేస్తామని చెప్పారు. ఇది చాలా బాధాకరం. అసలు ఈ కార్యక్రమం ప్లాన్ చేశారనే విషయం కూడా మాకు తెలీదు. మృతులకు మా ప్రగాఢ సానుభూతి’ అని ఆయన చెప్పుకొచ్చారు.
రూ.5 లక్షల నష్టపరిహారం..
‘జట్టు తిరిగొస్తుందన్న ఆనందంలో ప్రజలు భారీగా రావడంతో జరిగిన ఘోరం గురించి మీడియా ద్వారా తెలుసుకొని చాలా బాధపడ్డాం. ప్రతి ఒక్కరి భద్రతా మాకు చాలా ముఖ్యం. ఫ్యాన్స్ మరణాలపై తీవ్రమైన దుఃఖాన్ని మిగిల్చాయి. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. విషయం తెలియగానే కార్యక్రమాన్ని వేగంగా పూర్తిచేసి, స్థానిక అధికారుల సూచనలు పాటించాం. ఫ్యాన్స్ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం’ అని ఆర్సీబీ పేర్కొంది. అలాగే మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా ప్రకటించాయి.






