ఆర్సీబీ ఫైనల్‌ చేరితే.. నేనూ వస్తా: మాటిచ్చిన డివిలియర్స్

by Phanindra |   (  Updated:2025-05-17 16:22:46  IST  )

ఈ ఏడాది ఆర్సీబీ సూపర్ ఫామ్‌లో ఉంది. ఈ టీం కనుక ఫైనల్ చేరితే తను కూడా ఇండియా వచ్చి మ్యాచ్ చూస్తానని డివిలియర్స్ చెప్పాడు.

ఆర్సీబీ ఫైనల్‌ చేరితే.. నేనూ వస్తా: మాటిచ్చిన డివిలియర్స్
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా రాణిస్తోంది. ఆడిన 12 మ్యాచుల్లో 8 విజయాలతో అదరగొట్టింది. 17 పాయింట్లతో టేబుల్ టాపర్స్‌గా ఉన్న ఈ టీం.. ఈసారి ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది కనుక ఆర్సీబీ ఫైనల్ చేరితే తను ఆ మ్యాచ్ చూసేందుకు ఇండియాకు వస్తానని మాటిచ్చాడు. ‘ఆర్సీబీ కనుక ఫైనల్ చేరితే.. నేను కూడా స్టేడియానికి వస్తా. కోహ్లీతో కలిసి ట్రోఫీ అందుకోవడం కన్నా ఆనందం ఏముంటుంది? ఆ క్షణం కోసమే నేను చాలా ఏళ్లు పోరాడా’ అని వెల్లడించాడు.

ఆర్సీబీ ఫ్యాన్స్‌కు డివిలియర్స్, కోహ్లీ అంటే ఎంత అభిమానమో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లిద్దరూ కలిసి ఐపీఎల్ ట్రోఫీ అందుకుంటే చూడాలని ఫ్యాన్స్ కూడా చాలాకాలం ఎదురు చూశారు. ఇక తన 13 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌లో డివిలియర్స్ కేవలం రెండు ఫ్రాంచైజీలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. కెరీర్ ఆరంభంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌)కు ఆడిన డివిలియర్స్.. ఆ తర్వాత ఆర్సీబీలో చేరాడు. కోహ్లీతో కలిసి ఎన్నో మరపురాని విజయాలను జట్టుకు అందించిన డివిలియర్స్.. 2021 ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్‌లో 184 మ్యాచులు ఆడిన డివిలియర్స్.. 170 ఇన్నింగ్సుల్లో 39.70 సగటు, 151.68 స్ట్రైక్ రేటుతో 5162 పరుగులు చేశాడు.

Next Story