బ్యాటు ఝుళిపించిన కోహ్లీ.. పంజాబ్‌ను చిత్తు చేసి బెంగళూరు బోణీ

by Dishanational3 |
బ్యాటు ఝుళిపించిన కోహ్లీ.. పంజాబ్‌ను చిత్తు చేసి బెంగళూరు బోణీ
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. ఓపెనింగ్ మ్యాచ్‌లో చెన్నయ్‌ చేతిలో భంగపాటుకు గురైన ఆర్సీబీ.. రెండో మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటు ఝుళిపించడంతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది. బెంగళూరు వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై 4 వికెట్ల తేడాతో బెంగళూరు గెలుపొందింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 178/6 స్కోరు చేసింది. ధావన్(45) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. సామ్ కర్రన్(23), ప్రభ్‌సిమ్రాన్(25), జితేశ్ శర్మ(27) తమ స్థాయి ప్రదర్శన చేయడంలో విఫలమయ్యారు. ఆఖర్లో శశాంక్ సింగ్(21 నాటౌట్) విలువైన పరుగులు జోడించడంతో పంజాబ్.. బెంగళూరు ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. అయితే, 177 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని బెంగళూరు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(77) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టు విజయం దిశగా నడిపించగా.. దినేశ్ కార్తీక్(28 నాటౌట్), మహిపాల్ లామ్రోర్(17 నాటౌట్) జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.

విరాట్ అండతో..

బెంగళూరుకు విజయం అంత సులభంగా దక్కలేదు. మరో నాలుగు బంతుల్లోనే గెలుపొందినా 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఆర్సీబీ శ్రమించాల్సి వచ్చింది. అయితే, కోహ్లీ క్రీజులో నిలబడటంతో గెలుపు సునాయాసమైంది. పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌లో బెంగళూరు ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. డుప్లెసిస్(3), గ్రీన్(3), మ్యాక్స్‌వెల్(3) వంటి స్టార్లు తేలిపోగా.. రజత్ పాటిదార్(18), అనుజ్ రావత్(11) క్రీజులో నిలువలేకపోయారు. మొదటి నుంచి బెంగళూరు ఇన్నింగ్స్‌ను కోహ్లీనే నడిపించాడు. తొలి ఓవర్‌లోనే నాలుగు ఫోర్లతో ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టిన అతను.. క్రీజులో ఉన్నంత సేపు అదే దూకుడు కొనసాగించాడు. మిగతా బ్యాటర్లు పంజాబ్ బౌలింగ్‌లో క్రీజులో ఇబ్బందిపడగా.. విరాట్ మాత్రం ఏ తడబాటు లేకుండా చాలా స్వేచ్ఛగా బ్యాటు ఝుళిపించాడు. ఈ క్రమంలోనే 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కనబర్చిన అతను జట్టును విజయం దిశగా నడిపించాడు. ఈ క్రమంలో హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కోహ్లీ(77) భారీ షాట్ ఆడబోయి బౌండరీ వద్ద హర్‌ప్రీత్‌కు చిక్కడంతో అతని అద్భుతమైన ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లీ అవుటయ్యే సమయానికి బెంగళూరు ఇంకా 24 బంతుల్లో 47 పరుగులు చేయాల్సి ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే, దినేశ్ కార్తీక్(28 నాటౌట్), మహిపాల్ లోమ్రోర్(17 నాటౌట్) ధాటిగా ఆడి మిగతా పని పూర్తి చేశారు. ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు కావాల్సి ఉండగా.. కార్తీక్ వరుసగా ఓ సిక్స్, ఫోర్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

కష్టపడి పోరాడే స్కోరు చేసిన పంజాబ్

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ బెయిర్‌స్టో(8)ను సిరాజ్ ఆరంభంలోనే పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత కూడా ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పంజాబ్‌ను కట్టడి చేశారు. ఈ పరిస్థితుల్లో ఓపెనర్, కెప్టెన్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను తీసుకున్నాడు. బౌండరీలు బాదుతూ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మరో ఎండ్‌లో ప్రభ్‌సిమ్రాన్(25)తో కూడా దూకుడుగా ఆడుతూ ధావన్‌కు తోడయ్యాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని మ్యాక్స్‌వెల్ విడదీశాడు. ప్రభ్‌సిమ్రాన్‌ అవుటవడంతో రెండో వికెట్‌కు 55 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. ప్రభ్‌సిమ్రాన్‌ వికెట్‌తో పుంజుకున్న ఆర్సీబీ బౌలర్లు పంజాబ్‌పై మరింత ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో వరుస ఓవర్లలో లివింగ్‌స్టోన్(17), ధావన్‌ మైదానం వీడారు. అనంతరం సామ్ కర్రన్(23), జితేశ్ శర్మ(27) ఎక్కువ సేపు క్రీజులో నిలువకపోయినా స్కోరు 150 దాటేందుకు సహాయపడ్డారు. ఇక, ఆఖరి ఓవర్‌లో రెచ్చిపోయిన శశాంక్ సింగ్(21 నాటౌట్) 20 పిండుకోవడంతో పంజాబ్‌కు పోరాడే స్కోరు దక్కింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్ రెండేసి వికెట్లు తీయగా.. యశ్ దయాల్, జోసెఫ్‌ చెరో వికెట్ పడగొట్టారు.

స్కోరుబోర్డు

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 176/6(20 ఓవర్లు)

ధావన్(సి)కోహ్లీ(బి)మ్యాక్స్‌వెల్ 45, బెయిర్‌స్టో(సి)కోహ్లీ(బి)సిరాజ్ 8, ప్రభ్‌సిమ్రాన్(సి)అనుజ్ రావత్(బి)మ్యాక్స్‌వెల్ 25, లివింగ్‌స్టోన్(సి)అనుజ్ రావత్(బి)జోసెఫ్ 17, సామ్ కర్రన్(సి)అనుజ్ రావత్(బి)యశ్ దయాల్ 23, జితేశ్ శర్మ(సి)అనుజ్ రావత్(బి)సిరాజ్ 27, శశాంక్ సింగ్ 21 నాటౌట్, హర్‌ప్రీత్ బ్రార్ 2 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 8.

వికెట్ల పతనం : 17-1, 72-2, 98-3, 98-4, 150-5, 154-6

బౌలింగ్ : సిరాజ్(4-0-26-2), యశ్ దయాల్(4-0-23-1), జోసెఫ్(4-0-43-1), గ్రీన్(2-0-19-0), మయాంక్ దగర్(3-0-34-0), మ్యాక్స్‌వెల్(3-0-29-2)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : 178/6(19.2 ఓవర్లు)

కోహ్లీ(సి)హర్‌ప్రీత్ బ్రార్(సి)హర్షల్ 77, డుప్లెసిస్(సి) సామ్ కర్రన్(బి)రబాడ 3, గ్రీన్(సి)జితేశ్(బి)రబాడ 3, రజత్ పటిదార్(బి)హర్‌ప్రీత్ బ్రార్ 18, మ్యాక్స్‌వెల్(బి)హర్‌ప్రీత్ బ్రార్ 3, అనుజ్ రావత్ ఎల్బీడబ్ల్యూ(బి)సామ్ కర్రన్ 11, కార్తీక్ 28 నాటౌట్, మహిపాల్ లోమ్రోర్ 17 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 18.

వికెట్ల పతనం : 26-1, 43-2, 86-3, 103-4, 130-5, 130-6

బౌలింగ్ : సామ్ కర్రన్(3-0-30-1), అర్ష్‌దీప్(3.2-0-40-0), రబాడ(4-0-23-2), హర్‌ప్రీత్ బ్రార్(4-0-13-2), హర్షల్(4-0-45-1), రాహుల్ చాహర్(1-0-16-0)



Next Story

Most Viewed