పంజాబ్ 'మహా' విధ్వంసం.. ఐపీఎల్ 2026 సీజన్ హైయెస్ట్ స్కోరు నమోదు!

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-19 17:19:44  IST  )

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.

పంజాబ్ మహా విధ్వంసం.. ఐపీఎల్ 2026 సీజన్ హైయెస్ట్ స్కోరు నమోదు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 250 పరుగులు జోడించారు. పంజాబ్ యువ ఆటగాళ్లు ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కనోలి అసాధారణ ఇన్నింగ్స్‌లతో స్టేడియంను హోరెత్తించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 37 బంతుల్లోనే 4 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 93 పరుగులు చేసి లక్నో బౌలింగ్‌ను ముక్కలు చేశాడు. సెంచరీకి కేవలం 7 పరుగుల దూరంలో సిద్ధార్థ్ బౌలింగ్‌లో అవుట్ అయినప్పటికీ, అప్పటికే పంజాబ్ భారీ స్కోరుకు బలమైన పునాది పడింది. ప్రియాన్ష్ అవుట్ అయినా, మరో ఎండ్‌లో కూపర్ కనోలి అదే వేగంతో ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. కనోలి 46 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 87 పరుగులు చేసి జట్టు స్కోరును 200 దాటించాడు. చివర్లో మాజీ లక్నో ఆటగాడు, ప్రస్తుతం పంజాబ్ తరపున ఆడుతున్న మార్కస్ స్టోయినీస్, శషాంక్ తమదైన శైలిలో మెరుపులు మెరిపించి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మొత్తంగా పంజాబ్ బ్యాటర్ల ధాటికి లక్నో బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

లక్నో బౌలర్లలో సిద్ధార్థ్ 2 వికెట్లు, ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు, మహ్మద్ షమీ, మోసిన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఐడెన్ మార్క్రామ్ వేసిన ఒకే ఓవర్‌లో పంజాబ్ బ్యాటర్లు 32 పరుగులు రాబట్టడం విశేషం. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించాలంటే 120 బంతుల్లో 251 పరుగులు చేయాలి. రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో ఇంత భారీ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందో చూడాలి.

Read More.. ఎట్టకేలకు కేకేఆర్ బోణి.. ఉత్కంఠ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై విజయం

Next Story