- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: ఆర్సీబీని ఢీకొట్టేదెవరు?.. తాడోపేడో తేల్చుకోనున్న గుజరాత్, రాజస్థాన్.. అందరి దృష్టి ఆ కుర్రాడిపైనే

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్‌పై నెగి టైటిల్ పోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మరో ఫైనలిస్ట్‌ను తేల్చే పోరు నేడే. ముల్లాన్‌పూర్ వేదికగానే శుక్రవారం క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. ఈ పోరులో గెలిచిన జట్టు ఫైనల్‌లో ఆర్సీబీని డీకొట్టనుంది. బెంగళూరు చేతిలో ఓటమితో జీటీ నిరాశలో ఉండగా.. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సంచలన విజయంతో ఆర్‌ఆర్ ఆత్మవిశ్వాసంతో ఉంది. బలాబలాల పరంగా ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తుండటంతో నేటి మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. లీగ్ దశలో ఇరు జట్లు రెండుసార్లు తలపడగా.. చెరో విజయాన్ని నమోదు చేశాయి. మరి, కీలకమైన క్వాలిఫయర్-2లో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.
గుజరాత్ బలాబలాలు
తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ చేతిలో ఓటమి గుజరాత్ టైటాన్స్‌కు నిరాశకు గురి చేసింది. ఆ ఓటమి ప్రభావం జట్టుపై పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్సీబీతో మ్యాచ్‌లో లోపాలను సరిదిద్దుకుని నేటి మ్యాచ్‌లో బరిలో దిగడంపై జీటీ దృష్టి పెట్టి ఉంటుంది. సాయి సుదర్శన్, గిల్, బట్లర్ జట్టుకు బ్యాటింగ్‌లో ప్రధాన బలం. తొలి క్వాలిఫయర్‌లో ఈ ముగ్గురు నిరాశపరిచారు. మిడిలార్డర్ బలంగా లేకపోవడంతో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. రాహుల్ తెవాటియా పోరాడినా మరో ఎండ్‌లో సహకారం లేకపోవడంతో అతని పోరాటం సరిపోలేదు. ఆర్‌ఆర్‌పై గిల్, సుదర్శన్, బట్లర్ రాణిస్తే జీటీకి తిరుగుండదు. మళ్లీ నిరాశపరిస్తే మాత్రం ఫైనల్ ఆశలు గల్లంతైనట్టే. ఇక బౌలింగ్ విషయానికొస్తే తొలి క్వాలిఫయర్‌లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోయినా ఆ జట్టు బౌలింగ్ దళం బలంగానే ఉంది. రబాడ, రషీద్ ఖాన్, సిరాజ్ జీటీకి ప్రధాన అస్త్రాలు. హోల్డర్ కూడా ఫామ్‌లోనే ఉన్నాడు. ఆర్‌ఆర్‌తో పోలిస్తే జీటీ బౌలింగ్ దళం బలంగా ఉంది. వైభవ్‌ను, జురెల్‌ను కట్టడి చేస్తే ఆర్‌ఆర్‌ను మోస్తరు స్కోరుకే పరిమితం చేయొచ్చు.
రాజస్థాన్ బలాబలాలు
ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ను చిత్తు చేసిన తీరు రాజస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్‌లో తమ బలాన్ని తెలియజేసింది. బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆ జట్టుకు ప్రధాన బలం. అతను 15 మ్యాచ్‌ల్లో 680 రన్స్ చేశాడు. స్ట్రైక్‌రేట్ 242.85 ఉండటం విశేసం. ప్రస్తుతం ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు చేసింది అతనే. వైభవ్ తర్వాత ధ్రువ్ జురెల్ నిలకడగా రాణిస్తున్నాడు. 15 మ్యాచ్‌ల్లో 508 పరుగులు చేశాడు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్(426) కూడా టచ్‌లోనే ఉన్నాడు. కానీ, నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ప్రధాన ఆర్‌ఆర్ బ్యాటింగ్ వైభవ్, జురెల్ మీదనే ఆధారపడింది. కెప్టెన్ రియాన్ పరాగ్, జడేజా, ఫెరీరా, హెట్మేయర్, షనక వంటి వారు ఆకట్టుకోవడం లేదు. టాపార్డర్ బలంగానే ఉన్నా మిడిలార్డర్, లోయర్ ఆర్డర్‌లో రాజస్థాన్ బలహీనంగా ఉంది. ఇక, బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ ఆర్‌ఆర్ కీలకంగా మారాడు. 15 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీశాడు. అతని తర్వాత నాండ్రే బర్గర్, బ్రిజేశ్ శర్మ ఆకట్టుకుంటున్నారు. జీటీ బౌలింగ్‌తో పోలిస్తే రాజస్థాన్ బౌలింగ్ బలహీనంగానే ఉందని చెప్పొచ్చు.
వైభవ్‌పైనే అందరి దృష్టి
రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి జట్లను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అతను క్రీజులో పాతుకపోయాడంటే ఆర్‌ఆర్ విజయం ఖాయమైనట్టే. ఎస్‌ఆర్‌హెచ్‌పై వైభవ్ సృష్టించిన విధ్వంసంతో ఇది మరోసారి నిరూపితమైంది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ అందరి దృష్టి అతనిపైనే ఉంది. ఈ మ్యాచ్‌లోనూ ఎలా ఆడతాడు?. ఇంకో రికార్డు బద్దలు కొడతాడా?.. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదుతాడా?.. ఇలా అతనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. రాజస్థాన్‌తో మ్యాచ్ అంటే ప్రత్యర్థి టీమ్ మొదట వైభవ్‌ను ఎలా ఆపాలి? అనే దాని గురించి ప్లాన్ చేస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. ఈ సీజన్‌లో ఆర్‌ఆర్, జీటీ జట్లు రెండుసార్లు తలపడగా.. అతన్ని కట్టడి చేయడంలో జీటీ విజయవంతమైందనే చెప్పాలి. రెండు మ్యాచ్‌ల్లోనూ 31, 36 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లోనూ అతన్ని త్వరగా అవుట్ చేసేందుకు గుజరాత్ పక్కా వ్యూహంతో బరిలోకి దిగనుంది. ప్రత్యర్థి జట్లు ఎలాంటి ప్లాన్స్‌తోనైనా రాని తన ప్రణాళికలు తనకు ఉన్నాయని వైభవ్ చెబుతున్నాడు. రాబోయే మ్యాచ్ గురించి ఎక్కువగా ఆలోచించని, మైదానంలోకి దిగాక నా ఆట ఏంటో చూపిస్తానని చెప్పాడు. నేటి మ్యాచ్‌లో వైభవ్ గనక రెచ్చిపోయాడో ఆర్‌ఆర్‌ను ఓడించడం గుజరాత్‌కు సవాల్‌తో కూడుకున్నదే.
జీటీ 7.. ఆర్ఆర్ 3
రాజస్థాన్‌తో పోరులో గుజరాత్‌దే పైచేయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు 10 మ్యాచ్‌లు ఆడాయి. అందులో జీటీనే 7 విజయాలు సాధించింది. ఆర్‌ఆర్ మూడింట మాత్రమే గెలిచింది. మరి, జీటీ ఆధిపత్యానికి గుజరాత్ ఈ పోరులో చెక్ పెట్టి ఫైనల్‌కు దూసుకెళ్తుందా? చూడాలి.






