IPL 2026: సొంతగడ్డపై పరువు కాపాడిన క్లాసెన్, నితీశ్.. లక్నో టార్గెట్ ఎంతంటే?

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-05 11:48:02  IST  )

సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాట పటిమ కనబరిచింది.

IPL 2026: సొంతగడ్డపై పరువు కాపాడిన క్లాసెన్, నితీశ్.. లక్నో టార్గెట్ ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాట పటిమ కనబరిచింది. ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆరంభంలో కష్టాల్లో పడినా, మిడిలార్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ముందుగా.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఆరంభం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. లక్నో బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, లివింగ్‌స్టోన్ వంటి కీలక వికెట్లను త్వరత్వరగా కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒక దశలో తక్కువ స్కోరుకే పరిమితమవుతుందేమో అనిపించింది.

ఆదుకున్న క్లాసెన్ - నితీష్ జోడీ..

నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో హెన్రిచ్ క్లాసెన్, యువ కెరటం నితీష్ కుమార్ రెడ్డి బాధ్యతాయుతంగా ఆడారు. వీరిద్దరూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. క్లాసెన్ తనదైన శైలిలో సిక్సర్లతో విరుచుకుపడగా, నితీష్ అతనికి చక్కని సహకారం అందించాడు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకుని జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన అనికేత్ వర్మ కూడా విలువైన పరుగులు జోడించి పర్వాలేదనిపించాడు. దీంతో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో షమీ రెండు, ప్రిన్స్ రెండు, ఆవేశ్ ఖాన్ రెండు తీయగా.. సిద్ధార్థ్, దిగ్వేశ్ తలో వికెట్ తీశారు. మొత్తానికి 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న లక్నో సూపర్ జెయింట్స్‌ను హైదరాబాద్ బౌలర్లు ఎలా అడ్డుకుంటారో వేచి చూడాలి.

Next Story