ఐపీఎల్‌-2026: బిర్యానీని దాటేసిన బర్గర్.. స్విగ్గీ ఆసక్తికర నివేదిక విడుదల

by Ramesh Naini |

ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, మైదానంలో ఆటతో పాటు ఫుడ్ లవర్స్ సందడి కూడా కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

ఐపీఎల్‌-2026: బిర్యానీని దాటేసిన బర్గర్.. స్విగ్గీ ఆసక్తికర నివేదిక విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, మైదానంలో ఆటతో పాటు ఫుడ్ లవర్స్ సందడి కూడా కొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ సీజన్‌లో క్రికెట్ అభిమానుల ఆహారపు అలవాట్లలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రతి ఏటా అగ్రస్థానంలో ఉండే బిర్యానీని ఈసారి ‘బర్గర్’ వెనక్కి నెట్టింది.

ఒక్క ఆర్డర్‌.. 100 బర్గర్లు!

ఈ సీజన్‌లో బర్గర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఒక ఆసక్తికర సంఘటనలో, ఒక వినియోగదారుడు ఒకే ఆర్డర్‌లో ఏకంగా 100 బర్గర్లను ఆర్డర్ పెట్టి స్విగ్గీ వర్గాలను ఆశ్చర్యపరిచారు. మరొక కస్టమర్ టోర్నీ ఆరంభం నుంచి ఇప్పటివరకు 34 సార్లు ఆర్డర్లు ఇవ్వగా, ఒకే ఆర్డర్‌పై గరిష్టంగా ఒక వ్యక్తి రూ. 6,801 ఖర్చు చేశారు. ఇక ఆఫర్లను ఉపయోగించుకుని ఒక స్మార్ట్ యూజర్ ఏకంగా రూ. 12,947 ఆదా చేయడం విశేషం.

ముంబై మ్యాచ్‌లకు ఫుల్ డిమాండ్

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన మ్యాచ్‌ల సమయంలోనే అత్యధికంగా ఫుడ్ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ నివేదికలో తెలిపింది. ఆర్‌సీబీ (RCB) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) మ్యాచ్ సందర్భంగా ఆర్డర్ల ప్రవాహం భారీగా పెరిగింది. ఫుడ్ ఆర్డర్లలో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ నగరాలు మొదటి మూడు స్థానాల్లో నిలవగా.. పాట్నా, పుణే వంటి నగరాల్లోనూ డిమాండ్ భారీగా పెరిగింది. ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన డెలివరీ కేవలం 10 నిమిషాల 42 సెకన్లలోనే పూర్తయి రికార్డు సృష్టించింది.

యాప్‌లోనే ఆర్డర్ సదుపాయం

జియో హాట్‌స్టార్ (JioHotstar), స్విగ్గీ భాగస్వామ్యంలో ప్రవేశపెట్టిన ‘ఇన్-యాప్ ఆర్డరింగ్’ ఫీచర్ ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ‘మ్యాచ్ ఆన్.. మంచ్ ఆన్’ పేరుతో నిర్వహించిన ప్రచారం 690కి పైగా నగరాల్లోని దాదాపు 3.7 కోట్ల మంది వీక్షకులను ఆకట్టుకుంది. మ్యాచ్ చూస్తూనే నేరుగా ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే సదుపాయం ఉండటంతో స్నాక్స్ కేటగిరీలో బర్గర్ల విక్రయాలు బిర్యానీని అధిగమించాయి.

Next Story