- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగుళూరులో వడగళ్ల వాన బీభత్సం
కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం భారీ వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం భారీ వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. అప్పటివరకు సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా మారిపోయి, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వడగళ్ల వర్షం నగరాన్ని ముంచెత్తింది. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో నగరంలో రికార్డు స్థాయిలో 88 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అకస్మాత్తుగా కురిసిన ఈ భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కార్యాలయాల నుండి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ భారీ వర్షం నగరంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. శివాజీనగర్‌లోని బౌరింగ్ ఆసుపత్రి వద్ద వర్షం ధాటికి ఒక భారీ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగించి సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. కాగా రానున్న 24 గంటల్లో మరోసారి భారీ వర్షం పడే అవకాశం ఉందని, నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.






