ఓ వానమ్మా.. నీ జాడ ఎక్కడమ్మా..!

by Jakkula.Mamatha |

"ఓ వానమ్మా.. నీ జాడ ఎక్కడమ్మా..! జరా వచ్చి పోవమ్మా..! ముందు మురిపించావు.. ఇప్పుడు ఏడిపిస్తున్నావు..

ఓ వానమ్మా.. నీ జాడ ఎక్కడమ్మా..!
X

దిశ, దౌల్తాబాద్: "ఓ వానమ్మా.. నీ జాడ ఎక్కడమ్మా..! జరా వచ్చి పోవమ్మా..! ముందు మురిపించావు.. ఇప్పుడు ఏడిపిస్తున్నావు.. మేమేం ఏం పాపం చేశామమ్మా.. ఒక్కసారన్నా వచ్చి పోవమ్మా.. అంటూ రైతన్నలు ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు. జూన్ ప్రారంభంలో పలకరించిన వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు నింపగా, ఇప్పుడు కనిపించకుండా పోవడంతో ఆ ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి. మొదట కురిసిన వర్షాలకు స్పందించిన రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించి, అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేశారు. దుక్కులు దున్ని, పొలాలను సిద్ధం చేసి, విత్తనాలు వేశారు. అయితే విత్తిన తరువాత దాదాపు పది రోజులుగా వర్షం జాడ లేకపోవడంతో మొలకెత్తిన పంటలు ఎండుముఖం పట్టే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

దౌల్తాబాద్ మండలంలోని కోనాపూర్, దొమ్మాట, ముబారస్పూర్, గాజులపల్లి, ఇందుప్రియాల్, తిరుమలాపూర్, మహమ్మద్‌షాపూర్ తదితర గ్రామాల్లో సుమారు 70 శాతం మంది రైతులు ఇప్పటికే విత్తనాలు వేశారు. వర్షం కురుస్తుందనే నమ్మకంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి వ్యవసాయ పనులు పూర్తి చేసిన రైతులు ఇప్పుడు వాన కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల విత్తిన విత్తనాలు మొలకెత్తిన తేమ లేక పసుపురంగులోకి మారుతున్నాయని రైతులు వాపోతున్నారు. మరికొన్ని పొలాల్లో మొలకలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వర్షాలు మరో నాలుగు ఐదు రోజులు ఆలస్యమైతే మళ్లీ విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీంతో పెట్టుబడి భారం రెట్టింపు అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు పెరిగిపోతుండగా, మరోవైపు వర్షాభావం వెంటాడుతుండటంతో రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. ఆకాశంలో మేఘాలు కనిపించిన ప్రతిసారీ ఆశగా చూసే రైతులకు నిరాశే మిగులుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లో తిరుగుతూ ఆకాశాన్ని చూస్తూ గడుపుతున్నారు. "మొదట వర్షం పడటంతో ధైర్యం చేసి విత్తనాలు వేశాం. ఇప్పుడు వర్షం లేక పంటలు ఎండిపోతున్నాయి. మళ్లీ విత్తాలంటే అదనపు ఖర్చు. ప్రభుత్వం కూడా మాకు అండగా నిలవాలి" అని రైతులు కోరుతున్నారు. వ్యవసాయం పూర్తిగా ప్రకృతి పైనే ఆధారపడిన నేపథ్యంలో, ఇప్పుడు రైతులందరి చూపు ఆకాశం వైపే ఉంది. "ఓ వానమ్మా... ఒక్కసారి కరుణించి కురవమ్మా.. రైతన్నల కష్టాలు తీర్చమ్మా.." అంటూ మండల రైతులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం మండల వ్యాప్తంగా వర్షం కోసం రైతుల ఎదురుచూపులు కొనసాగుతుండగా, వాన కురిస్తేనే రైతుల ముఖాల్లో మళ్లీ చిరు నవ్వులు కనిపించే పరిస్థితి నెలకొంది.

50 వేలు అప్పు చేశాను: రైతు రాజమ్మ

నేను 5 ఎకరాలు మక్కా జొన్న పెట్టిన జూన్ లోనే వర్షాలు మొదలవడంతో మూడు ఎకరాలలో పంట సాగు కోసం మందు బస్తాలు విత్తనాలు 50 వేలు అప్పు చేసి తెచ్చాను. తీరా అవి నాటినాక వర్షాలు ముఖం చాటేయడంతో ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితి ఉంది. రైతన్న పరిస్థితి అసలే ఇబ్బందికరం అనుకుంటే ప్రకృతి కరుణించకపోవడంతో మరింత అద్వానంగా తయారైంది.

ఏం చేయాలో తోచడం లేదు: తిర్మలాపూర్ రైతు రాములు

మూడు ఎకరాల మక్కా వేసిన అని తిర్మలాపూర్ రైతు రాములు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే వర్షాలు పడతాయని ఆశతో వేల రూపాయల పెట్టుబడి తెచ్చి విత్తనాలు నాటాం. ఒక దుక్కి మందు సంచి ప్రస్తుతం ఉన్న రేటు, గ్రోమోర్ 20.20.= 2150 రూపాయలకు అమ్ముతున్నారు. గత సంవత్సరం 1300 నుంచి 1400 ఉండేది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అంతా నిరాశలే కనిపిస్తున్నాయి. యూరియా దొరకక మేమందరం సతమతం అవుతున్నాం. ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో పెట్టిన విత్తనాలు మొలకెత్తకుండా అనే పాడైపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. మళ్లీ విత్తనాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ మా రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము అని రైతు రాములు తెలిపారు.

Next Story