- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పలకరించిన వర్షం.. వ్యవసాయ పనుల్లో వేగం పెంచిన రైతన్నలు!
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికే 75 శాతానికి పైగా రైతులు తమ పొలాల్లో పత్తి, సోయాబీన్, కంది, పెసర, మొక్కజొన్న తదితర పంటల విత్తనాలు వేశారు.

దిశ, ఝరాసంగం: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికే 75 శాతానికి పైగా రైతులు తమ పొలాల్లో పత్తి, సోయాబీన్, కంది, పెసర, మొక్కజొన్న తదితర పంటల విత్తనాలు వేశారు. గత కొన్ని రోజులుగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల వ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు విస్తారంగా వర్షం కురిసింది. మండలంలో సగటున 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఝరాసంగం, బర్దిపూర్, చిల్లేపల్లి, సిద్ధాపూర్, దేవరంపల్లి, ఏడాకులపల్లి, చిల్కపల్లి, కృష్ణాపూర్, మచునూర్, పొట్టిపల్లి తదితర గ్రామాల్లో పంటలకు అనుకూలంగా వర్షం కురిసింది.
దీంతో రైతుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఇటీవల తుంపర సేద్యం వంటి ప్రత్యామ్నాయ పద్ధతులు ఆశ్రయించి పంటలను కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. తాజాగా కురిసిన వర్షంతో సాగు పనులు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండల వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో 40 వేల ఎకరాలు రైతులు సాగు చేసే అవకాశం ఉందని మండల వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 25 వేల ఎకరాల వరకు పంటలను వేసినట్లు మండల వ్యవసాయ అధికారి వెంకటేశం పేర్కొన్నారు. రాత్రి కురిసిన వర్షంతో మరో 15 వేల ఎకరాల్లో రైతులు విత్తనాలు వేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు వర్షంతో పొలాలు తడిసి ముద్దవగా రైతన్న ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.






