కాక్రోచ్ పార్టీ పోరాటానికి రైతుల మద్దతు? జంతర్ మంతర్ నుండి సీజేపీ చీఫ్ కీలక పిలుపు

by Prasad Jukanti |

నీట్ అవకతవకలపై జంతర్ మంతర్ వద్ద సీజేపీ రెండో రోజు ధర్నా కొనసాగుతోంది.

కాక్రోచ్ పార్టీ  పోరాటానికి రైతుల మద్దతు? జంతర్ మంతర్ నుండి సీజేపీ చీఫ్ కీలక పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ ఎగ్జామ్ అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‍తో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ధర్నా రెండవరోజు కొనసాగుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం సైతం తమ నిరసన కంటిన్యూ చేస్తున్నారు. ఈ సందర్భంగా సీజేపీ పార్టీ చీఫ్ అభిజిత్ దిప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము చేపట్టిన ఈ ఆందోళనకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, కార్మికులు మద్దతు ఇవ్వాలని కోరారు. గతంలో రైతులు చేపట్టిన ఆందోళనకు దేశంలోని యువత మద్దతు ఇచ్చిందని ఇప్పుడు మీ పిల్లల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలన్నారు. నీట్ పరీక్ష నిర్వహణ వైఫల్యం కారణంగా ఇప్పటి వరకు 12 మందికి పైగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారని దయచేసి జంతర్ మంతర్ వద్దకు వచ్చి మాకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులంతా ఇవాళ మీ ఆదివారాన్ని ఈ ధర్నా కోసం కేటాయించాలని పిలుపునిచ్చారు. నీట్ ఎగ్జామ్ అనంతరం విద్యార్థులు సైతం ధర్నాకు అండగా తరలి రావాలన్నారు.

పోలీసులు సహకరించాలి:

సీజేపీ ధర్నాకు శనివారం సాయంత్రం 5 గంటల వరకే అనుమతి ఉందని దీంతో వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఢిల్లీ పోలీసులు శనివారం రాత్రి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించే వరకు తాము జంతర్ మంతర్ నుండి కదిలేది లేదని అభిజీత్ దిప్కే స్పష్టం చేశారు. రాత్రి సమయంలో నిరసన స్థలంలో లైట్లు ఆపేశారని, తాగునీరు, వాష్‌రూమ్ సౌకర్యాలు నిలిపివేశారని ఆందోళనకారులు ఆరోపించారు. ఆ తర్వాత నీటి సరఫరా, విద్యుత్ పునరుద్ధరించినట్లు తెలిపారు. పోలీసులు ప్రజలను ఆందోళన స్థలానికి రాకుండా అడ్డుకోవద్దని, విద్యార్థుల ఆత్మహత్యలకు న్యాయం జరగాలనే తాము శాంతియుతంగా పోరాడుతున్నామని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కోరారు.

27న నిరాహార దీక్ష:

ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఈ నిరసనకు సంఘీభావం ప్రకటించారు. జూన్ 27 లోగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే తాను నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

Next Story