టీఆర్ఎస్‌లో తారాస్థాయికి చేరిన అసమ్మతి సెగలు

by  |
టీఆర్ఎస్‌లో తారాస్థాయికి చేరిన అసమ్మతి సెగలు
X

దిశ, శేరిలింగంపల్లి: టీఆర్ఎస్‎లో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచే టీఆర్ఎస్‎లో లుకలుకలు మొదలైనా అవి ఇప్పుడు తారాస్థాయికి చేరుతున్నాయి. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, నూతన కార్పొరేటర్ల తీరుపై అదే పార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు ఎమ్మెల్యేనే కాదు ఇటీవల ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లను సైతం టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అలాగే ఎమ్మెల్యే గాంధీ కార్యకర్తలు, నాయకులతో దురుసుగా ప్రవర్తించడం సైతం వారిలో నిరాశను నింపుతున్నది. ప్రతిపక్షంతోనే కాకుండా స్వపక్షంతోనూ విమర్శలు ఎదురవుతుండడంతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే టీఆర్ఎస్ లో రాజుకుంటున్న అసమ్మతిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది.

వరుస విజయాలతో జోరుమీద ఉన్న టీఆర్ఎస్ లోకి గతంలో వలసల పరంపర సాగింది. ఒకానొక దశలో మిగతా పార్టీల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకైనా అభ్యర్థులు దొరుకుతారా అన్నట్లుగా కారు ఎక్కేందుకు పోటీపడ్డారు. కానీ ఈ మధ్యకాలంలో టీఆర్ ఎస్ జోష్ తగ్గింది. దీంతో అక్కడ ఉన్నవారికే సరైన అవకాశాలు రాకపోవడంతో పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న వారిని కాపాడుకోవడంపై దృష్టి పెట్టే పరిస్థితులొచ్చాయి. ఈ మధ్య జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచే ఈ తరహా పక్క చూపులు ఎక్కువయ్యాయని చెప్పాలి. అధికార పార్టీలో ఉంటే అన్నీ కలిసి వస్తాయని ఆశించిన అక్కడ పోటీ ఎక్కువగా ఉండడంతో చాలా మంది నేతలకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సరైన అవకాశాలు రాలేదు. అలా అని మరో ప్రత్యామ్నాయం దొరకలేదు. కానీ ఇప్పుడిప్పుడే బీజేపీ పుంజుకుంటుండడంతో అటువైపు వెళ్లేందుకు చాలామంది నాయకులు ఆసక్తి చూపుతున్నారు. కారు దిగి కమలం గూటికి చేరాలనుకునే వారు ఇప్పటి నుంచే అక్కడ ప్లాట్ ఫామ్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సిగ్గుమాలిన చర్య..

టీఆర్ఎస్ లో అసమ్మతి రోజురోజుకూ ఎక్కువవుతుందనేందుకు ఇటీవల ఓ కార్పొరేటర్ చేసిన వ్యాఖ్యలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆమె అధికారుల తీరుపైనే కాకుండా కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేను కూడా తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒక్కడుగు ముందుకేసి కొత్తగా ఎన్నికైనన వారు కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేయకుండానే ప్రజాప్రతినిధి హోదాలో సమావేశాలకు హాజరవ్వడం సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నానంటూ దుయ్యబట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులతో కలిసి ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశానికి ప్రస్తుతం ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న తమను ఆహ్వానించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి మండిపడ్డారు.

తమ పదవీకాలం ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుందని, అప్పటివరకూ తాము కార్పొరేటర్ గా కొనసాగే హక్కు కలిగి ఉన్నట్లు తెలిపారు. అయినప్పటికీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులు నిర్వహించిన సమావేశంలో తమను కాదని కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో సమావేశమవ్వడం ఏంటని ప్రశ్నించారు. కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేయకుండానే ప్రజాప్రతినిధి హోదాలో సమావేశాలకు హాజరవ్వడం సిగ్గుమాలిన చర్యని, ఆ విషయం కూడా తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 27వ తేదీన జరిగే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లుగా హాజరయ్యేది తామేనన్న విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్, కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి చట్ట వ్యతిరేక చర్యను కౌన్సిల్ లో ఎండగడతామని హెచ్చరించారు.

కారు దిగేందుకు సిద్ధం..

ఇలా ఈ ఒక్క కార్పొరేటర్ మాత్రమే కాదు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చాలామంది ప్రజా ప్రతినిధులు ఈమధ్యకాలంలో అసమ్మతి గళాలు వినిపిస్తున్నారు. కొందరు బహిరంగంగా ప్రకటనలు చేస్తే, మరికొందరు వారివారి సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు వినికిడి. పార్టీలో సీనియర్లను కాదని ఎమ్మెల్యే కొత్తవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ సాధన కోసం కొట్లాడిన వారిని పక్కన పెట్టారని మరికొందరు మండిపడుతున్నారు. టీఆర్ ఎస్ లో రాజుకుంటున్న అసమ్మతిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆపార్టీలోకి వలసలు మొదలయ్యాయి. అయితే అధికార పార్టీలో నెలకొన్న అసమ్మతి సెగలను ఎలా కంట్రోల్ చేస్తారు. వారిని ఎలా బుజ్జగిస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


Next Story